భద్రాద్రి కేంద్రంగా దొంగనోట్ల ముఠా


భద్రాచలం: భద్రాచలం కేంధ్రంగా పెద్దఎత్తున దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠాను శుక్రవారం వరంగల్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. భద్రాచలం పట్టణంలో ఇంత పెద్దమొత్తంలో దొంగనోట్ల ముద్రణ జరుగుతున్న విషయాన్ని ఇక్కడి పోలీసులు, నిఘా వ్యవస్థ దృష్టికి రాకపోవటం కూడా చర్చనీయూంశమైంది. భద్రాచలంలోని కొత్తపేట కాలనీకి చెందిన కందుల పవన్ కుమార్ రెడ్డి రూ.16 లక్షల నకిలీ కరెన్సీని హన్మకొండలోని పెట్రోల్ బంకు వద్ద ఓ ప్రవేటు హాస్టల్‌లో దిడిగం మనోజ్‌కుమార్ అనే వ్యక్తికి ఇచ్చి, 90వేల రూపాయల అసలు నోట్లు తీసుకుంటుండగా వరంగల్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు భద్రాచలం చేరుకున్నారు. పవన్‌కుమార్ రెడ్డి ఇంట్లో పూర్తిస్థాయిలో సోదాలు చేశారు. దొంగ నోట్ల ముద్రణలో భాగస్వాముడైన భద్రాచలానికి చెందిన మరో వ్యక్తి పెద్దినేని రవిప్రసాద్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కొత్తపేటలోగల పవన్‌కుమార్ రెడ్డి ఇంట్లోని నకిలీ కరెన్సీ స్వాధీనపర్చుకున్నారు. మొత్తంగా రూ.43.17 లక్షల నకిలీ కరెన్సీ, వాటిని ముద్రించేందుకు ఉపయోగించిన సామాగ్రిని వరంగల్ సీసీఎస్ పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చే సి కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు.

 

వారపత్రిక ముసుగులో...

బూర్గంపాడుకు  చెందిన పెద్దినేని రవిప్రసాద్  భద్రాచలం కేంద్రంగా ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఐటీసీ ఇచ్చే నిధులతో గిరిజన గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఇటీవలనే ఓ వారపత్రికను కూడా స్థాపించాడు. ఇదే పత్రికలో పనిచేస్తున్న పవన్‌కుమార్ రెడ్డి, తన కున్న కంప్యూటర్ పరిజ్ఙానంతో నకిలీ కరెన్సీ నోట్ల తయారు చేస్తున్నాడని, ఇతనికి రవిప్రసాద్ సహకరిస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. సులువుగా డబ్బు సంపాందించాలనే అత్యాశతో రూ.100, 500, 1000 నోట్లను ముద్రించి చెలామణికి సిద్ధమైనట్టుగా చెప్పారు.

 

భద్రాద్రిలో నిఘా నిద్రపోతోందా..?

భద్రాచలం కేంద్రంగా పెద్దఎత్తున దొంగ నోట్లు చెలామణి అవుతున్నట్టుగా కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఖమ్మం జిల్లాలో ఎక్కడ దొంగనోట్ల కేసు నమోదైనా భద్రాచలంతో సంబంధాలు ఉంటున్నట్టుగా గతంలో అనేకమార్లు వెల్లడైంది. ఇటీవలి కాలంలో పొరుగునగల ఛత్తీసగఢ్ వ్యాపారస్తులు, సరిహద్దుల్లో ఉన్న సంతలు, అమాయక ఆదివాసీలను టార్గెట్‌గా చేసుకున్న కొంతమంది పెద్దఎత్తున దొంగనోట్ల చెలామణి చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.



ఈ నకిలీ తయూరీదారులను కనిపెట్టడంలో నిఘా వ్యవస్థ విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దొంగ నోట్ల ముద్రణలో భాగంగా వరంగల్ పోలీసులకు పట్టుబడిన పెద్దినేని రవిప్రసాద్‌కు భద్రాచలంలోని ఓ పోలీస్ అధికారితో కూడా సత్పసంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది. ఈ మొత్తం పరిణామాలతో ఇక్కడి పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించటంతోనే వరంగల్ సీసీఎస్ పోలీసులు.. ఇక్కడి పోలీసులు కూడా సమాచారం లేకుండా దొంగ నోట్ల ముఠాను తీసుకెళ్లటం చర్చకు దారితీసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top