కుదురుకోని సీఎంవో..!

కుదురుకోని సీఎంవో..! - Sakshi


సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు గడుస్తున్నా... ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) మాత్రం ఇంకా కుదురుకోలేదు. సీఎంవోలో ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శులు, ఓఎస్డీలు ఉన్నా.. వారిలో ఎవరికి ఏ బాధ్యత అనేది ఇంకా నిర్ణయించలేదు. దీంతో ఎవరి అధికారం ఏమిటో సచివాలయంలోని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు, విభాగాల అధిపతులకు అర్థం కాని విషయంగా మారింది. దీనివల్ల వివిధ శాఖల నుంచి వస్తున్న ఫైళ్లను క్లియర్ చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. మూడు నెలలుగా ఎలాంటి బాధ్యతలూ లేకుండా ఉన్న ఓ ప్రత్యేకకార్యదర్శి సీఎంవో నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫైళ్ల భారం మొత్తం సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావుపైనే పడుతోంది.  అన్ని ఫైళ్లు చూసే సమయం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 

 సీఎంవోలో ప్రత్యేక కార్యదర్శులుగా స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి ఉన్నారు. ఇప్పటివరకు వారికి అధికారికంగా పనివిభజన చేయలేదు. దీంతో ఫైళ్లేవీ వారి వద్దకు వెళ్లడం లేదు. సీఎం సచివాల యం నిర్వహించే సమావేశాలు, సమీక్షలకు ఈ కార్యదర్శులంతా హాజరవుతున్నారు. కానీ తమ బాధ్యతలపై అధికారిక ఉత్తర్వులు లేకుండా నేరుగా ఆయా శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడి... సీఎం చేసిన సూచనలపై ఎప్పటికప్పుడు సమీక్షించలేని పరిస్థితి నెలకొందని సచివాలయ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు కూడా దేనికైనా సీఎం ముఖ్యకార్యదర్శిని సం ప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో జాప్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. ఆయా ప్రత్యేక కార్యదర్శులకు పని విభజన జరిగితే ఫైళ్లను వారు సీఎం ముందుకు తీసుకెళ్లి వాటి ఆవశ్యకతను వివరించి వెంటనే పరిష్కరించేందుకు వీలవుతుంది. మరీ అత్యవసర ఫైళ్లు   మాత్రమే సీఎం వద్దకు వెళ్తున్నాయనే జరుగుతోంది.

 

 టాస్క్‌ఫోర్స్ కమిటీల్లోనూ..

 

 బడ్జెట్‌తో పాటు, పద్నాలుగు కీలక విభాగాలపై నియమిం చిన టాస్క్‌పోర్స్ కమిటీలపై కూడా అధికారులు పెదవి విరుస్తున్నారు.  తొలుత బడ్జెట్ తయారీలో కొత్త విధానం అంటూ మన ఊరు-మన ప్రణాళిక నుంచి వచ్చిన ప్రతిపాదనలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఆ కార్యక్రమం ముగిసి, వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు వచ్చేసరికి.. ఇప్పుడు వాటి గురించి కాకుండా బడ్జెట్ వినూత్నంగా ఉండాలంటూ టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియమిం చారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తయారీకి సంబంధించి సెప్టెంబర్ 4వ తేదీ నాటికి తొలి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిటీలను ఆదేశించింది. 2 నెలలుగా బడ్జెట్ కసరత్తు ప్రారంభించి ఒక కొలిక్కి తేగా.. ఐదారు రోజుల్లో టాస్క్‌ఫోర్స్ కమిటీ చేసే సిఫారసులు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బడ్జెట్ కసరత్తు కూడా టాస్క్‌ఫోర్స్ కమిటీల్లోని అధికారులతోనే కొనసాగిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అదనంగా వచ్చింది సలహాదారులు, కొందరు నిపుణులు మాత్రమే..    ఆయా శాఖల మంత్రులు లేకపోవడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top