తగ్గుతున్నా బాదుడేనా?

తగ్గుతున్నా బాదుడేనా?


పెట్రోలు, డీజిల్ ధరలపై జనానికి లేదా ఊరట?

 అంతర్జాతీయంగా పతనమవుతున్న ధరలు

 ఆ లాభాన్ని పీల్చేస్తున్న కేంద్రం, రాష్ట్రాలు, చమురు కంపెనీలు

 గత జూన్ నుంచి చూస్తే అంతర్జాతీయ ధర సగానికి సగం పతనం

 రిటైల్‌లో మాత్రం పెట్రోలుపై 15%, డీజిల్‌పై 12% తగ్గింపు

 ఒకవైపు సబ్సిడీ మిగులుతున్నా... భారీగా పన్నులు వేసిన కేంద్రం

 సబ్సిడీ ఆదా రూ.35 వేల కోట్లు; 5 నెలల్లో పన్నుల లాభం 26వేల కోట్లు

 మరోవంక రూ.4 మేర అదనపు వ్యాట్ వడ్డించిన ఏపీ, తెలంగాణ

 మరో 3 రూపాయల లాభం వేసుకున్న చమురు కంపెనీలు

 

 ఎందుకంటే ధర పెరిగితే జనం బాధపడతారు కానీ... తగ్గించకపోతే బాధపడతారా? అనేది సర్కారు లాజిక్కు. ఈ లాజిక్కు విలువ అక్షరాలా నెలకు ఐదు వేలకోట్ల రూపాయలపైనే. ఒక అంచనా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం చివరి ఐదు నెలల్లో... అంటే నవంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకూ పెట్రోలు, డీజిల్‌పై విధించిన అదనపు పన్నుల వల్ల సర్కారు ఖజానాకు ఏకంగా రూ.26,000 కోట్లు వచ్చిపడుతున్నాయి. మరి ఇదంతా జనం జేబుల్లో ఉండాల్సిన సొమ్మేగా!!

 

 యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు పెట్రోలు, డీజిల్‌పై భారీ సబ్సిడీ భారాన్ని మోసింది. తరవాత మెల్లగా పెట్రోలు ధరలు పెంచుతూ... చివరకు సబ్సిడీని తొలగించి మార్కెట్ ధరలతో సరిసమానం చేసేసింది. అక్కడి నుంచి అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పాటే మన ధరలూ కదలటం మొదలెట్టాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరగటం... అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గటం. అయితే డీజిల్‌పై కూడా నెలకు అర్ధరూపాయి పెంచటాన్ని యూపీఏ ప్రభుత్వం ఆరంభించింది. నొప్పి తెలియకుండా భారం మోపటం మొదలెట్టింది. అలా 18 నెలలపాటు రూ.9 పెంచాక... నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో అవి మార్కెట్ ధరల సమీపానికి వచ్చాయి. ఇంతలో ఉన్నట్టుండి అంతర్జాతీయంగా ధరలు పతనం కావటం మొదలెట్టాయి. ఇది మోదీ ప్రభుత్వానికి కలిసివచ్చింది. అంతర్జాతీయ ధరలు తగ్గినా... ఇక్కడ రిటైల్ ధరల్ని తగ్గించకపోవటంతో గతేడాది అక్టోబర్లో డీజిల్ ధరలు కూడా మార్కెట్ ధరలతో సమానమయ్యాయి. దీంతో అప్పటి నుంచి డీజిల్‌పై కూడా సబ్సిడీ మాయమయింది. ఇటీవలి బడ్జెట్లో ప్రభుత్వం చెప్పిన అంచనాల ప్రకారమే ఈ ఏడాది క్రూడ్ ధరల తగ్గుదల వల్ల దాదాపు

 రూ. 35,000 కోట్ల సబ్సిడీ సొమ్ము ఆదా అవుతోంది!!.

 - సాక్షి, బిజినెస్ విభాగం

 

 లాభాన్ని పీల్చేస్తున్న కేంద్రరాష్ట్రాలు, చమురు సంస్థలు

 ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతుండగా ఆ ప్రయోజనాన్ని పూర్తిగా ప్రజలకు బదలాయించకుండా ప్రభుత్వాలు పీల్చేశాయి. కేంద్రం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని దాదాపు రెట్టింపు చేసేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలకు పెట్రోల్, డీజిల్ ధరలపై స్వేచ్ఛనివ్వడంతో క్రూడ్ ధర పతనం దరిమిలా ఆగస్టు నుంచి అవి కూడా రిటైల్ ధరల్ని తగ్గించటం మొదలెట్టాయి. ఓ మూడు నెలలు తగ్గించగానే... హఠాత్తుగా నవంబర్ నుంచి ఈ తగ్గింపును అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవడం మొదలెట్టాయి. కేంద్రం నవంబర్ నుంచి నాలుగు దఫాలు ఎక్సైజ్ సుంకం పెంచేసి లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ.7.75, డీజిల్‌పై రూ.6.5 వడ్డించేసింది. దాంతో ప్రస్తుతం ఎక్సైజ్ సుంకం లీటరు పెట్రోలుపై రూ.17కు, డీజిల్‌పై రూ.10.50కి చేరింది. దీనికితోడు ధర తగ్గిపోవటం వల్ల తమ వాటా పన్ను తగ్గుతోందని భావించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.4 చొప్పున వ్యాట్‌ను (వాల్యూ యాడెడ్ ట్యాక్స్) వడ్డించేశాయి. చిత్రమేంటంటే సందట్లో సడేమియా రీతిన తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా మూడు రోజుల కిందట చమురు మార్కెటింగ్ కంపెనీలు కూడా లీటరుపై రూ.3 చొప్పున ధరను పెంచేశాయి. మొత్తమ్మీద గడిచిన ఐదారు నెలల్లో వినియోగదారుడికి లీటరు పెట్రోలుపై రూ.15, డీజిల్‌పై 13.50 మిగలాల్సి ఉన్నా దాన్ని కేంద్రం, రాష్ట్రాలు, చమురు కంపెనీలు కలిసి పీల్చేశాయి. అదీ జరి గింది. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటేంటంటే దేశంలోని ఏ రాష్ట్రం లోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  మాదిరి పెట్రోల్, డీజిల్‌పై 34 శాతం వ్యాట్ లేదు.

 

 సబ్సిడీ మిగిలినా.. సంతృప్తి లేదు..

 

 నిజానికి ధరల్ని మార్కెట్‌కు వదిలేసినపుడు అంతర్జాతీయ హెచ్చుతగ్గులకు అనుగుణంగా మన ధరలూ కదలాలి. మరి గతేడాది జూన్ నుంచి చూసుకున్నపుడు అంతర్జాతీయంగా భారత్ కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ ధరలు దాదాపు సగానికి పతనమయ్యాయి. కానీ మన రిటైల్ ధరలు 12-15 శాతం తప్ప ఎక్కువ తగ్గలేదు! కారణమేంటంటే... పెరిగినప్పుడల్లా జనంపై భారం మోపిన ప్రభుత్వం, తగ్గినపుడు మాత్రం ఆ లాభాన్ని తన ఖాతాలో వేసుకోవటం మొదలెట్టింది. ఒకవైపు సబ్సిడీలు తొలగించేసి... మరోవైపు ధరలు కూడా తగ్గించకుండా ప్రభుత్వం తన ఖజానా నింపుకోవటానికి ప్రాధాన్యమివ్వటమే ఇక్కడ వినియోగదారులకు మింగుడు పడని అంశం.

 

 పెరిగితే అంతే సంగతులు!




 

 ఇటీవలి బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఓ విన్యాసం చేశారు. పెట్రోలు, డీజిల్‌పై పెంచిన ఎక్సైజ్ సుంకం నుంచి లీటరుకు రూ.4 చొప్పున రోడ్డు సెస్సుకు బదలాయిస్తున్నట్లు చెప్పారు. అంటే లీటరుకు రూ.4 చొప్పున రోడ్డు సెస్సు ఖాతాలో కనిపిస్తుందన్న మాట. అయితే వెంటనే ఆర్థిక శాఖ బాంబు పేల్చింది. రూ.4 బదలాయింపుతో ఎక్సైజ్ సుంకం మామూలు స్థాయికి చేరిందని, భవిష్యత్తులో పెట్రో ధరలు పెరిగితే ఈ సుంకం నుంచి సర్దుబాటు చేయటం అసాధ్యం కనక ధరల పెంపే శరణ్యమని స్పష్టంచేసింది. ఔరా!!


 




 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top