కంగాళీ.. కాంగ్రెస్!

కంగాళీ.. కాంగ్రెస్! - Sakshi


కమిటీలు లేని జాతీయ పార్టీ తొమ్మిది నెలలుగా ఇదే పరిస్థితి పీసీసీ చీఫ్ సొంత జిల్లాలోనే ఈ దుస్థితి కాంగ్రెస్ పటిష్టానికి నేడు జిల్లా స్థాయి చర్చలు  పాల్గొనేది ఎవరో   తెలియని అయోమయం

 


వరంగల్ : జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఆ పార్టీకి తొమ్మిది నెలలుగా కనీసం కమిటీలు కూడా లేవు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలోనే జిల్లా కమిటీ లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. సాధారణ ఎన్నికల్లో కోలుకోలేని విధంగా   దెబ్బతిన్న కాంగ్రెస్‌ను గాడిలో పెట్టేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇదే రోజు అన్ని జిల్లాలో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇటీవల పీసీసీ స్థాయిలో జరిగిన సమావేశంలో పాల్గొనని నేతలు ఈ చర్చల్లో పాల్గొనాలని హస్తం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. జిల్లాలో ఎమ్మెల్యే, ఆ స్థాయి నేతలు వరుసగా పార్టీని వీడి వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో స్థైర్యం నింపాల్సిన కాంగ్రెస అధిష్టానం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పీసీసీ స్థాయిలో ఇష్టారీతిన పదవులు కట్టబెడుతున్న లక్ష్మయ్యకు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే విషయంలో పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులే అసహనం వ్యక్తం చేస్తున్నాయి.



స్పందన లేని ‘పొన్నాల’



గత ఏప్రిల్ నుంచి జరిగిన సాధారణ, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందింది. అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు. అధికారంపోవడం, నాయకుల క్రమశిక్షణ రాహిత్యంతో జిల్లా కాంగ్రెస్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ ఎన్నికల్లో ఓటమిని పాఠాలను అధిగించి మళ్లీ బలోపేతం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం అన్ని స్థాయిల్లో సమర్థులైన నాయకుల కోసం అన్వేషిస్తోంది. జిల్లాలో మాత్రం దీనికి విరుద్ధమైన పరిస్థితి ఉంది. కనీసం కార్యవర్గాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు కోసం డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి  2014 ఆగస్టులో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు ప్రతిపాదనలు పంపారు.



నాయినిని పూర్తి స్థాయి డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ అఖిలభారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) జనవరి 12న నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నా.. జిల్లా కార్యవర్గం ఏర్పాటు కోసం పొన్నాల మాత్రం స్పందించడంలేదని కాంగ్రెస్ వర్గాలు వాపోతున్నాయి. కాగా ఆదివారం జరిగే సమావేశంలో ఎవరు పాల్గొంటారనేది తెలియని అయోమయ స్థితిలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారంటే కాంగ్రెస్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top