చేయి తడిపితే.. ‘పరీక్ష’ లేదు!

చేయి తడిపితే.. ‘పరీక్ష’ లేదు! - Sakshi


వరంగల్ సిటీ : వరంగల్ వ్యవసాయ మార్కెట్‌ను కలెక్టర్‌తో పాటు జేసీ సందర్శించి 24గంటలు కూడా కాలేదు... వారు సీసీఐ అధికారులకు జారీ చేసిన ఆదేశాలు, ఇచ్చిన సూచనల అమలు మాటేమో కానీ... తాజాగా సీసీఐ గుమస్తాల చేతివాటం వెలుగు చూసింది. రైతులు తీసుకొచ్చే పత్తిని సక్రమంగా కొనుగోలు చేయాలని, తేమ విషయంలో జాగ్రత్తలు పాటించాలన్న అధికారుల ఆదేశాలు అమలుకు నోచుకోని వైనం కూడా బయటపడింది. సీసీఐ గుమస్తాలపై పర్యవేక్షణ కరువవడంతో వారు ఆ డిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా సాగుతోంది. వారి వైఖరి కారణంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.



డబ్బు ఇస్తే ఓకే...

వరంగల్ మార్కెట్‌కు శుక్రవారం 15వేల బస్తాల వరకు పత్తి అమ్మకానికి రాగా, 80కి పైగా వాహనాల్లో లూజ్ పత్తిని రైతులు తీసుకొచ్చారు. మార్కెట్‌కు వచ్చే పత్తిని ఎక్కువ భాగం సీసీఐ అధికారులే కొనుగోలు చేయాలన్న ఉన్నతాధికారులను ఆదేశాలతో అధికారులు గుమస్తాలను శుక్రవారం గేట్ వద్దే మొహరించారు. వచ్చిన వాహనాల్లోని పత్తి తేమ శాతాన్ని అక్కడికక్కడే పరీక్షించడం, దాని ప్రకారం ధర ఖరారు చేసి సీసీఐ లీజ్‌కు తీసుకున్న మిల్లులకు పంపడం ప్రారంభించారు. ఇక్కడే గుమస్తాలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. లూజ్ పత్తి తీసుకొచ్చిన రైతుల్లో ఎవరైనా తమకు డబ్బులు ఇస్తే తేమ శాతాన్ని తక్కువగా నమోదు చేసి ధర ఖరారు చేస్తుండడాన్ని కొందరు రైతులు గుర్తించారు.



కొన్ని వాహనాల్లో 30 శాతం తేమ ఉన్నా క్వింటాల్‌కు రూ.4010గా ధర నిర్ణయించడం, కొన్ని వాహనాల్లో 15లోపు తేమ శాతం ఉన్నా డబ్బు ఇవ్వని పక్షంలో క్వింటాల్‌కు రూ.3800గా ధర నిర్ణయించడంతో పాటు పలువురు రైతులు గుమస్తాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మార్కెట్ గ్రేడ్-2 కార్యదర్శి రాహుల్ వెంకట్‌కు ఫిర్యాదు చేయగా అక్కడకు చేరుకున్నారు. మరోసారి రైతులు వాహనాల్లో తీసుకొచ్చిన పత్తి తేమ శాతాన్ని పరీక్షించడంతో రైతులు శాంతించారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు మార్కెట్‌ను సందర్శించి ఆదేశాలు జారీ చేయడమే కాకుండా నిరంతరం మార్కెట్, సీసీఐ ఉద్యోగుల తీరుపై నిఘా ఏర్పాటుచేయాలని రైతులు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top