కేసీఆర్ పాలనలో ప్రగతి శూన్యం


ఖమ్మం స్పోర్ట్స్ : కేసీఆర్ పాలనలో ప్రగతి శూన్యమని ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు వ్యా ఖ్యానించారు. వంద రోజుల్లో అంగుళం కూడా అభివృద్ధి జరగలేదన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెబుతున్న కేసీఆర్ ఉద్యోగుల ఇంక్రిమెంట్లు తప్ప మరే విషయంలోనూ నిర్ణయం తీసుకోలేదని విమర్శిం చారు. సాగునీరు ప్రధాన వనరులైన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు పనులను ఎప్పుడు మొదలు పెడుతారో చెప్పాలన్నారు. అర్హులను కూడా అనర్హులుగా చిత్రీకరించేందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహిం చిందని విమర్శించారు.

 

అధికార దాహంతోనే తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు తదితరులు టీడీపీ వీడీ టీఆర్‌ఎస్‌లో చేరారని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందే పార్టీని వీడాల్సిందన్నారు.  ఎన్నికల్లో పోటీచేసి ఓడిన తర్వాత పార్టీని వీడటం సరికాదన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ పదవిని కవితకు కట్టాబెట్టాలనే దురుద్దేశంతో టీడీపీలోనే ఉంటానని పార్టీ అధినేత చంద్రబాబును తుమ్మల మోసం చేశారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ జిల్లా నాయకులు మందడపు రామకృష్ణ, కొడకంటి ఆంజనేయులు, ఎం. హనుమంతరెడ్డి, మందనపు భాస్కరరావు, మార్కంపుడి వెంకటేశ్వర్లు, షరీఫ్, ఎస్.కె. పాషా పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top