చెరువులో మునిగి విద్యార్థి మృతి


రాంక్యాతండాలో  విషాదం

ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమని

స్థానికుల ఆగ్రహం

 

 రఘునాథపాలెం : సెలవు రోజు సరదాగా చెరువు వైపు వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతిచెందిన సంఘటన మండలంలోని రాంక్యా తండాలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..  మండలంలోని రాంక్యాతండాకు చెందిన గుగులోత్ ధర్మ, అరుణ దంపతుల కుమారుడు అరుణ్‌కుమార్(7)  ఉదయం అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు మిత్రులతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న పెద్ద ఈర్లపుడి  చెరువు వైపు వెళ్లాడు. ముగ్గురు చిన్నారులు సరదాగా ఆడుకుంటూ చెరువులోకి ఈతకు దిగారు. ఈ క్రమంలో చెరువులో మిషన్ కాకతీయ పథకంలో తవ్వకాలు చేసిన పెద్ద గుంతలో అరుణ్‌కుమార్ మునిగి చనిపోయూడు. వ్యవసాయ పనులకు వెళ్లిన అతడి తల్లిదండ్రులు కుమారుడి రాకకోసం ఎంత చూసినా రాకపోవడంతో చిన్నారులను ఆరా తీశారు.



అరుణ్ చెరువులో మునిగినట్లు  ఇద్దరు చిన్నారులు చెప్పడంతో గ్రామస్తులు వారు చూపించిన ప్రాంతంలో వెతకగా మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని చూడగానే మృతుడి తల్లిదండ్రులు బోరున విలపించారు. వారిని ఎంపీపీ మాలోత్ శాంత, సర్పంచ్ దేవ్లీ, మాజీ సర్పంచ్ అఫ్జల్, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ శ్రీనివాస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల నాయకులు లక్ష్మణ్‌నాయక్, పాపారావు, జాటోత్ నగేష్ తదితరులు ఓదార్చారు.



బాలుడి మృతితో రాంక్యాతండాలో విషాదం అలుముకుంది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు తవ్వకం సమయంలోనే పెద్ద గుంతలు తీస్తుంటే రైతులు, గ్రామస్తులు ఇలా చెరువు లోపల పెద్ద గుంతలు తీయడం వల్ల పశువులు, వ్యక్తులు చనిపోయే అవకాశం ఉందని చెప్పినా పెడచెవిన పెట్టి అడ్డదిడ్డంగా తవ్వి చిన్నారిని బలిగొన్నారని ఆరోపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top