రెండో మహానగరంగా ఓరుగల్లు


  •    భవిష్యత్ తరాలకు గుర్తుండేలా పాలన

  •      సమస్యల ముగింపే..‘మన ప్రణాళిక’

  •      స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి

  • హసన్‌పర్తి : తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత రెండో మహానగరంగా ఓరుగల్లును తీర్చనున్నట్లు శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ‘మన మండలం-మన ప్రణాళికను’ పురస్కరించుకుని హసన్‌పర్తి మండల పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు వివరించారు. వరంగల్‌ను ఇండస్ట్రీయల్ కారిడర్ చేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.



    కాటన్ పరిశ్రమల స్థాపనకు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక్కడ నీటి పారుదల వనరులను అభివృద్ధి చేసుకోవడానికి ఇప్పటికే జిల్లా యత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్లు వివరించారు. గ్రామాల్లో సమస్యలను పుల్‌స్టాప్ పెట్టడానికే సూక్ష్మస్థాయిలో మన ఊరు- మన ప్రణాళిక, మన మండలం-మన ప్రణాళిక అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

     

    ఐదేళ్ల ప్రణాళిక : కలెక్టర్ కిషన్...

     

    ఐదేళ్లకాలంలో దృష్టిలో పెట్టుకుని మన ఊరు-మన ప్రణాళిక అనే కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ కిషన్ తెలిపారు. ఒక గ్రామానికి సంబంధించిన అన్ని అంశాలు సమగ్రంగా ప్రణాళికలో రూపొందించినప్పుడే బంగారుతెలంగాణ సాధ్యమన్నారు.

     

    విలీన గ్రామాలపై అధికారుల నిర్లక్ష్యం : ఎమ్మెల్యే అరూరి

     

    విలీన గ్రామాలపై బల్దియా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అరూరి రమేష్ స్పీకర్ దృష్టికి తీసుకోచ్చారు. కార్పొరేషన్‌లో 42 గ్రామాలు విలీనం కాగా, ఇందులో 30 గ్రామాలు వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోనివన్నారు. ఈ గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న గృహ పథకానికి జయశంకర్ గృహ కల్పన పథకంగా నామకరణం చేయాలని ఎంపీపీ కొండపాక సుకన్య స్పీకర్‌ను కోరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కొత్తకొండ సుభాష్, వైస్ ఎంపీపీ జనగాం కిరణ్, ఎంపీడీఓ మేన శ్రీను, తహసీల్దార్ రాజ మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top