‘సాగర్’ శుద్ధి

‘సాగర్’ శుద్ధి

  •      నేటినుంచి ప్రక్షాళన పనులకు హెచ్‌ఎండీఏ శ్రీకారం

  •      నిమజ్జన వ్యర్థాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి

  •      కార్యాచరణకు దిగిన ఇంజనీరింగ్ సిబ్బంది

  •      రెండో విడతలో ‘ఆపరేషన్ గణేశా’

  • సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనమయ్యే వేలాది వినాయక విగ్రహాలశకలాలను సత్వరం తొలగించేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. సోమవారం ఉదయం నుంచే సాగర్‌లో నిమజ్జన వ్యర్థాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 8వరకు తొలివిడతగా, 9నుంచి రెండో విడతగా పనులు చేపట్టనున్నారు. ‘ఆపరేషన్ గణేశా’ పేరిట రెండో విడతలో వ్యర్థాలను పెద్ద ఎత్తున వెలికి తీయనున్నారు.



    నిమజ్జన ఘట్టం ముగిసే వరకు విగ్రహాలను నీటిలో ఉంచితే సాగర్ కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అందుకోసం ఎప్పటికప్పుడు తొలగింపు పనులు చేపట్టనున్నారు. ఆదివారం నుంచే నగరంలో నిమజ్జన కార్యక్రమం మొదలైనందున తొలివిడతగా సోమవారం నుంచే వ్యర్థాల వెలికితీత పనులు చేపడుతున్నారు. ఇందుకోసం 2 డ్రెజ్జింగ్ యుటిలిటీ క్రాఫ్టు (డీయూసీ)లను వినియోగించనున్నారు. డీయూసీల ద్వారా వెలికితీసి కవాడీగూడలోని జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పనుల నిమిత్తం తొలిదశలో 50 మంది వర్కర్లను, 2 డీయూసీలు, 2 జేసీబీలు, 6 టిప్పర్లను అందుబాటులో ఉంచారు.

     

    8న ప్రధాన ఘట్టం..

     

    వినాయక నిమజ్జన ప్రధాన ఘట్టం సెప్టెంబర్ 8న జరగనుంది. ఆ రోజు వేలాది సంఖ్యలో విగ్రహాలు సాగర్‌లోకి చేరుతాయి. ఇవన్నీ నీటిలో కరిగిపోకముందే వెలికి తీసేందుకు మరుసటి రోజు నుంచి భారీ ఎత్తు ప్రక్షాళన ప్రక్రియ చేపట్టనున్నారు.



    ఈ ప్రాజెక్టుకు ‘ఆపరేషన్ గణేశా’ పేరు పెట్టారు. వ్యర్థాల తొలగింపు కోసం సుమారు రూ.18.56 ల క్షలు ఖర్చు చేస్తున్నారు. ప్రధానంగా ఎన్టీఆర్ మార్గ్‌లో మొత్తం 8 ప్లాట్‌ఫారాల వద్ద నిమజ్జనం చేసే గణేశ్ విగ్రహాల తాలూకు అవశేషాలు, పూలు పత్రి ఇతర చెత్తాచెదారాన్ని సమూలంగా గట్టుకు చేర్చేందుకు 2 డీయూసీలతోపాటు, 4 జేసీబీలు, ఒక పాంటాన్ ఎక్స్‌కవేటర్, 20 టిప్పర్లు, 200మంది వర్కర్లను వినియోగించి రాత్రింబవళ్లు నిరంతరాయంగా పనులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు హెచ్‌ఎండీఏ ఎస్‌ఈ బీఎల్‌ఎన్ రెడ్డి తెలిపారు. జనాల్లో మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై కొంత అవగాహన పెరిగినా... ఈ ఏడాది 3,740 టన్నుల వ్యర్థాలు పోగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top