అక్కడ చోరీ.. ఇక్కడ విక్రయం

అక్కడ చోరీ.. ఇక్కడ విక్రయం - Sakshi

  • మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లో ఖరీదైన కార్ల చోరీ

  •      నకిలీ పత్రాలతో నగరంలో విక్రయం

  •      అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు

  •      రూ.3 కోట్ల విలువైన 15 కార్ల స్వాధీనం

  • సాక్షి, సిటీబ్యూరో: ఇతర రాష్ట్రాలలో ఖరీదైన కార్లు, ఇతర భారీ వాహనాలను చోరీ చేసి.. వాటికి నకిలీ పత్రాలు సృష్టించి విక్రయిస్తున్న ఓ ముఠా గుట్టును నగర సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.3 కోట్ల విలువ చేసే 15 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు రోడ్డు రవాణా శాఖ (ఆర్టీఏ) అధికారులు సహకరిస్తున్నట్టు తెలియడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.  



    వివరాలు... మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వాహనాల దొంగపై సీసీఎస్ ఆటో మొబైల్ టీం దృష్టి సారించింది. అతడిని ఆ బృందం అదుపులోకి తీసుకొని విచారించగా దిమ్మతిరిగే నిజాలు వెలుగు చూశాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలలో ఖరీదైన కార్లను చోరీ  చేసి నగరానికి తెస్తున్న ముఠా.. ఆర్టీఏ బ్రోకర్ల సహాయంతో రిజిస్ట్రేషన్ నెంబర్లను మార్చి విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఇలా విక్రయించిన వాహనాలకు నగరంలోని పలు ఫైనాన్స్ కంపెనీలు ఫైనాన్స్ కూడా చేశాయి.



    మహబూబ్‌నగర్‌లో పట్టుబడిన నిందితుడు మరో ఇద్దరు నిందితుల పేర్లు వెల్లడించడంతో వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఈ ముఠా ఏడాది కాలంలో 15 కార్లను విక్రయించినట్లు తేలడంతో వీటిని ఖరీదు చేసిన వారి నుంచి వాహనాలను సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పోలీసులు ఈ ముఠా అరెస్టును చూపించే అవకాశాలున్నాయి.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top