ఇక జైలుకే...

ఇక జైలుకే... - Sakshi


మణికొండ: గండిపేట్‌లో ఆదివారం బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతూ పోలీసులకు చిక్కిన పాతబస్తీకి చెందిన 80 మంది యువకులు, వారి తల్లిదండ్రులకు నార్సింగ్‌లోని కేవీఎంఆర్ ఫంక్షన్‌హాల్‌లో కమిషనర్ ఆనంద్ ఆధ్వర్యంలో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మరోసారి రేసింగ్‌కు పాల్పడి పోలీసులకు దొరికితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.   అతివేగంగా వాహనాలను నడపటం, రేసింగ్‌లకు పాల్పడటం వల్ల ప్రమాదాలు జరిగి మీ ప్రాణం పోగొట్టుకోవడమే కాకుండా కుటుంబసభ్యులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తారన్నారు.  



నగరం, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేయటం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని, తొమ్మిదిసార్లు తప్పించుకున్నా.. పదోసారి పోలీసులకు చిక్కక తప్పదన్నారు. అప్పుడు పడే బాధ గతంలో తప్పించుకున్నప్పటి సరదాకన్నా తీవ్రంగా ఉంటుందన్నారు.  నగరశివార్లలో ఇంజినీరింగ్ కళాశాలలు ఎక్కువగా ఉండటంతో పాటు పోలీసుల నిఘా తక్కువగా ఉం టుందని శివార్లలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని, ఇకముం దు అలాంటి వాటిపై పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేస్తామని కమిషనర్ అన్నారు.  



ఇకపై పోలీసులకు చిక్కిన వారికి మో టారు వాహన చట్టం, బెట్టింగ్‌లకు పాల్పడుతున్నందున గ్యా బ్లింగ్ చట్టం, అతివేగంగా వాహనాలు నడిపి ఇతరులకు ఇ బ్బంది కలిగిస్తున్నందున ట్రాఫిక్ చట్టాన్ని అమలు చేసి జైలుకు పంపిస్తామని ెహ చ్చరించారు. మైనర్లకు వాహనాలిచ్చే తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేస్తామన్నారు.  రేసర్లను పట్టుకున్నందుకు నార్సింగ్ సీఐ ఆనంద్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డిలను ఆయన   ప్రత్యేకంగా అభినందించారు.  

 

గతేడాది 1100 మంది మృతి: అవినాష్ మహంతి,ట్రాఫిక్ డీసీపీ

 

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 1100 మంది చనిపోయారని కౌన్సెలింగ్‌లో పాల్గొన్న ట్రాఫిక్ డీసీపీ అవినాష్‌మహంతి తెలిపారు.   దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం 1.50 లక్షల మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తేనే ప్రమాదాలను అరికట్టడం సాధ్యమన్నారు. ఎవరైనా రేసింగ్‌లలో పాల్గొని జైలుకెళ్తే వారి జీవితం వృథా అవుతుందన్నారు.  కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ రమేశ్‌నాయుడు,  రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి, నార్సింగి సీఐ ఆనంద్‌రెడ్డిలతో పాటు నార్సింగ్ పోలీసులు పాల్గొన్నారు.

 

జాగ్రత్త పడతాం: తల్లిదండ్రులు

 

మాపిల్లలు బయట ఏం చేస్తున్నారనే విషయం ఇప్పటి వరకు తమకు తెలియదని, రాబోయే రోజుల్లో ఇలాంటి రేసింగ్‌లు, సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా చూసుకుంటామని యువకుల తల్లిదండ్రులు తెలిపారు.  మొదటిసారి తప్పు చేశారు...రంజాన్ పండగ ఉన్నందున వారందరినీ వదలివేయాలని వేడుకున్నారు. యువకులు సైతం ఇకముందు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనమని హామీ ఇచ్చారు.  దీంతో మరోసారి తప్పు చేయమని వారితో ప్రమాణం చేయించి వాహనాలతో పాటు వారిని పోలీసులు వదిలేశారు.

 

 వాట్స్‌ఆప్‌తో వర్తమానం

 ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుకున్న రేసర్లు

 

 రాజేంద్రనగర్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని బైక్‌రేసర్లు గత రెండు నెలలుగా తమ కార్యకలాపాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించారు. ఎట్టకేలకు నార్సింగ్ పోలీసులకు చిక్కిన ఈ రేసర్లు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం చూసి పోలీసులే అవాక్కయ్యారు. వాట్స్‌ఆప్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల ద్వారా రేసింగ్‌లకు పాల్పడటంతో పాటు బెట్టింగ్స్ కూడా నిర్వహిస్తూ ఆశ్చర్యానికి గురి చేశారు. 12 ఏళ్ల బాలుడు సైతం ఈ రేసింగ్స్‌లో పాల్గొని తన సత్తా చాటడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. సైకిల్‌ను సైతం లేపలేని వయస్సులో బైక్‌ను సునాయాసంగా గాల్లోకి లేపుతూ విన్యాసాలు చేయడం ఔరా అనిపించింది. పోలీసులకు పట్టుబడ్డ 80 మందిలో 15 ఏళ్ల వయస్సులోపు వారే పదుల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా రేసర్‌లను ‘న్యూస్‌లైన్’ ఆరా తీయగా వారు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.



ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్స్‌ఆప్‌లలో...



బైక్‌రేసర్‌లు సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌లలో చాటింగ్‌లు, యూట్యూబ్‌లలో తాము చేసిన విన్యాసాలను అప్‌లోడ్ చేస్తున్నారు.  అలాగే ప్రతి ఆదివారం ఎక్కడ? ఎన్ని గంటలకు కలవాలి తదితర విషయాలను ఒక్క రోజు ముందు వాట్స్‌ఆప్‌లో షేర్ చేసుకుంటున్నారు.  ఈ విధంగా రేసింగ్ విషయం తమ వారికి తప్ప మరెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.



మొదట ఇద్దరు యువకులు....

 

ప్రతి ఆదివారం యువకులంతా బైక్‌రేసింగ్‌కు నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. ఇద్దరు యువకులు ముందుగా ఆ ప్రాంతానికి వెళ్తారు. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి వెంటనే వాట్స్‌ఆప్ ద్వారా తమ గ్రూపు సభ్యులకు వచ్చేయమని మెసేజ్ పంపుతారు. నిమిషాల వ్యవధిలో గ్రూప్ సభ్యులంతా చేరుకొని బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top