న్యాయం కోసం స్టేషన్‌కు వెళ్తే..

న్యాయం కోసం స్టేషన్‌కు వెళ్తే.. - Sakshi


► తెరవెనుక పోలీసుల సెటిల్‌మెంట్లు?

► న్యాయంకోసం స్టేషన్‌కొస్తే ‘పంచాయితీ’ సలహాలు

► రౌడీషీటర్లతో పంచాయితీలు

► నేరుగా ఓ సీఐకి బాధితుడి ఫిర్యాదు

► వివాదాస్పద ఇంటిని పరిశీలించిన ఎస్పీ

► ఎస్సైపై వేటేస్తా: ఎస్పీ అనంతశర్మ

► నలుగురు రౌడీషీటర్లపై పీడీయాక్ట్‌


సాక్షి, జగిత్యాల/జగిత్యాలటౌన్‌: ఇప్పటికే.. అవినీతి అపవాదులు ఎదుర్కొంటున్న ఖాకీలు తీరు మార్చుకోవడం లేదు. అవినీతి ఫిర్యాదులు నిరూపణ అయి ఇప్పటికే పలువురిపై వేటుపడినా అదే దారిన పయనిస్తున్నారు. అవకాశం వస్తే చాలు.. డబ్బులు వసూళ్లకు తెగబడుతున్న పోలీసులు తాజాగా సెటిల్‌మెంట్లపై దృష్టిసారించారు. ఒకవేళ సివిల్‌ కేసులు ఠాణాకు వస్తే.. కోర్టుకెళ్లమని సలహాలివ్వాల్సింది పోయి.. బయటే పంచాయితీలు పెట్టుకొమ్మని ఉచిత సలహా ఇస్తున్నారు.


ముందే ఓ ఒప్పందానికి వచ్చి తమకు మచ్చిక చేసుకున్న వారికి అనుకూలంగా రౌడీషీటర్లనూ పంచాయితీల్లో ఉంచుతున్నారు. ఇది నమ్మశక్యం కాకున్నా.. జిల్లాలో పలుచోట్ల వాస్తవ పరిస్థితి మాత్రం ఇలానే ఉంది. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారిని పోలీసులే బయట పంచాయతీల్లో సమస్యను పరిష్కరించుకోవాలని తనకు రెండు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందాయని స్వయంగా జిల్లా ఎస్పీ అనంతశర్మ చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


జిల్లా నడిబొడ్డున ఇదీ పరిస్థితి..

ఎనిమిదేళ్ల క్రితం... బుగ్గారం మండలం నేరెళ్లకు చెందిన రాజాగౌడ్‌ జిల్లా కేంద్రంలోని జమ్మిగద్దె ప్రాంతానికి చెందిన బైరి సత్తయ్యగౌడ్‌కు రెండు విడతలుగా రూ. 20లక్షలు ఇచ్చాడు. తీసుకున్న ఈ అప్పును తీర్చలేని సత్తయ్య రాజాగౌడ్‌కు తన ఇంటిని అమ్మేశాడు. నాలుగేళ్లు అదే ఇంటిలో ఉన్న సత్తయ్య కుటుంబ సభ్యులు తర్వాత ఇళ్లు విడిచివెళ్లిపోయారు. ఆ సమయంలో రాజాగౌడ్‌ ఇళ్లు అమ్ముకుందామనుకోగా.. జాయింట్‌ ప్రాపర్టీ కారణంగా అమ్మలేకపోయాడు.


దీంతో రాజాగౌడ్‌ పోలీసులను ఆశ్రయించి.. తనకు ఇచ్చిన దానిపై వడ్డీతో సహా అందేలా న్యాయం చేయాలని కోరాడు. అదే సమయంలో సత్తయ్య భార్య రాజేశ్వరీ సైతం భర్త రాజాగౌడ్‌కు అసలు ఇళ్లే అమ్మలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు పోలీసు అధికారి ఇరువురిని పిలిచి బయట పంచాయతీ పెట్టుకొమ్మని సలహా ఇచ్చారు. గత నెల 24న.. ఇరు వర్గాలు పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కూర్చొని మాట్లాడుకుందామనుకోగా.. అందులో రాజేశ్వరీ తరుపు నుంచి వచ్చిన నలుగురు రౌడీషీటర్లు రూ. 13 లక్షలు తీసుకుని వెళ్లిపోవాలని లేకపోతే అంతుచూస్తామని రాజాగౌడ్‌ను హెచ్చరించాడు.


ఇదే క్రమంలో ఈ నెల 7న.. ఇంటి తాళాన్ని పగలగొట్టిన రాజేశ్వరీ అందులో ఉంటుంది. దీంతో రాజాగౌడ్‌ పై స్థాయి అధికారులను ఆశ్రయించాడు. విషయం వెలుగులోకి రావడంతో జిల్లా ఎస్పీ అనంతశర్మ వివాదానికి కారణమైన ఆ ఇంటిని శుక్రవారం పరిశీలించారు. సంఘటనపై ఆరా తీసిన ఎస్పీ ఈ వ్యవహారంలో ఓ ఎస్సై ప్రమేయముందనీ నిగ్గు తేల్చారు. త్వరలోనే సదరు ఎస్సైపై వేటు వేస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌తో మాట్లా డి.. అనుమతి లేకుండా.. ఇంటి తాళాన్ని పగలగొట్టేలా రాజేశ్వరీని ప్రరేపించిన నలుగురు రౌడీషీటర్లపై పీడీయాక్ట్‌ నమోదు చేస్తామని విలేకరులతో చెప్పారు.


చెలరేగుతున్న రౌడీషీటర్లు..

నాలుగు నెలల క్రితం రౌడీషీటర్లతో సమావేశమైన ఎస్పీ అనంతశర్మ సెటిల్‌మెంట్లు చేసినా.. భూ తగాదాల్లో తలదూర్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో నాలుగు మాసాల నుంచి జిల్లాలో స్తబ్దుగా ఉన్న రౌడీషీటర్లు మళ్లీ పెట్రేగిపోతున్నారు. ఇదే క్రమంలో జిల్లాలో పలు చోట్ల మళ్లీ సెటిల్‌మెంట్లకు దిగుతున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలో నలుగురు ఓ సెటిల్‌మెంట్లో పాల్గొనగా... ఇబ్రహీంపట్నంలోనూ ఓ రౌడీషీటర్‌పై తనకు ఫిర్యాదు అందిందని జిల్లా ఎస్పీ తెలిపారు. సెటిల్‌మెంట్లు, కబ్జాలకు పాల్పడే రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అనంతశర్మ హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top