కాటి పక్కన.. కనం..

కాటి పక్కన.. కనం.. - Sakshi


16 ఏళ్లుగా ఒక్క కేసూ నమోదు కాని ఆస్పత్రి


  • నెలవారీ చికిత్సకు ఓకే.. ప్రసవం మాత్రం ప్రైవేటులోనే..

  • ఇదీ మహబూబ్‌నగర్‌ జిల్లా ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దుస్థితి


సాక్షి,మహబూబ్‌నగర్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) పక్కనే శ్మశానాలు ఉండటం ఎదిర గ్రామ ప్రజలకు శాపంగా మారింది. పీహెచ్‌సీ పక్కన సమాధులు ఉండడం.. అందు లో ప్రసవాలు చేయించుకుంటే మంచి జరగదనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు.  మహబూబ్‌నగర్‌ మున్సి పాలిటీలో విలీనమైన ఎదిర గ్రామ పంచాయతీలో 16 ఏళ్లS క్రితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  ఖర్చు చేసి నిర్మించారు. పీహెచ్‌సీ పరిధిలో 13 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. పీహెచ్‌సీతో పాటు సబ్‌సెంటర్లను కలుపుకొని ఒక వైద్యాధికారి, మరో 38 మంది సిబ్బంది, 92 మంది ఆశా కార్యకర్తలు సేవలు అందిస్తున్నారు. ఇంతమంది వైద్యసేవల కోసం ఉన్నా కనీసం ఒక్క కాన్పు కూడా పీహెచ్‌సీలో జరగట్లేదు.  



అటుగా వెళ్లేందుకు నిరాకరిస్తున్న ప్రజలు

జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండటంతో పీహెచ్‌సీలో అన్నివిభాగాల పోస్టులు, పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్నారు. వైద్య సదుపాయాలు అన్నీ ఉన్నా.. పక్కనే సమాధులు ఉండడం వల్ల గర్భం దాల్చిన నాటి నుంచి నెలలు నిండే వరకు నెలవారీ చికిత్స చేయించుకుంటున్న గర్భిణులు కాన్పులు చేయించుకోవడానికి మాత్రం వెళ్లడం లేదు. జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్నారు. కేవలం ఎదిర గ్రామస్తులే కాకుండా పీహెచ్‌సీ పరిధిలో మిగతా 17 గ్రామాల గర్భిణులు కూడా ఇక్కడ ప్రసవాలు చేయించుకున్న దాఖ లాలు లేవు. ప్రభుత్వం ప్రతినెలా కనీసం 10 నుంచి 15 ప్రసవాలు అయినా ప్రతి పీహెచ్‌సీలో జరగాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎదిర పీహెచ్‌సీలో ఒక్క ప్రసవం కూడా జరగలేదు. శ్మశానాల విషయంలో ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి చెబుతున్నా..  ప్రయోజనమూ ఉండటంలేదు. దీంతో పీహెచ్‌సీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక స్థాని కంగా నెలకొన్న పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.



అవగాహన కల్పిస్తున్నాం

పీహెచ్‌సీ పక్కన సమాధులు ఉన్నందుçన కాన్పులు చేయించుకోవడానికి ఏ ఒక్క గర్భిణీ ముందుకు రావట్లేదనే విషయం నిజం. ప్రజల్లో నాటుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకు అనుగుణంగా ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లతో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయిస్తున్నాం. ఇప్పుడిప్పుడే జనంలో కాస్త మార్పు వస్తోంది. డెలివరీలు కాకపోయినా.. మిగతా టెస్టులు చేయించుకుంటున్నారు. కొన్ని రకాల ట్రీట్‌మెంట్లు కూడా అందిస్తున్నాం. త్వరలో కాన్పులు జరిగేలా కృషి చేస్తాం.     

– శ్రీనివాస్, డీఎంహెచ్‌వో,  మహబూబ్‌నగర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top