అంతాఅధనమే!


  • దసరా పేరుతో ప్రయాణికుల నిలువు దోపిడీ

  •      {పైవేటు ఆపరేటర్ల ఇష్టారాజ్యం

  •      ఆర్టీసీలో 50 శాతం అదనం

  •      ప్రీమియం పేరుతో రైళ్లలో బెర్తుల వ్యాపారం

  •      భారంగా మారిన ప్రయాణం

  •      బెంబేలెత్తుతున్న నగరవాసులు

  •      నేటి నుంచి దసరా సెలవులు

  • సాక్షి, సిటీబ్యూరో: దసరా సందర్భంగా సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులను ప్రభుత్వ, ప్రయివేటు అనే తేడా లేకుండా రవాణా సంస్థలు ఎడా పెడా దోచేస్తున్నాయి. ప్రీమియం పేరుతో అదనపు చార్జీలతో ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నాయి. ముందస్తు రిజర్వేషన్లు అయిపోవడంతో రైల్వే, ఆర్టీసీ, ప్రైవేటు ఆపరేటర్లు దోపిడీ పర్వానికి తెరలేపారు. ఆర్టీసీ అదనపు సర్వీసులు పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తోంది. ఇక ప్రయివేటు ఆపరేటర్లు సంగతి సరేసరి.



    ఎప్పుడు ఏ ధర తోస్తే అదే చార్జీ. ఇష్టారాజ్యంగా చార్జీలు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎన్నడూ లేనివిధంగా రైల్వేశాఖ సైతం ప్రీమియం రైళ్ల పేరుతో బెర్తుల వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. ఏటా రద్దీ సమయాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసే అధికారులు ఈ దఫా ధనార్జనే ధ్యేయంగా ప్రీమియం బాట పట్టారు. ముప్పేట దాడిలో  సగటు ప్రయాణికుడి పండుగ సంబరం కాస్తా ఆవిరైపోతోంది. మంగళవారం నుంచి దసరా సెలవులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దసరాకు సొంతూరికి వెళ్లాలనే నగరవాసులు తడిపిమోపెడైన ప్రయాణ చార్జీలు చూసి బెంబేలెత్తి పోతున్నారు.

     

    50 శాతం అదనం



    దసరా సందర్భంగా ఈ ఏడాది 3335 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ  ఏర్పాట్లు చేపట్టింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు ఈ బస్సులు నడుపుతారు. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టేషన్‌లతో పాటు కేపీహెచ్‌బీ, ఈసీఐఎల్, ఎస్‌ఆర్‌నగర్, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. నగరం నుంచి విజయవాడ, విశాఖపట్టణం, గుంటూ రు, ఏలూరు, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, కడప, తిరుపతి తదితర ప్రాంతాలతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి తెలంగాణలోని దూరప్రాంతాలకు సైతం ప్రత్యేక బస్సులను నడుపుతారు.



    సూపర్ లగ్జరీ, గరుడ, గరుడ ప్లస్ బస్సులతో పాటు కొన్ని ప్రాంతాలకు డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ బస్సుల్లో  సాధారణ చార్జీలపై 50  శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. దీంతో సాధారణ రోజుల్లో  విజయవాడకు సూపర్ లగ్జరీ చార్జీ రూ. 304 ఉంటే ప్రత్యేక బస్సుల్లో  అది రూ. 454 వరకు పెరగనుంది.



    సాధారణ రోజుల్లో తిరుపతికి వెళ్లేందుకు గరుడ చార్జీ రూ. 888 అయితే ప్రత్యేక బస్సుల్లో ఇది రూ. 1338 వరకు పెరిగే అవకాశం ఉంది. రవాణా శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రైవేటు ఆపరేటర్ల దోపిడీకి అంతేలేకుండా పోతోంది. సెలవు దినాల్లో సాధారణ చార్జీలపై రెట్టింపు వసూళ్లు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రోజూ సుమారు 500 ప్రైవేట్ బస్సులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. మామూలుగా విశాఖకు ఏసీ బస్సుల్లో రూ. 900 చార్జీ ఉంటే పండుగ రోజుల్లో  ఇది రూ. 2000 నుంచి ఒక్కోసారి  రూ. 2500 వరకు కూడా పెరిగిపోతుంది.

     

    ప్రీమియం దోపిడీ...



    బస్సుల పరిస్థితి ఇలా ఉంటే  పేద, మధ్య తరగతి వర్గాలకు  చౌకగా లభించే రైలు ప్రయాణం కూడా భారంగానే మారుతోంది. స్లీపర్ బోగీలను సైతం వదిలిపెట్టకుండా ప్రీమియం సర్వీసుల పేరుతో రైల్వే బెర్తుల బేరానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది దసరా  రద్దీని దృ ష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు 50 ప్రత్యేక రైళ్లను  ప్రకటిస్తే అందులో సగానికి పైగా ప్రీమియం రైళ్లే కావడం గమనార్హం. ఈ రైళ్లలో చార్జీలు తత్కాల్ కంటే రెట్టింపు చొప్పున పెరిగిపోతున్నాయి. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వరకు స్లీపర్ క్లాస్ చార్జీ రూ.475. అయితే ప్రీమియం రైళ్లలో ఇది రూ.600తో ప్రారంభమై రూ.1200 వరకు కూడా పెరుగుతుంది. విమాన సర్వీసుల తరహాలో ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రీమియం రైలు చార్జీలు పెంచేస్తున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top