ప్రధాన లక్ష్యం ఉపాధి కల్పనే

ప్రధాన లక్ష్యం ఉపాధి కల్పనే


నాగర్‌కర్నూల్: జిల్లాలో వలసలను ఆపడంతో పాటు పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని.. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. జూపల్లి కృష్ణారావుకు పరిశ్రమల శాఖ ఇవ్వడంతో ఇందులో భాగమేనన్నారు.

 

 శుక్రవారం నాగర్‌కర్నూలులోని వెలమ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన నియోజకవర్గస్థాయి అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించేందుకు సౌదీ నుంచి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని.. వారు తొలుత మహబూబ్‌నగర్ జిల్లాకే వస్తున్నారని అన్నారు.

 

 ఉద్యోగులు, నేతలు సోదరభావంతో కలిసి పనిచేసినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని అన్నారు. గ్రామీణస్థాయిలో భూ తగాదాలు అధికంగా ఉంటాయని, రెవెన్యూ సిబ్బంది సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు. అధికారం చెలాయించడం గాక పేదలకు సేవ చేసినప్పుడే మంచిపేరు వస్తుందన్నారు. గతంలో రాజకీయ నాయకులు పని తక్కువ చేసి ప్రచారం ఎక్కువగా చేసుకున్నారని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అలా కాదన్నారు. కల్యాణ పథకంలో వివాహానికి ముందే ప్రభుత్వం సహాయం అందిస్తే వారికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

 

  ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమ రథసారథులని, వారితో  మంచిగా మెలుగుతూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేందుకే ఈ ఆత్మీయ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో నేతలు కార్యకర్తల ముందే అధికారులను పిలిపించి దూషించే వారని, తాము అలాంటి విధానానికి దూరమని వెల్లడించారు. కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ ఉద్యోగులు ప్రణాళికాబద్ధంగా పనిచేసి రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరంలో అన్ని శాఖలపరంగా ఎన్నో పథకాలు అమలు చేయాల్సి ఉంటుందని సూచించారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ చల్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 26 వాటర్‌గ్రిడ్‌లలో మొదటిది కృష్ణానది బ్యాక్‌వాటర్ నుంచి చేపట్టనున్నట్లు వెల్లడించారు.

 

 ఎల్లూరు వద్ద చేపట్టనున్న ఈ గ్రిడ్ ద్వారా 6 జిల్లాలకు చెందిన 25 నియోజకవర్గాలకు తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ ఈఈ రామన్న మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ. 24కోట్ల వ్యయంతో 184 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. చిన్ననీటి పారుదల ఈఈ మాట్లాడుతూ నియోజకవర్గంలో 132 చెరువులు గుర్తించామని, 36 చెరువులకు ఎస్టిమేట్లు వేశామని, మిగతావి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రూ.50 కోట్ల టెండర్లు వచ్చే నెలలో పిలుస్తున్నామన్నారు. ఆర్డీఓ వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ ప్రతాప్‌రెడ్డి, ఎంపీడీఓ హరినందన్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి జక్కా రఘునందన్‌రెడ్డి, డీఎస్పీ గోవర్ధన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top