మిరప మంటలెందుకు?

మిరప మంటలెందుకు?


- కుమ్మక్కై మిర్చి రైతుల కంట్లో కారం కొడుతున్న వ్యాపారులు

- ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మాయాజాలం

- పంట భారీగా వస్తుండటాన్ని అదనుగా తీసుకున్న వైనం

- మద్దతు ధర ప్రకటించని కేంద్ర ప్రభుత్వం




ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రోజూ సగటున లక్షా యాభై వేల బస్తాల వరకూ మిర్చి పంట వస్తోంది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు సిండికేట్‌ అవుతున్నారు. జెండా పాట పేరిట ఒకటి రెండు లాట్లకు అధిక ధర పెడుతూ.. మిగతా పంటను అతి తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. రైతులు ధర లేక, పంటను ఇంటికి తీసుకుపోలేని దుస్థితిలో పడిపోతున్నారు. చివరికి పంటను తక్కువ ధరకే తెగనమ్ముకుని ఇంటిబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పరిస్థితి, రైతుల దుస్థితిపై ‘సాక్షి’ఫోకస్‌..

– బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మం



కొనుగోళ్లు ఉండవనే ప్రచారంతో..

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మిర్చి రాక మొదలైంది. వారం వారం పెరుగుతూ.. ఏప్రిల్‌ ఒకటి నుంచి వెల్లువలా పోటెత్తింది. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. కొనుగోళ్లు ఉండవంటూ వారిలో కొందరు గోబెల్స్‌ ప్రచారానికి దిగారు. ఒక్కసారిగా మిర్చి ధర క్వింటాల్‌కు వెయ్యి రూపాయల దాకా తగ్గించారు. తర్వాత మరింతగా ధరలు తగ్గిస్తూ వచ్చారు. కొద్దిరోజుల కింద రూ.5వేలకుపైన ధర ఉండగా.. మెల్లగా రూ.4,500, రూ.4 వేలు, రూ.3 వేలకు తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించకపోవడం, ధర పడిపోతున్నా.. రైతులను ఆదుకునే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.



‘ధర ఇంతేనా..?’అని రైతులు ప్రశ్నిస్తే.. ఎక్కడ ఎక్కువస్తే అక్కడ అమ్ముకోండంటూ పంపేస్తున్నారు. ఇతర వ్యాపారుల వద్దకు వెళ్లినా అదే సమాధానం వస్తోంది. ఇలా ధర కోసం విసిగి వేసారుతున్న రైతులు సిండికేట్‌ మాయాజాలానికి బలవుతున్నారు. మే నెలలో ఎండలు అధికంగా ఉండటంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 20 రోజుల నుంచి నెలరోజుల పాటు సెలవులు ఇస్తుంటారు. దీనిని వ్యాపారులు తమకు అనుకూలంగా మలచుకున్నారు. మే మొదటివారం నుంచి మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు ఉండవంటూ రైతుల్లో ప్రచారం చేస్తున్నారు. దీంతో రైతులంతా తమ వద్ద ఉన్న మిర్చిని అమ్ముకొనేందుకు మార్కెట్‌ దారి పట్టారు.



మూడో రకం పేరుతో మోసం

తేజా రకం మిర్చిని ప్రధానంగా ఆయిల్‌ తీయడానికి ఉపయోగిస్తారు. ఈ రకం మిర్చి 3వ కోత నుంచి ఆశించిన మేరకు ఆయిల్‌ రాదు. ప్రస్తుతం మిరప తోటలు 3వ కోత దశలో ఉన్నాయి. దీంతో వ్యాపారులు ఇదే అదనుగా మోసానికి తెగబడ్డారు. రైతులు తెస్తున్న 2వ కోత మిర్చిని కూడా మూడో కోత మిర్చిగా లెక్కగడుతూ తక్కువ ధర నిర్ణయిస్తున్నారు. రైతులు 2వ కోత మిర్చి అని చెప్పినా పట్టించుకోవడం లేదు. కొందరు వ్యాపారులైతే 3వ కోత మిర్చి పేరుతో క్వింటాల్‌కు రూ.1,500 నుంచి రూ.2,500కు మించి ధర పెట్టడం లేదు.



రూ.12,000 నుంచి రూ.3,000కు..

సీజన్‌ ఆరంభమైన గత నవంబర్‌లో మిర్చి ధర రూ.12 వేల వరకు పలకగా క్రమంగా ధర క్షీణించింది. డిసెంబర్‌ నాటికి రూ.10 వేలకు, జనవరిలో రూ.9 వేలకు, ఫిబ్రవరిలో రూ.8,500కు చేరింది. తర్వాత భారీగా పంట ఉత్పత్తి విక్రయానికి వస్తుండటంతో వ్యాపారులు సిండికేటై ధరను బాగా తగ్గించారు. దీంతో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రూ.6 వేల నుంచి రూ.3 వేల వరకు ధర పడిపోయింది.



మూడు వేలే ఇస్తామంటున్నారు..

‘‘గతేడాది ఎకరన్నరలో మిర్చి వేసిన. మంచి ధర రావడం, ప్రభుత్వం పత్తిసాగు వద్దని చెప్పడంతో ఈ సారి ఐదెకరాల్లో మిర్చి పంట వేశాం. మొదటి కోతలో 29 క్వింటాళ్ల దిగుబడి రాగా.. ఫిబ్రవరి రెండో వారంలో క్వింటాల్‌ రూ.8,200 చొప్పున అమ్మిన. మార్చిలో రెండో కోతలో 32 క్వింటాళ్లు రాగా.. రూ.5,200 చొప్పున మాత్రమే ఇచ్చారు. మూడో కోతలో 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దానికి వ్యాపారులు తొలుత రూ.3 వేల చొప్పునే ఇస్తామన్నారు. తర్వాత అడిగే దిక్కు కూడా లేకుండా పోయింది. ధర ఎక్కువ వస్తుందేమోనని మూడు రోజులుగా మార్కెట్‌లోనే పడిగాపులు కాస్తున్నా. అటు దిగుబడి తగ్గి, ఇటు ధర రాక ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.5 లక్షల దాకా నష్టం వస్తోంది..’’

– రైతు శీలం గణేశ్, సూర్యాపేట జిల్లా నాగారం మండలం మాచిరెడ్డిపల్లి



రికార్డుల్లో మాత్రమే గరిష్ట, కనిష్ట ధరలు

మిర్చి గరిష్ట, కనిష్ట ధరలు మార్కెటింగ్‌ శాఖ రికార్డులకే పరిమితం తప్ప.. వాస్తవంగా వ్యాపారులు ఆ మేరకు చెల్లించడం లేదు. జెండా పాట పేరుతో ఒకటి, రెండు లాట్లకు గరిష్టధర నిర్ణయించి.. మిగతా అధిక మొత్తం సరుకును దాదాపుగా కనిష్ట ధరకు, నాణ్యత తక్కువ పేరుతో కనిష్ట ధర కన్నా తక్కువకు కొనుగోలు చేస్తున్నారు.



సెలవులన్న కారణం చెప్పి..

రూ.2 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టి ఎకరన్నరలో మిర్చి సాగు చేసిన. అందులో రూ.1.5 లక్షలు అప్పే. పంట వేసే సమయంలో క్వింటాల్‌కు రూ.12 వేల వరకు ధర ఉంది. నా పంటకు రూ.10 వేల వరకు అయినా రాదా అనుకున్నా. పంటను అంత దూరం నుంచి ఖమ్మం మార్కెట్‌కు తీసుకొస్తే.. వ్యాపారులు సెలవులన్న కారణం చెబుతూ రూ.2,200లే ధర పెడతామన్నారు. గుట్టలు గుట్టలుగా మార్కెట్‌కు బస్తాలు రావడంతో అసలు కొంటారో కొనరోనని ఆందోళనగా ఉంది. తప్పని పరిస్థితుల్లో పంటను అమ్ముకున్నా..’’

– రైతు కలంచెర్ల మల్లయ్య, సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం లింగంపల్లి



పెట్టుబడి కూడా వచ్చేలా లేదు

‘‘సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. కూలీల రేట్లు మూడు నాలుగింతలు అయ్యాయి. నేను నాలుగెకరాల్లో మిర్చి వేసిన. ఎకరాకు 25 క్వింటాళ్ల లెక్కన దిగుబడి వచ్చింది. అయినా పెట్టుబడి మేర సొమ్ము అందే పరిస్థితి లేదు. క్వింటాల్‌కు రూ.2,500 నుంచి రూ.3 వేలే ఇస్తుండడంతో కూలీల ఖర్చులే వచ్చే పరిస్థితి లేదు.’’

– సామ శ్రీనివాస్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలం మిడ్తనపల్లి



వ్యాపారులంతా కలసి ధర తగ్గిస్తున్నారు

‘‘ఈ ఏడాది రెండెకరాల్లో మిర్చి వేశా. 100 బస్తాల దిగుబడి వచ్చింది. అమ్ముకుందామని గురువారం ఖమ్మం మార్కెట్‌కు వచ్చా. వ్యాపారులు సరుకును చూస్తున్నారుగానీ ధర నిర్ణయించడం లేదు. ఓ వ్యాపారి మాత్రం ముఖం విరుస్తూ క్వింటాల్‌కు రూ.3,500 చొప్పున ఇస్తామన్నాడు. పంట నాణ్యంగా ఉన్నా ధరపెట్టడానికి వ్యాపారుల మనసు అంగీకరించడం లేదు. వారంతా ఏకమై ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు..’’

– ఇస్లావత్‌ కిషన్, సుజాతనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా



అప్పుల పాలయ్యా..

‘‘ఎకరన్నరలో మిర్చి పంట వేశాను. 32 బస్తాల దిగుబడి వచ్చింది. మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.4 వేలు అడిగారు. అమ్మడానికి మనసు రాలేదు. మళ్లీ వ్యాపారులెవరూ రాలేదు. సెలవులుంటాయని అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంతకన్నా తక్కువ ధర వస్తుందేమోనన్న భయం వేస్తోంది. పెట్టుబడి కోసం తెచ్చిన రూ.2 లక్షలకు పైగా అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు..’’

– రైతు లకావత్‌ బాలాజీ, ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవిద్రాల బంజర



మార్కెట్‌కొచ్చి మూడు రోజులైంది..

‘‘రెండెకరాల్లో మిర్చి సాగు చేశాను. ఆశించిన ధర లేక పెట్టుబడి కూడే పరిస్థితి లేదు. గతంలో కొంత మిర్చిని అమ్మిన. రెండోకోతలో వచ్చిన మిర్చిలో 23 బస్తాలు అమ్మకానికి తెచ్చిన. కానీ అడిగే నాథుడే లేడు. మార్కెట్‌కు వచ్చి మూడు రోజులవుతున్నా వ్యాపారులు పోటీగా సరుకును చూసే పరిస్థితి లేదు..’’

– పులిచింతల ఉపేందర్‌రెడ్డి, మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం పెడ్రెడ్డిగూడెం



ఇంకా కల్లాల్లోనే మిర్చి..

ఖమ్మం మార్కెట్‌పై దాడి ఘటన నేపథ్యంలో శనివారం ఉదయం పోలీసు పహారా మధ్య మిర్చి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మార్కెట్‌లో ఉన్న మిర్చిని కొనుగోలు చేసి తరలించడానికి ఇంకా రెండు రోజులు పట్టనుంది. అయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో పొలాలు, రైతుల ఇళ్లల్లో ఇంకా లక్షల బస్తాల మిర్చి ఉన్నట్లు అంచనా. ఆ మిర్చిని మార్కెట్‌కు తెస్తే కొనుగోళ్ల పరిస్థితి ఎలాగని అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు ధర అమాంతం పడిపోవడంతో కనీసం సాగు ఖర్చయినా వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఖమ్మం మార్కెట్, ముదిగొండ మండలంలోని చైనా మిల్లులో కలిపి మొత్తంగా 40 లక్షల బస్తాలు కొనుగోలు చేశారు. మరో 15 లక్షల బస్తాలు రైతుల వద్ద ఉన్నట్లు అంచనా.



ఎండల్లో పడిగాపులు

వేల బస్తాల మిర్చి మార్కెట్‌కు రావడంతో మార్కెట్‌తోపాటు చుట్టుపక్కల రోడ్ల మీద కూడా మిర్చి బస్తాలు నిండుతున్నాయి. కొనుగోళ్లు మాత్రం కేవలం రెండు రోజులే చేస్తున్నారు. మార్కెట్‌కు వచ్చిన మిర్చిని తూకాలు వేయడానికి రెండు రోజులు, ఎత్తడానికి రెండు రోజులు పడుతోంది. దీంతో రైతులు మండుటెండలో మార్కెట్‌లోనే పడిగాపులు కాస్తున్నారు. రైతులు మిర్చిని తీసుకుని మార్కెట్‌కు వెళితే.. అమ్ముకుని రావడానికి ఐదు రోజులు పడుతోంది. ధర గిట్టుబాటు కాలేదనుకున్న రైతులు వారం రోజులకు పైగా ఉంచి.. చివరకు ఎంతో కొంత ధరకు అమ్ముకుని వస్తున్నారు.



పత్తి వద్దని మిర్చి సాగుచేస్తే..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న ప్రధాన సాగు పంటలు. నాగార్జున సాగర్‌ ఆయకట్టు నీరు అందకపోవడం, ప్రభుత్వం పత్తి సాగు వద్దంటూ చేసిన ప్రకటనతో.. ఈసారి ఉమ్మడి జిల్లాలోని రైతులు మిర్చి సాగుకు మొగ్గారు. ఉమ్మడి జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 4.05 లక్షల ఎకరాలు కాగా.. మిర్చి 60 వేల ఎకరాలు. ఈసారి పత్తి 3.2 లక్షల ఎకరాలకు తగ్గగా.. మిర్చి సాగు 85 వేల ఎకరాలకు పెరిగింది. ఇలా సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు వాతావరణ పరిస్థితులు కొంత అనుకూలించడంతో దిగుబడి కూడా పెరిగింది. కానీ దిగుబడి వచ్చిన ఆనందం ధర దగాతో ఆవిరైపోతోంది.



6 లక్షల అప్పు మిగిలింది..

తొలకరి నాటికి ధర చూసి ఆశపడిన ఓ కౌలు రైతు ఎనిమిదెకరాల్లో మిర్చి సాగు చేశాడు. పెట్టుబడి కోసం తెలిసినవారి దగ్గర అప్పులు చేశాడు. ఆరుగాలం కుటుంబ సభ్యులంతా కష్టపడితే నాలుగు కాసులు వెనకేసుకోవచ్చని భావించాడు. కానీ వర్షాభావంతో మిర్చి దిగు బడి తగ్గింది. 8 ఎకరాల్లో కలి పి కూడా 80 క్వింటాళ్ల దిగు బడే రావడంతో ఆందోళన చెందాడు. అటు మార్కెట్లో మిర్చికి సరైన ధర రాలేదు. సాగు, కోత ఖర్చులకు రూ.8 లక్షల వరకు ఖర్చుకాగా.. తన పంటకు రెండు లక్షల వరకే వచ్చింది. దీంతో రూ.6 లక్షల వరకు అప్పు మిగిలింది. ఖమ్మం నగరంలోని టేకులపల్లికి చెందిన బి.పుల్లయ్య అనే గిరిజన రైతు దుస్థితి ఇది. కూలీ కూడా రాని దుస్థితి కారణంగా కుటుంబసభ్యులతోనే కొద్దికొద్దిగా చివరి పంట కోసుకుంటున్నామంటూ పుల్లయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. పరిస్థితి ఇలాగే ఉంటే కౌలు రైతుల చావు కేకలే వినాల్సి వస్తుందని వాపోయాడు.



సాగు చేయాలంటే భయమవుతోంది

ఈ రైతు పేరు ధారావత్‌ నాగు.. నర్సంపేట నియోజకవర్గంలోని ఖాదర్‌పేట గ్రామ శివారు సూర్యపేటతండా. కూతురికి పెళ్లి చేశాడు. కుమారుడిని హైదరాబాద్‌లో చదివిస్తున్నాడు. నాలుగెకరాల భూమి ఉంది. గత నాలుగేళ్లుగా ఎకరన్నర విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తున్నాడు. గతేడాది మిర్చి పంటతో మంచి లాభమే వచ్చింది. ఈ ఏడాది కూడా మిర్చి సాగు చేశాడు. పెట్టుబడి కోసం వరంగల్‌లోని మిర్చి అడ్తిదారు వద్ద రూ.25 వేలు అప్పు చేశాడు. 8 క్వింటాళ్ల దిగుబడిరాగా.. ఈనెల 24న వరంగల్‌ మార్కెట్‌కు తీసుకెళ్లాడు. వ్యాపారులు క్వింటాల్‌కు రూ.2,300 చొప్పున కొనుగోలు చేశారు. ఇలా వచ్చిన రూ.17 వేలను అడ్తిదారు అప్పులో జమ చేసుకున్నాడు. దీంతో ఇంత కష్టపడ్డా పెట్టుబడి సొమ్మూ రాలేదని నాగు ఆందోళనలో మునిగిపోయాడు. ఇంకోసారి మిర్చి సాగు చేయాలంటే భయమవుతోందని వాపోయాడు.



ధర లేదు.. నిల్వ అవకాశమూ లేదు..

వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని స్వామిరావుపల్లికి చెందిన దాసరి రాజమౌళి భార్య, కుమారుడితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. గతేడాది ఎకరన్నర భూమిలో మిర్చి వేశాడు. 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్‌కు రూ.11,300 చొప్పున ధర పలకడంతో మంచి లాభం వచ్చింది. దీంతో ఈసారి రెండున్నర ఎకరాల్లో మిర్చి వేశాడు. దిగుబడి కూడా బాగానే వచ్చింది. కానీ మార్కెట్‌కు తీసుకెళ్తే కొనేవారు లేరు. ధర తగ్గిపోయింది. దాచిపెడదామంటే కోల్డ్‌ స్టోరేజీల్లో ఖాళీ లేదు. మరోవైపు పెట్టుబడి కోసం చేసిన అప్పులతో ఆందోళన నెలకొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top