క్రీస్తు ప్రేమను పంచాలి


క్లాక్‌టవర్(మహబూబ్‌నగర్): రాష్ట్రంలో క్రైస్తవుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. బుధవారం రాత్రి జిల్లాకేంద్రంలోని ఎంబీసీ చర్చి ఆవరణలో రెవ.వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలను ఆయన కేక్‌కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. క్రైస్తవుల సమస్యలు ఏమిటో తమకు తెలుసునన్నారు.

 

  క్రైస్తవులకు క్రీస్తుప్రేమను లోకమంతా పంచాలన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..శాంతి సమాధానాలతో పండుగను జరుపుకోవడం క్రైస్తవులకే సాధ్యమన్నారు. దేవుడి ఆశీర్వాదంతోనే ఈరోజు మీముందు ఉన్నానని అన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి మంత్రిగా తనవంతు కృషిచేస్తానని హామీఇచ్చారు.

 

  అనంతరం మంత్రి జూపల్లి కృష్టారావు మాట్లాడుతూ.. క్రీస్తుప్రేమ వర్ణించలేదని, విశ్వాసులంతా క్రీస్తును పోలి నడుచుకోవడం అభినందనీయమన్నారు. లోకమంతా ప్రేమను పంచుతూ రాణించాలన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ.. ప్రేమతో నడుచుకోవడం క్రైస్తవులకే సాధ్యమన్నారు.

 

  క్రైస్తవుల పట్ల తనకు ఎనలేని అభిమానం ఉందన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత లోకంలో శాంతి సమాధానాలు కరువడంతో అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోయాయని అన్నారు. వాటిని అధిగమించేందుకు ప్రార్థించాలన్నారు.

 

 అనంతరం అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా ఈమందిరంలో ప్రార్థనలు చేశా.. దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చాడని గుర్తుచేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ మాట్లాడుతూ.. చిన్నప్పట్నుంచి సండేస్కూల్‌కి వెళ్లేవాడిని, బైబిల్‌పై తనకు పూర్తిగా విశ్వాసం ఉందన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రైస్తవులు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను పంచాలన్నారు.

 

  జెడ్పీచైర్మన్ బండారి బాస్కర్ మాట్లాడుతూ.. మూటలు మూసే తనను దేవుడు ఈస్థితికి తీసుకొచ్చాడన్నారు. కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. ఈ లోకంలో ప్రజలు బాధలు, ఆవేదనలో కూరుకుపోయి ఉన్నారని, వీటి నుంచి విముక్తి కల్పించడం యేసుక్రీస్తు ప్రభువుకే సాధ్యమన్నారు. అనంతరం జేసీ ఎల్.శర్మన్, ఏజేసీ డాక్టర్ రాజారాం తదితరులు మాట్లాడారు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంబీసీ వైస్ చైర్మన్ బీఏ పురుషోత్తం, కార్యదర్శి జోసెఫ్, కౌన్సిల్ నేతలు, అధికసంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top