ఆనందం ఆవిరి

ఆనందం ఆవిరి - Sakshi

  •  దీపావళిలో అపశ్రుతులు

  •  పలువురికి గాయాలు

  •  సరోజిని,ఎల్వీప్రసాద్,ఉస్మానియా ఆసుపత్రుల్లో చికిత్స

  • బంజారాహిల్స్/మెహిదీపట్నం/అఫ్జల్‌గంజ్: దివ్వెల పండుగ దీపావళి రోజు అపశ్రుతులు చోటు చేసుకున్నాయి. అజాగ్రత్తగా టపాసులు కాల్చడంతో దీపావళి ఆనందం ఆవిరైంది.  నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు చిన్నారులు టపాసులు కాలుస్తూ ప్రమాదాల బారిన చికిత్స కోసం వివిధ ఆసుపత్రుల్లో చేరారు. కొందరి కళ్లకు గాయాలయ్యాయి. సున్నితమైన కార్నియా వంటి భాగాలు దెబ్బతిన్నాయి.



    నగర వ్యాప్తంగా పలు చోట్ల గాయపడ్డ 45 మందికి గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహించారు. వారిలో స్వల్పంగా గాయపడి కంటి సంబంధమైన బాధను ఎదుర్కొంటున్న  40 మందికి ప్రాథమిక చికిత్స అందించి పంపేశారు. మిగతా ఐదుగురికి  శస్త్రచికిత్స చేశారు. శ్రుతి అనే బాలిక చిచ్చుబుడ్డి కాలుస్తుండగా కుడి కంటికి గాయమైంది.  కార్నియాకు దెబ్బతగలడంతో శస్త్రచికిత్స చేసి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ చేశారు. మరో నలుగురికి కూడా కార్నియా దెబ్బతినడంతో శస్త్ర చికిత్స చేశారు.

     

    ‘సరోజిని’లో ప్రత్యేక వార్డు...



    మరోవైపు మెహిదీపట్నం సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో ఇలాంటి బాధితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు.  తీవ్రంగా గాయపడ్డ వారిని ఆస్పత్రి చేర్చుకున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ నర్సారెడ్డి తెలిపారు. చిన్నారులు కూకట్‌పల్లికి చెందిన ఇబ్రహీం, మెదక్ రంగంపేట్‌కు చెందిన పవన్, సైదాబాద్‌కు చెందిన సందీప్, మహబూబ్‌నగర్ నారాయణపేట్‌కు చెందిన వేణులు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వీరి కంటి చూపు కోల్పోయే ప్రమాదం లేకపోయినప్పటికీ  తీవ్ర గాయాలయ్యాయని సూపరింటెండెంట్ తెలిపారు. స్వల్పంగా గాయపడి ఆసుపత్రికి వచ్చిన మరో 35 మందికి చికిత్స చేసి పంపేశారు.

     

    ఉస్మానియాలో 10 మందికి చికిత్స...



    నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మరో 10 మంది టపాకాయలు కాలుస్తూ  గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చేరారు. వారికి  కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. స్వల్ప గాయాలకు గురైన వారికి ప్రాథమిక చికిత్స అందించి పంపేశారు. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు  చికిత్సలు పొందిన వారిలో బేగంబజార్‌కు చెందిన జగదీష్(13), అభిషేక్(15) శ్రీకాంత్(21), మంగళ్‌హాట్ జాలిహనుమాన్‌కు చెందిన అనిరుథ్(8), మంగళ్‌హాట్‌కు చెందిన బాలు(18), లక్ష్మీబాయి (35), నింబోలిఅడ్డకు చెందిన నాగార్జున్ (11), చుడీబజార్‌కు చెందిన అజయ్‌కుమార్(13), నాంపల్లికి చెందిన సాయికుమార్(24), ఘాన్సీ బజార్‌కు చెందిన సాయిచంద్ర(22) ఉన్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top