‘ఉపాధి’.. అక్రమాల మాటేమిటి..?

‘ఉపాధి’.. అక్రమాల మాటేమిటి..? - Sakshi


సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉపాధి హామీ పథకంలో అక్రమాల పరంపర కొనసాగుతూనే ఉంది. కూలీల సొమ్మును అక్రమార్కులు దిగమింగుతూనే ఉన్నారు. ప్రభుత్వం మారినా పనుల్లో అవినీతి ఏ మాత్రం తగ్గడం లేదు. సామాజిక తనిఖీల్లో పెద్దయెత్తున వెలుగు చూస్తున్న అవకతవకలే ఇందుకు నిదర్శనం. జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో పక్కదారి పట్టిన సొమ్ము ఏకంగా రూ.3.36 కోట్లకు చేరిందంటే.. ఇంకా వెలుగులోకి రాని అవకతవకలు ఏమేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.



గ్రామీ ణ ప్రాంతాల్లో నిరుపేద కూలీల వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై కూలీల సొమ్మును అప్పనంగా కాజేస్తున్నారు. అసలు పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేయడం, బినామీ కూలీల పేర్లతో ప్రతినెలా వేలల్లో కూలీ మొత్తాన్ని కలిసి పంచుకోవడం జరుగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 52 మండలాల్లో 5వ విడత సామాజిక తనిఖీలు పూర్తయ్యాయి. 42 మండలాల్లో ఆరో విడత పూర్తయింది. 12 మండలాల్లో ఏడో విడత సామాజిక తనిఖీలు జరిగాయి.



ఈ తనిఖీల్లో 7,824 అభ్యంతరాలు వ్యక్తం కాగా, వీటిలో సుమారు రూ.14.31 కోట్ల అవకతవకలు జరిగినట్లు సామాజిక తనిఖీ బృందాల దృష్టికి వచ్చింది. ఈ అక్రమాలపై ప్రాథమిక విచారణ జరపగా రూ.3.36 కోట్లు పక్కదారి పట్టినట్లు రుజువైంది. క్షేత్ర స్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లే పెద్దయెత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలింది. పక్కదారి పట్టిన సొమ్ములో వీరి అక్రమాలు రూ.2.31 కోట్లకు పైగా ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్లు రూ.అరకోటిపైగా జేబులు నింపుకున్నారు. మండల స్థాయిలో పనిచేసే ఏపీఓలు కూడా సుమారు రూ.20 లక్షలు వరకు దిగమింగినట్లు తేలింది. ఈ అక్రమాల్లో ఎంపీడీఓల పాత్ర కూడా ఉంది.

 

రికవరీ కొండంత..

పక్కదారి పట్టిన సొమ్మును రికవరీ చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో రికవరీ చేయాల్సిన సొమ్ము కొండలా పేరుకుపోతోంది. జిల్లాలో పక్కదారి పట్టిన రూ.3.36 కోట్లలో ఇప్పటివరకు అక్రమార్కుల నుంచి వసూలు చేసింది రూ.99.16 లక్షలు మాత్రమే. ఇంకా రూ.2.37కోట్లు వసూలు చేయాల్సి ఉం ది. ఫీల్డ్ అసిస్టెంట్లు దుర్వినియోగానికి పాల్పడిన రూ. 2.31 కోట్లలో అధికారులు చేసిన రికవరీ రూ.41.38 లక్ష లు మాత్రమే. ఇంకా వీరి వద్ద సుమారు 1.90 కోట్ల మేర కు వసూలు చేయాల్సి ఉంది.



ఈ వసూళ్ల విషయంలో ఒకరిద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్యాయత్నాలకు పా ల్పడడంతో అధికారులు రికవరీపై అంతగా దృష్టి సారిం చడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధి హా మీ పనుల్లో కొందరు ఎంపీడీవోలు కూడా పెద్దయెత్తున అక్రమాలకు పాల్పడ్డారు. వీరిపై చర్యలు తీసుకోవడం లో తీవ్ర జాప్యం జరగడం విమర్శలకు దారితీస్తోంది.

 

రికవరీకి ప్రత్యేక చర్యలు

- జాదవ్ గణేష్, డ్వామా పీడీ..

ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడిన వారి వద్ద నిధులు రికవరీ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఈ రికవరీ చర్యలు వివిధ స్థాయిలో ఉన్నాయి. వీటిని వేగవంతం చేస్తాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top