పాఠం నేర్వలే !


సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఓ వైపు రాష్ట్రం తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా జెన్‌కో మాత్రం నిర్లక్ష్యాన్ని వీడిన దాఖలా కనిపించడం లేదు. దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన ఘటనతో గతం నుంచి జెన్‌కో పాఠాలు నేర్వలేదనే విషయాన్ని తేటతెల్లం చేసింది. అత్యంత చవకగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం, నిర్వహణలో జెన్‌కో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఓ వైపు బుధవారం రాత్రి జరిగిన ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంపై హర్షం వ్యక్తమవుతోంది.

 

 మరోవైపు విద్యుత్ కేంద్రం నిర్మాణంలో  లోపాలపై అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రక్షణగోడ బలహీనంగా నిర్మించడం, ఇన్నర్‌గేట్ల నిర్మాణంలో లోపం ప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. మరోవైపు నిర్మాణం పూర్తి చేసుకున్న యూనిట్లకు నడుమ విభజన గోడ నిర్మాణం ఆలస్యం కావడం వల్లే నష్ట తీవ్రత ఎక్కువగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత అప్రోచ్ కెనాల్ బండ్ నిర్మాణం పేరిట అధికారులు చేస్తున్న హడావుడిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

 వారం రోజుల వ్యవధిలోనే బండ్‌ను నిర్మించి, విద్యుత్ కేంద్రం నుంచి వరద నీటిని పూర్తిగా తోడి వేస్తామని చెప్పడం ఆచరణ సాధ్యంగా కనిపించడం లేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. రోజుకు 20లక్షల యూనిట్ల మేర విద్యుత్ ఉత్పత్తి నష్టపోతుండడంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. జులై 16న జెన్‌కో సీఈ రామ్మోహన్‌రావు బృందం దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు ఇచ్చింది. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించి ఉంటే ప్రమాదం జరిగేది కాదనే విమర్శలు వస్తున్నాయి.

 

 ‘ఎగువ’ బాధ్యులపై చర్యలేవీ?

 విద్యుత్ ఉత్పత్తికి సందర్భమైన వేళ గత యేడాది ఆగస్టు 27న ఎగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఆరు యూనిట్లకు గాను నాలుగు యూనిట్లలో టర్బైన్లు కాలిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన 37రోజులకే ప్రమాదం జరగడంతో జెన్‌కో రోజుకు సుమారు రూ.70లక్షల మేర విద్యుత్ ఉత్పాదన నష్టపోయింది. మరమ్మతుల పేరిట తిరిగి కోట్లాది రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేపట్టింది. తాజాగా ఎగువ జూరాలలోనూ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ తరచూ టర్బైన్లు మొరాయిస్తున్నట్లు సమాచారం. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఎగువ జూరాల ప్రమాద ఘటనలో నేటికీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. దిగువ జూరాల ప్రమాదంపై నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎండీ చేసిన ప్రకటన మొక్కుబడిగానే కనిపిస్తోంది. మరో రెండు నెలల పాటు మాత్రమే వరద నీరు ఆధారంగా జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉండటంతో జెన్‌కో నిర్లక్ష్యంతో భారీ నష్టాన్నే రాష్ట్రం ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top