సంక్షేమం గోవిందా!

సంక్షేమం గోవిందా! - Sakshi


పథకాల నిబంధనలను కఠినతరం చేసిన ప్రభుత్వం



సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఆహారభద్రత’కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త భాష్యం చెప్పింది. ఇల్లు, భూమి, వృత్తిని ‘కార్డు’కు లింకు పెట్టింది. ఐదెకరాల పైబడి పొలం ఉంటే రేషన్‌కార్డుకు అర్హులు కాదని నిర్దేశించింది. ఈ నిబంధనలే కాదు.. ఆఖరికి ఆర్థికంగా స్థితిమంతులుగానో.. మీ జీవనశైలి బాగున్నట్లు విచారణాధికారి పసిగట్టినా ఆహారభద్రత కార్డుకు అనర్హులుగానే పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు జిల్లా యంత్రాంగానికి అందాయి. దీనికి అనుగుణంగా ఆహారభద్రత, సామాజిక పింఛన్ల దరఖాస్తులను విచారిస్తున్న అధికారుల బృందాలకు సరికొత్త ని‘బంధనాలు’ తలనొప్పిగా మారాయి.



మరోవైపు ప్రభుత్వం విధించిన ఆంక్షలతో జిల్లాలో భారీఎత్తున కార్డులకు కోత పడే అవకాశం కనిపిస్తోంది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చేవారు కాదు. తాజా నియమావళి మేరకు కేవలం రోజువారీ వేతన కూలీలు, అసంఘటిత రంగ కార్మికులకు పథకాలు వర్తించేలా ఉండడం గమనార్హం. ప్రస్తుతం 9.38లక్షల తెల్లరేషన్ కార్డులుండగా.. తాజా పరిశీలనతో కొత్తవాటి సంగతేమోగానీ ఉన్నవాటికి సైతం ఎసరు వచ్చేలా కనిపిస్తోంది.



పల్లెబాట!

నిన్న, మొన్నటివరకు సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణలో బిజీగా ఉన్న అధికారులు తాజాగా దరఖాస్తులపై క్షేత్ర పరిశీలనకు ఉపక్రమించారు. డోర్‌టుడోర్ తిరుగుతూ అర్హతను నిర్ధారించే పనిలో నిమగ్నమయ్యారు. సర్కారు విధించిన కట్టుదిట్టమైన మార్గనిర్దేశకాలను అనుసరించి అధికారులు పరిశీలన ప్రక్రియను చేపట్టారు.



అవకతవకలు జరిగితే అందుకు సంబంధించి తనిఖీ అధికారిని బాధ్యుడిని చేస్తూ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అధికారులు పకడ్బందీగా పరిశీలన చేపడుతున్నారు. జిల్లాలో 17.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఆహార భద్రతకు సంబంధించి 12.67లక్షల దరఖాస్తులు రాగా, సామాజిక పింఛన్ల  కోసం 3.69లక్షలు, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణకు 1.5లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో పింఛన్లకు సంబంధించి 28వేల దరఖాస్తులు పరిశీలించారు.

 

వీరికి సంక్షేమం లేనట్టే..!

* రెండున్నర ఎకరాల తరి, ఐదెకరాల చెలక భూమికి పైబడి లేదా రెండూ కలిపి ఐదెకరాలు ఉన్నవారు ఆహార భద్రత కార్డుల(ఎఫ్‌ఎస్‌సీ)కు అనర్హులు.

* ప్రభుత్వ/ ప్రభుత్వ రంగ/ ప్రైవేటు సంస్థలు/ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, డాక్టర్లు/ కాంట్రాక్టర్లు/ వృత్తినిపుణులు /స్వయం ఉపాధి పొందేవారికి ఈ పథకం వర్తించదు.

* బడా వ్యాపారులు (ఉదా: నూనె, రైస్ మిల్లర్లు, పెట్రోల్ బంకు, రిగ్గు యజమానులు, దుకాణ దారులు, ప్రభుత్వ పెన్షనర్లు, స్వాతంత్య్ర సమరయోధ పెన్షనర్లు)..

* నాలుగు చక్రాల వాహనదారులకు సైతం సంక్షేమ ఫలాలు అందవు.

* ఇవేకాకుండా తనిఖీ అధికారుల పరిశీలనలో దరఖాస్తు దారుడి జీవనశైలి, వృత్తి, ఆస్తులను పరిగణనలోకి తీసుకుని అర్హతను నిర్ణయిస్తారు.

* పింఛన్లకు సంబంధించి వితంతు, వికలాంగ పింఛన్లకు మినహా కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పింఛన్ వర్తిస్తుంది.

* 65 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే వృద్ధాప్య పింఛన్లకు అర్హులు. ఇందుకు దరఖాస్తుదారులు వయసు ధ్రువీకరణ పత్రం (జనన, ఓటరు కార్డు, ఆధార్ కార్డు) తనిఖీ అధికారికి చూపాలి.

* నిబంధనల ప్రకారం ధ్రువ పత్రం సమర్పించకుంటే దరఖాస్తుదారుడి కుటుంబ సభ్యుల వయసు ఆధారంగా పరిశీలనాధికారి ధ్రువీకరించవచ్చు.

* వితంతు పింఛన్ దరఖాస్తుదారులు భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి.

* వికలాంగులు సదరమ్ క్యాంపులో పంపిణీ చేసిన వికలత్వ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. 40శాతం వైకల్యం మించిన వారే దీనికి అర్హులు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top