పాతబస్తీలో ఆడపిల్లల ఆక్రందనలు

పాతబస్తీలో ఆడపిల్లల ఆక్రందనలు - Sakshi

  •  ఏడాదిగా బాలికతో వ్యభిచారం

  •   డబ్బుల కోసం దారుణానికి ఒడిగట్టిన తల్లి, అక్క, బావ

  •   పీయూసీఎల్ సహకారంతో ఫలక్‌నుమాలో కేసు నమోదు

  • చాంద్రాయణగుట్ట: పాతబస్తీలో అరబ్ షేక్‌ల పెళ్లిళ్ల భాగోతం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ముక్కుపచ్చలారని బాలిక జీవితాలను కన్నవాళ్లు, బ్రోకర్లు, అరబ్ షేక్‌లు మొగ్గలోనే తుంచేస్తున్నారు. రాష్ట్ర రాజధాని ఇప్పుడు అమ్మాయిల అంగడిగా మారింది. అరబ్ షేక్‌లతో పెళ్లి పేరుతోను.. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో అమ్మాయిల ఎగుమతి కొనసాగుతూనే ఉంది. గద్దల్లా తిరిగే బ్రోకర్లు ముస్లిం కుటుంబాలపై వాలి వారి పేదరికాన్ని ఆసరా చేసుకుని ఆడ పిలల్లకు వెలకట్టి అరబ్ షేక్‌లకు అమ్మేస్తున్నారు.



    షేక్‌ల మోజు తీరాక వారిని వ్యభిచార గృహాలకు అప్పగిస్తున్నారు. ఎన్ని ఉదంతాలు వెలుగులోకి వచ్చినా పోలీసులు మాత్రం తూతూ మంత్రంగా దర్యాప్తు చేసి చేతులు దులుపుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం ఒమన్ దేశానికి చెందిన రషీద్(61) వారం రోజుల వ్యవధిలో పాతబస్తీలో బ్రోకర్ల ద్వారా ఇద్దరు బాలికలను నిఖా(వివాహం) చేసుకుని పట్టుబడ్డాడు. ఈ ఉదంతం మరచిపోక ముందే తాజాగా ఓ మైనర్ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుజూసింది. ఏడాది నుంచి తల్లి, అక్క, బావ ఈ బాలికను భయపెట్టి ఈ దారుణానికి ఒడిగడుతూ వస్తున్నారు.



    ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ అబ్దుల్ బారీ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్‌నుమా వట్టేపల్లి నైస్ హోటల్ ప్రాంతానికి చెందిన ముర్తుజా బేగం (48), జాఫర్ ఖురేషీ (50) భార్యభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. పెద్ద కుమార్తె సుమయ (28)ను బాబానగర్‌కు చెందిన మహ్మద్ అక్బర్(40)కిచ్చి వివాహం చేశారు. ఏడాది నుంచి అక్బర్ అత్తారింటి వద్దే ఉంటున్నాడు. ముర్తుజా బేగం రెండో కుమార్తెకు భర్త విడాకులివ్వడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. కాగా డబ్బులుకు కక్కుర్తి పడ్డ ముర్తుజా బేగం తన చిన్న కుమార్తె(15)ను కుమార్తె సుమయ, అల్లుడు అక్బర్ సాయంతో ఏడాది కాలంగా వ్యభిచారం చేయించసాగింది. దీనికి బాలిక ప్రతిఘటించిన ప్రతిసారి చితకబాద సాగారు.



    ఈనెల 9న బాలికను అక్బర్ దుబాయ్‌కి చెందిన ఓ షేక్ చేతుల్లో పెట్టాడు. అతడు బాలికను గోవాకు తీసుకెళ్లి ఓ హోటల్‌లో ఆరు రోజులు గడిపారు. బాలిక వెళ్లిపోతానని ఏడవడంతో ఈనెల 16న తీసుకొచ్చి అక్బర్‌కు అప్పగించగా అతడు ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు ఉదయం మరొకరి వద్దకు పంపేందుకు బేరం ఆడుతుండడాన్ని గమనించిన బాలిక స్థానికంగా ఉండే ఓ యువకుడి సాయంతో పౌర హక్కుల ప్రజా సంఘం (పీయూసీఎల్) తెలంగాణ అధ్యక్షురాలు జయ వింధ్యాలను కలిశారు.



    బాలికకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న జయ బుధవారం అర్ధరాత్రి ఫలక్‌నుమా ఏసీపీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు. మహిళా అధికారులు లేని కారణంగా గురువారం రావాలని సిబ్బంది చెప్పడంతో జయ గురువారం ఉదయమే బాలికను స్టేషన్‌కు తీసుకొచ్చి మహిళా పోలీస్ అధికారితో విచారణ చేయించారు. ఏడాది కాలంగా తనపై జరుగుతున్న దారుణాన్ని సదరు బాలిక వారికి తెలిపింది. ఈ ఘటనపై బాలిక తల్లి ముర్తుజా బేగం, అక్క సుమయ, బావ అక్బర్‌పై నిర్భయ, అత్యాచారం, అక్రమ రవాణ కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

     

    కూతురునే విక్రయించిన ఘనుడు అక్బర్



    బాలిక జీవితాన్ని నాశనం చేసిన అక్బర్ నాలుగు నెలల క్రితం తన కన్న కూతురుకు ఆరు కాంట్రాక్ట్ వివాహాలు జరిపించాడు. కరి కాంట్రాక్ట్ ముగిసాక తలాక్ చెప్పించి మరొకరికి అంటగట్టాడు. ఈ విషయమై కంచన్‌బాగ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అంతటితో ఆగని అక్బర్ తన చిన్న మరదలితో ఏడాది కాలంగా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నాడు.



    తన రెండో మరదలిని కూడా ఇదే వృత్తిలోకి దించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కాగా, ఈమెను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చిన ఓ యువకుడి నుంచి కొన్నాళ్లుగా నిందితులు డబ్బు గుంజుతున్నట్టు పీయూసీల్ సభ్యులు తెలిపారు. ఇతనిపై పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసు పెండింగ్‌లో ఉంది. బెంగళూరుకు చెందిన ఓ గృహిణిని సైతం షాయిన్‌నగర్‌కు చెందిన మహిళ సాయంతో దుబాయికి అమ్మేశాడు.

     

     ఆడ పిల్లలకు రక్షణ కరవు: జయ వింధ్యాల



    పాత నగరంలో ఆడపిల్లకు రక్షణ కరువైందని పీయూసీఎల్ తెలంగాణ అధ్యక్షురాలు జయ వింధ్యాల అన్నారు. గురువారం ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆమె నిందితులను కఠినంగా శిక్షించాలని ఏసీపీని కోరారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. పాత నగరంలో పేదరికం, నిరక్ష్యరాస్యత కారణంగా ప్రజలు తమ పిల్లలను వ్యభిచార కూపంలోకి దించుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాతబస్తీని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top