మళ్లీ మైక్రో పడగ

మళ్లీ మైక్రో పడగ - Sakshi


మైక్రో ఫైనాన్‌‌స కంపెనీలు మళ్లీ గ్రామాల్లోకి అడుగుపెడుతున్నాయి. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కొన్నాళ్లపాటు వెనక్కితగ్గిన పలు సంస్థలు అధిక వడ్డీల వసూళ్ల పర్వానికి మరోమారు తెరలేపాయి. గతంలో పేదలను పీల్చిపిప్పిచేసిన మైక్రో సంస్థల నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు.. కంపెనీల చర్యలను ఏమాత్రం అడ్డుకోలేకపోతున్నాయి. రుణమాఫీ విషయంలో నెలకొన్న సందిగ్ధాన్ని ఆసరా చేసుకుంటున్న మైక్రో సంస్థలు..



గతంలో తీసుకున్న అప్పును వడ్డీతోసహా చెల్లిస్తే అంతకు రెట్టింపు రుణమిస్తామని ఊరిస్తున్నాయి. దీంతో రైతులు, మహిళలు మళ్లీ మైక్రో సంస్థలవైపు చూస్తున్నారు. ఇక అప్పులు చెల్లించే స్థోమతలేదని, ఇప్పుడు బకాయి చెల్లించలేమని చెబుతున్న వారికి ఏకంగా నోటీసులు జారీ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నాయి.


 

వేధింపులు ప్రారంభించిన ఫైనాన్‌‌స కంపెనీలు

బకాయిదారులకు లీగల్ నోటీసులు

చెల్లించండి.. లేదంటే కోర్టుకేనంటూ బెదిరింపులు

ఇష్టారాజ్యంగా వడ్డీల వసూళ్లు ఫలితమివ్వని ప్రభుత్వ కమిటీలు

ఒక్క పరిగి నియోజకవర్గం పరిధిలోనే రూ.20 కోట్ల మైక్రో రుణాలు


 

పరిగి: జిల్లాలో మైక్రో కంపెనీలు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. మహిళలకు అప్పులిచ్చి అధిక వడ్డీలను వసూలు చేస్తున్న పలు కంపెనీల వేధింపులు అధికం కావడంతో గతంలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం గ్రామాల్లో కొన్ని కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొన్నాళ్లపాటు వెనక్కితగ్గినట్టు ఉన్న కంపెనీలు ఇప్పుడు మళ్లీ గ్రామాల్లోకి వస్తున్నాయి.



ప్రస్తుతం రుణమాఫీ విషయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న సంస్థలు  పాత అప్పులు చెల్లిస్తే అంతకంటే ఎక్కువ రుణాలిస్తామని నమ్మబలుకుతున్నాయి. ఇచ్చిన వారి నుంచి డబ్బులు తీసుకోవడం, ఇవ్వనివారికి లీగల్ నోటీసులు జారీ చేయడం వంటి చర్యలు ప్రారంభించాయి. ఇందులో భాగంగానే ఇటీవల పరిగి మండలం సోండేపూర్ తండాకు చెందిన కొందరికి నోటీసులు ఇవ్వడంతోపాటు ఓ వ్యక్తిపై కేసు కూడా నమోదు చేశారు. తాజాగా పరిగి మండల పరిధిలోని పలువురికి కోర్టు నోటీసులు పంపించారు.

 

కోర్టుకీడుస్తామంటూ బెదిరింపులు..

తీసుకున్న డబ్బులను వడ్డీలతోసహా వెంటనే చెల్లించాలని ైరె తులు, మహిళలకు మైక్రో సంస్థలు కోర్టు నోటీసులు పంపుతున్నాయి. డబ్బులు చెల్లించకుంటే కోర్టుకు హాజరుకావాల్సి వస్తుందని ఆయా కంపెనీల సిబ్బంది బెదిరిస్తున్నారు. మైక్రో సంస్థలు వసూలు చేస్తున్న వడ్డీల ప్రకారం.. ఇచ్చిన అసలు రెండేళ్లలోనే డబుల్ అవుతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



పరిగి మండలంలోని నస్కల్ గ్రామానికి చెందిన బేగరి అంజయ్య మూడేళ్ల క్రితం ఓ మైక్రో ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.10 వేలు అప్పుతీసుకున్నాడు. ఆ వెంటనే రూ. రెండు వేలు చెల్లించాడు. మిగిలిన రూ.8 వేలకు వడ్డీతో ఇప్పుడది రెట్టింపు అయిందని, వెంటనే చె ల్లించాలని నోటీసులు పంపారు. అదే గ్రామానికి చెందిన బేగరి నారాయణ, బైండ్ల నర్సింహులు తదితరులకు సైతం ఇలాగే నోటీసులు అందాయి.

 

ఒక్క నియోజకవర్గంలోనే రూ.20 కోట్ల రుణాలు..

పరిగి నియోజకవర్గ పరిధిలోని పూడూరు, పరిగి, దోమ, కుల్కచర్ల, గండేడ్ మండలాల్లో  ఎల్‌అండ్‌టీ, ఎస్‌కేఎస్, స్పందన తదితర సంస్థలు సుమారు రూ.20 కోట్ల మేర రుణాలిచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా మైక్రో సంస్థలు 24 శాతం వడ్డీ అని చెబుతూ 45 నుంచి 55 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు.

 

ఆదుకోని ఆర్థిక చేకూర్పు..

మహిళల అవసరాలు పూర్తిస్థాయిలో తీర్చి ఇతర ప్రైవేటు అప్పుల నుంచి విముక్తి కలిగించడంలో భాగంగా గతంలో ప్రభుత్వం ఐకేపీ ద్వారా ప్రారంభించిన సంపూర్ణ ఆర్థిక చేకూర్పు పథకం మహిళలన్ని ఆదుకోవడంలో విఫలమైంది. 10 నుంచి 15 మంది ఉన్న ఒక్కో సంఘానికి, విడివిడిగా ఒక్కో మహిళాకు ఏఏ అవసరాలున్నాయన్న దానిపై అధ్యయనం చేసి అవసరమైన మేరకు రుణాలివ్వాలని సంపూర్ణ ఆర్థిక చేకూర్పు పథకాన్ని తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ఐకేపీ సిబ్బందితో ప్రణాళిక తయారు చేసింది. కానీ ఆ ప్రణాళికను ఇప్పటివరకు సమర్థవంతంగా అమలు చేయకపోవడంతో మహిళా సంఘాలు మైక్రో సంస్థల్ని ఆశ్రయించక తప్పడం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top