ఉద్యోగుల పంపిణీకి తుది ప్రణాళిక

ఉద్యోగుల పంపిణీకి తుది ప్రణాళిక - Sakshi


- శాఖల వారీగా టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ

- నేటి నుంచి రెండ్రోజులు వరుస సమావేశాలు

-15 మంది అధికారులతో టాస్క్‌ఫోర్స్ ఉత్తర్వులు

- కొత్త జిల్లాల పరిపాలనకు వర్కింగ్ కమిటీలు

- జీఏడీలో జిల్లాల పునర్విభజనకు ప్రత్యేక విభాగం

 

 సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలు కొలువు దీరేందుకు అవసరమైన ఉద్యోగుల సర్దుబాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగా శాఖల వారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ మేరకు ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలతో తుది ప్రణాళికలను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో బుధవారం ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల కేబినేట్ భేటీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించిన మేరకు ఉద్యోగుల కేటాయింపు జరగాలని సూచించారు. నిర్దేశించిన నమూనాలో సిబ్బంది ప్రణాళికను అందజేయాలని ఆదేశించారు. ఇక కొత్త జిల్లాలకు ఏయే కేడర్ల ఉద్యోగులు, ఎంత మంది అవసరం, ఎవరిని ఎప్పుడు కొత్త జిల్లాలకు పంపాలనే దానిపై చర్చించారు.



 15 మందితో టాస్క్‌ఫోర్స్..

 జిల్లాల పునర్విభజనపై సీఎస్ రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీకి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. సీఎస్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో మొత్తం 15 మంది సీనియర్ అధికారులు ఉన్నారు. సీసీఎల్‌ఏను మెంబర్ కన్వీనర్‌గా నియమించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు ప్రణాళిక శాఖ, సాధారణ పరిపాలన విభాగం, హోం, ఆర్థిక, ఆర్ అండ్ బీ శాఖల ముఖ్య కార్యదర్శులు, సర్వీసెస్, ఆర్థిక శాఖ, ఐటీ శాఖ కార్యదర్శులను సభ్యులుగా నియమించారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, మెదక్, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా డీజీపీ, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రెటరీ, సింగరేణి సీఎండీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పేర్కొన్నారు.



 జీఏడీలో పునర్విభజన విభాగం

 రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశాలను పరిశీలించడానికి సచివాలయంలోని సాధారణ పరిపాలనా విభాగంలో అదనంగా రెండు సెక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. జీఏడీ (డీఆర్) సాధారణ పరిపాలన జిల్లాల పునర్విభజన విభాగం పేరుతో ఇది మనుగడలోకి రానుంది. డిప్యూటీ సెక్రెటరీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఈ సెక్షన్లు పనిచేస్తాయి. ఈ మేరకు రెండు అసిస్టెంట్ సెక్రెటరీ, నాలుగు సెక్షన్ ఆఫీసర్, నాలుగు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులను కొత్తగా మంజూరు చేయాలని కోరుతూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి.



 విభాగాల వారీగా వర్కింగ్ గ్రూప్‌లు

 కొన్ని శాఖలను కుదించడంతో పాటు ఉద్యోగుల సర్దుబాటుకు వీలుగా కొత్త జిల్లాల్లో పరిపాలన స్వరూపాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఏయే శాఖలను కొనసాగించాలి, వేటిని విలీనం చేయాలి, ఇప్పుడు జిల్లా పరిధిలో ఉన్న అధికారుల హోదాలను ఎలా మార్చాలనే అంశంపై అధ్యయనానికి శాఖల వారీగా వర్కింగ్ గ్రూప్‌లను ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కోడ్‌ను సమీక్షించే వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడున్న ఎస్‌ఈలను అన్ని జిల్లాలకు సర్దుబాటు చేయడంతోపాటు ఆ పోస్టును సాగునీటి అభివృద్ధి అధికారి (ఇరిగేషన్ డెవలప్‌మెంట్ ఆఫీసర్)గా మార్చాలనే ప్రతిపాదన ఉంది. ఇలాంటి అంశాలపై వర్కింగ్ గ్రూప్‌లు తమ నివేదికలు ఇస్తాయి.

 

 రెండు రోజుల పాటు సమావేశాలు

 సీఎస్ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ గురువారం నుంచి రెండ్రోజుల పాటు శాఖల వారీగా సమావేశాలు నిర్వహించనుంది. ఉద్యోగుల పునఃపంపిణీ ప్రణాళికలు, కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు, మౌలిక వసతులను ఆ సమావేశాల్లో సమీక్షిస్తారు. అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులంతా సంబంధిత ఉద్యోగుల పంపిణీ ప్రణాళికతో హాజరుకావాలని ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ అన్ని విభాగాలకు నోట్ జారీ చేశారు. అన్ని శాఖలు తమ పరిధిలోని ఉద్యోగుల వివరాలను నిర్ణీత నమూనా జాబితాగా తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కేడర్ సంఖ్య, పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలతోపాటు.. విభజన జరిగితే 27 జిల్లాల వారీగా పోస్టులు, ఉండే ఉద్యోగుల సంఖ్య తదితర అంశాలు ఆ నిర్ణీత నమూనాలో ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top