అమరుల కుటుంబాలను ఆదుకుంటాం

అమరుల కుటుంబాలను ఆదుకుంటాం


జాబితాను 459 మందికే పరిమితం చేయబోం: హరీశ్



హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. అమరవీరుల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారంటూ శుక్రవారం శాసన మండలిలో విపక్షనేత డి.శ్రీనివాస్, షబ్బీర్ అలీ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. బడ్జెట్‌లో అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.100 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ నిధులతో ఎన్ని కుటుంబాలనైనా ఆదుకుంటామని, జాబితాను కేవలం 459 మందికే పరిమితం చేస్తామనడం సరికాదన్నారు. సభ్యుల దృష్టికి వచ్చిన అమరవీరుల కుటుంబాల జాబితాను ప్రభుత్వానికి అందించాలని కోరారు. అమరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు.



సాగర్‌లో డీఆర్‌డీవో పరిశోధన కేంద్రం



నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమగట్టుపై నందికొండ గ్రామంలోని సర్వే నం.70లో 101 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీవో) ఏర్పాటు చేయనున్న గ్యాస్ టర్భైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ డెరైక్టరేట్‌కు కేటాయించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం చొరవతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రంతో సుమారు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు ఆ ప్రాంతానికి తరలి రానున్నాయని, స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చెప్పారు.



గన్‌మన్‌ల తొలగింపుపై రచ్చ..



కాంగ్రెస్‌కు చెందిన సుమారు 121 మంది మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు గన్‌మన్‌లను తొలగించడం అన్యాయమంటూ ప్రశ్నోత్తరాల సమయంలో ఆ పార్టీ సభ్యుడు షబ్బీర్ అలీ సభలో నిరసన తెలిపారు. దీనికి విపక్ష నేత డి.శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌రావు తదితరులు గొంతు కలిపారు. ఎమ్మెల్సీలకు సైతం ఎమ్మెల్యేలకు కేటాయించినట్లుగానే టు ప్లస్ టు (నలుగురు) గన్‌మన్లను కేటాయించాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అవసరమైన సభ్యులందరికీ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో మాదిరిగానే ఎమ్మెల్సీలకు వన్ ప్లస్ వన్(ఇద్దరు) గన్‌మన్లను కేటాయించామన్నారు. తమ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎవరికీ భద్రతను తగ్గించలేదని స్పష్టంచేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top