నిరీక్షణ

నిరీక్షణ

  •     సర్వే కోసం ఎదురు చూస్తున్న జనం

  •      అనేక ప్రాంతాల్లో పూర్తి కాని వైనం

  •      త్వరలో తేదీ ప్రకటిస్తాం...ఇక ఫిర్యాదులు వద్దు

  •      స్పష్టం చేసిన జీహెచ్‌ఎంసీ కమిషనర్

  • సాక్షి,సిటీ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే తంతు ముగిసింది. అయినా ఇంకా తమ ఇళ్లకు ఎన్యూమరేటర్లు రాలేదని, తమ వివరాలు నమోదు చేసుకోలేదని అనేక ప్రాంతాలు.. బస్తీలు.. కాలనీల్లోని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీకి కాల్‌సెంటర్, ఎస్‌ఎం ఎస్, ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసిన వారందరి ఇళ్లకు సర్వే కోసం ఇంకా పంపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఫిర్యాదులు స్వీకరించేది లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.



    ప్రజలెవ్వరూ ఇక ఫిర్యాదులు చేయవద్దని.. మిగిలిన కుటుం బాల కోసం మరో రోజు సర్వే తేదీని ప్రకటించి, వారి వివరాలు నమోదు చేస్తామన్నారు. ప్రజలు జీహెచ్‌ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగరాదని సూచించారు. 19నే ఫిర్యాదు చేసినప్పటికీ.. సర్వే పూర్తి కాని వారుంటే వివరాలు సేకరిస్తామన్నారు. అప్పటి నుంచి తాము ఎన్యూమరేటర్ల కోసం ఎదురు చూస్తూనే ఉన్నామని బస్తీలకు బస్తీలు.. కాలనీలకు కాలనీల ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. వీరిలో ఉప్పల్ సర్కిల్‌లోని సూర్యానగర్, రాజ్‌నగర్ కాలనీ, కావేరి నగర్, సెవెన్ హిల్స్ కాలనీ, చిలుకానగర్‌లోని ఆదర్శనగర్, స్వరూప్‌నగర్, భర త్‌నగర్, శాంతినగర్, రామంతాపూర్‌లోని గోఖలేనగర్, వెంకటరెడ్డినగర్, వివేక్‌నగర్, పాత రామంతాపూర్, శ్రీరామా కాలనీ, రాంరెడ్డినగర్, హబ్సిగూడలోని వీధి నంబర్-1, వీధి నంబర్-8లో గల గాంధీ గిరిజన బస్తీ, వసంత్ విహార్ కాలనీ, హరిజన బస్తీ,  ఫిర్జాదిగూడ, మల్లికార్జున నగర్ తదితర ప్రాంతాల వారు ఉన్నారు.

         

    లాలాపేట వార్డు నెంబర్ 12లో సుమారు 30 కుటుంబాల వారు 17వ తేదీ నుంచి 19 అర్థరాత్రి వరకు ఎన్యూమరేటర్ల కోసం ఎదురు చూసినా రాలేదని తెలిపారు.

         

    జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్‌కు ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందన లేదని తార్నాక డివిజన్‌లోని కొన్ని ప్రాంతాల వారు వాపోయారు.

         

    జూబ్లీహిల్స్ డివిజన్‌లోని ఫిలింనగర్ మురికివాడల్లో ఉన్న చాలా బస్తీలకు ఎన్యూమరేటర్లు రాలేదని, అక్కడి 18 బస్తీల్లో ఇంకా వందలాది కుటుంబాలు సర్వే కోసం ఎదురు చూస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసినా స్పందన లేదని వారు దుయ్యబడుతున్నారు.

         

    మల్కాజిగిరి సర్కిల్ లోని శ్రీసాయినగర్, కాకతీయనగర్, జేకేకాలనీ, జేజే నగర్, రేణుకా నగర్, ఓల్డ్ సఫిల్‌గూడ, వినాయకనగర్, వసంతపురి కాలనీ, మల్లికార్జుననగర్, హనుమాన్‌పేట్, దయానంద్‌నగర్, ఆనంద్‌బాగ్, ఓల్డ్ మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్ లోని జొన్నబండ, ఓల్డ్ అల్వాల్, మచ్చబొల్లారం, ఖానాజీగూడ, యాప్రాల్, ఎంప్లాయిస్ కాలనీ, కౌకూర్, భగత్‌సింగ్‌నగర్, భూపేస్‌నగర్, బాపూజీ నగర్ ప్రాంతాలలో అధిక శాతం కుటుంబాల పేర్లు నమోదు కాలేదు. దీంతో గత మూడు రోజులుగా వారు సర్వే అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు.

     

    కంప్యూటరీకరణకు పరుగులు



    సమగ్ర కుటుంబ సర్వేలో నమోదైన వారి డేటాబేస్ తయారీకి జీహెచ్‌ఎంసీ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వీలైనంత త్వరితంగా సర్వే వివరాలను డిజిటైజేషన్ చేయించేందుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. అంతేకాదు.. శుక్రవారంతో టెండర్ ప్రీబిడ్ సమావేశం.. సాంకేతిక, ఆర్థిక టెండర్లను ఖరారు చేసి.. మర్నాటి నుంచే ఒప్పందం పూర్తి చేసి.. పనులు చేపట్టాలనే తలంపుతో ఉన్నారు. ఒక్కో జోన్‌కు ఏకంగా 200 కంప్యూటర్లు.. మూడు షిప్టులుగా రేయింబవళ్లు పని చేసేందుకు తగిన సిబ్బంది కలిగిన సంస్థలు టెండరులో పాల్గొనాల్సిందిగా ఆర్‌ఎఫ్‌పీ జారీ చేశారు. ఇలా ఐదు జోన్లకు మొత్తం వెయ్యి కంప్యూటర్లు .. మూడు వేల మంది ఆపరేటర్లు 24 గంటల పాటు పని చేయనున్నారు. ఈ స్పీడ్‌కు తగిన విధంగా టెండరును దక్కించుకోగల సంస్థలు నగరంలో ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టెండరు ప్రకటనకు.. ఖరారుకు మధ్య ఒక్కరోజు మాత్రమే గడువివ్వడం..అదీ చిన్నాచితకా ప్రాజెక్టు కాకపోవడంతో అధికారుల ఆలోచన ఏమేరకు సఫలీకృతం కానుందన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రీబిడ్ సమావేశంలో ఎలాంటి అభిప్రాయాలొస్తాయోననేది ఆసక్తికరంగా మారింది. అధికారుల దూకుడుకు తగ్గట్టుగా  పని చేయగల సామర్ధ్యం ఉన్న సంస్థలున్నాయా.. లేవా? అన్నది నేడు తేలనుంది.

     

    కఠిన నిబంధనలు




    టెండరు నిబంధనలు సైతం కఠినంగా ఉన్నాయి. ఒప్పందం ముగియగానే ప్రాజెక్టు చేపట్టాలి. లేని పక్షంలో రోజుకు రూ. 20 వేల వంతున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. టెండరు దక్కించుకున్న సంస్థ పది రోజుల్లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఇలాంటి నిబంధనల వల్ల ఎందరు ముందుకొస్తారనేదీ ఆసక్తికరంగా మారింది.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top