పరిశ్రమలకు జిల్లా అనుకూలం


తాండూరు: కొత్త పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటుకు జిల్లాలో భూములు సిద్ధంగా ఉన్నాయని, సీఎం కేసీఆర్ పిలుపుతో అనేక పరిశ్రమలు తరలివస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు తాండూరుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.



పరిశ్రమల స్థాపనకు సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్‌లు పెద్ద కంపెనీలకు ఆహ్వానం పంపగా వారి నుంచి సానుకూల స్పందన వస్తున్నదని, అదే ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ పరిశ్రమలు ఏర్పాటుచేస్తే అధిక మొత్తంలో భూములు ఇస్తామన్నా కంపెనీలు ఆసక్తి చూపడంలేదని అన్నారు. కొత్త కంపెనీల ఏర్పాటుకు రంగారెడ్డి జిల్లా అనుకూలంగా ఉంటుందని, ఆయా కంపెనీలకు అన్ని రకాల అనుమతులు త్వరితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.



జిల్లాలోని భూములను గుర్తించి, పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపే కంపెనీలకు ఇవ్వడానికి సిద్ధం చేశామన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ విభజన ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, కేంద్రం ఆర్టీసీ విభజన, ఆస్తుల పంపకంపై ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసిందని, ఈ విషయమై కేంద్రంతో చర్చించేందుకు త్వరలో ఢిల్లీ వెళ్తున్నామని మంత్రి చెప్పారు.  



రూ.1,061కోట్ల రుణాలు మాఫీ

జిల్లాలో 2.15లక్షల మంది రైతులకు సుమారు రూ.1,061కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని మంత్రి వెల్లడించారు. తాండూరు నియోజకవర్గ పరిధిలో 30,549మంది రైతులకు సుమారు రూ.151కోట్ల రుణాలు మాఫీ అయ్యాయన్నారు. అదే విధంగా జిల్లాలోని పలు మండలాల్లో కొత్తగా మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.



ఇందుకోసం ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావుతో మాట్లాడినట్టు వివరించారు. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, కోట్‌పల్లిలో కొత్తగా మార్కెట్ కమిటీలు ఏర్పాటు కానున్నాయని, మిగితా నియోజకవర్గాల్లో మార్కెట్ కమిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించామని మంత్రి చెప్పారు. రెండు, మూడు నెలల్లో కొత్త మార్కెట్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందన్నారు. పత్తి, మొక్కజొన్న, జొన్న, పసుపు, పెసర్లు, మినములు, కంది, ఆముదాల పంటలను ప్రభుత్వం సాధారణ పంటలుగా గుర్తించి, పంట బీమా సదుపాయాన్ని ఈనెల 30వరకు పొడిగించినట్టు వివరించారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా రూ.50కోట్లతో పాఠశాలల భవనాలు, మౌలిక వసతులు కల్పించనున్నట్టు చెప్పారు. టీచర్ల కొరత తీర్చేందుకు సర్కారు కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top