ఇప్పట్లో కొత్తవి లేనట్టే


ఆహార భద్రతా కార్డుల జారీలో జాప్యం పూర్తి కాని టెండర్లు

 స్లిప్‌ల పేరిట రూ.15.35 కోట్ల భారం


 సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్‌లో కొత్త రేషన్ (ఆహార భద్రత) కార్డులు ఇప్పట్లో జారీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నెల మొదటి వారంలోనే కొత్తవి  జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా...ఇప్పటి వరకు టెండర్లే పూర్తి కాలేదని సమాచారం. వివిధ దశలు దాటి కార్డులు లబ్ధిదారుల చేతికి అందేసరికి మరో రెండు, మూడు నెలలు పట్టవచ్చని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. గత 11 నెలలుగా డేటా స్లిప్‌లపైనే రేషన్ సరుకుల పంపిణీ సాగుతోంది. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాత రేషన్ కార్డులన్నింటినీ రద్దు చేసింది. కొత్తగా దరఖాస్తులు స్వీకరించి జనవరి నెలలో ఆహార భద్రత పథకం కింద కార్డులు మంజూరు చేసింది. ఆహార భద్రత వెబ్‌సైట్‌లో కార్డు డేటాను పొందుపరిచి చేతులు దులుపుకుంది. కనీసం కూపన్లు కూడా జారీ చేయకపోవడం తో కార్డుదారు లు ప్రతి నెలా డేటా స్లిప్‌ను ఇంట ర్నెట్ నుంచి తీసుకొని రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నారు.



 యూవిక్ పేపర్‌తో కార్డులు

 ఆహార భద్రత కార్డులను యూవిక్ పేపర్‌తో తయారు చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. కార్డు తయారీకి ఖర్చు తక్కువగా నిర్ణయించడంతో కాంట్రాక్టర్లు వెనక్కు తగ్గారు. వాస్తవంగా రెండు నెలల క్రితమే టెండర్లు పిలవగా... నలుగురు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. కార్డు తయారీ విధానంలో చేర్పులు, మార్పులు, సాంకేతిక కారణాలతో టెండర్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వచ్చే నెలాఖరుకైనా ఈ తంతును పూర్తి చేసి కొత్త సంవత్సరంలో కార్డులు జారీ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు.



 బాదుడే ...బాదుడు

 గ్రేటర్ లోని ఆహాలోర భద్రత కార్డుదారులపై ఇప్పటి వరకు రూ.15.35 కోట్ల అదనపు భారం పడింది. వీటిని మంజూరు చేసినట్టు చెప్పడమే తప్ప ఇంతవరకూ లబ్ధిదారులకు అందలేదు. గ్రేటర్‌లోని మొత్తం 12 సర్కిళ్లలో సుమారు 13.96 లక్షల కార్డుదారులు ఉన్నారు. ప్రతి నెల డైనమిక్ కీ రిజిస్టర్‌లో లబ్ధిదారుల వివరాల్లో చేర్పులు, మార్పులు జరుగుతుండటంతో డేటా స్లిప్ తప్పనిసరిగా మారింది. దీంతో లబ్ధిదారులు రూ.10 వంతున చెల్లించి డేటా స్లిప్ పొందుతున్నారు. కొత్త కార్డులు జారీ అయ్యే వరకు డేటా స్లిప్  బాదుడు భరించక తప్పని పరిస్థితి నెలకొంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top