జీడీకే-3 మూసివేతకు నిర్ణయం

జీడీకే-3 మూసివేతకు నిర్ణయం - Sakshi


పూర్తయిన బొగ్గు నిల్వలు

ఐదు దశాబ్దాల పాటు సాగిన బొగ్గు ఉత్పత్తి


 

 గోదావరిఖని :సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాల్లో 1962లో ప్రారంభించిన జీడీకే-3వ గనిని మూసివేసేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. మరో రెండు మూడు రోజుల్లో ఈ గనిలో బొగ్గు ఉత్పత్తి పనులు నిలిపివేయనున్నారు. ఇప్పటికే రెండు ఎస్‌డీఎల్ యంత్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసిన యాజమాన్యం వాటిని బయటకు తీసుకువస్తోంది. గతంలో ఆర్జీ-1 ప్రాంతంలో జీడీకే 6, జీడీకే 6ఏ, జీడీకే 6బీ, జీడీకే 5ఏ గనులను మూసివేయగా...వాటి జాబితాలోకి జీడీకే 3వ గని చేరనున్నది. గోదావరి పరివాహక ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు గుర్తించిన అనంతరం రెండో దశలో భాగంగా మూడో గనిని ప్రారంభించారు. గడిచిన 54 ఏళ్లలో ఒకటో పొర, రెండో పొరల్లో నిక్షిప్తమైన 7.6 మిలియన్ టన్నుల బొగ్గును ఈ గని ఉత్పత్తి చేశారు. గనిలో గడిచిన మూడేళ్ల వరకు పూర్తిగా తట్టా చెమ్మస్ విధానం ద్వారా బొగ్గు ఉత్పత్తి చేయగా...ఆ తర్వాత పాక్షికంగా యాంత్రీకరణను ప్రవేశపెట్టారు. కాగా ప్రస్తుతం ఈ గనిలో బొగ్గు నిల్వలు అంతరించి పోవడంతో అధికారులు మూసి వేసేందుకు నిర్ణయించారు.



మరో రెండు రోజుల్లో అందులోని ముఖ్యమై యంత్రాలు, పరికరాలు వెలికి తీసి మూసివేయనున్నారు. మూడో గనిగా ప్రస్థానం మొదలు పెట్టిన ఈ గనిలో దాదాపు 1000 మంది కార్మికులు మొదట్లో పనిచేశారు. ఇసుక నింపే (సాండ్ స్టోవింగ్) విధానంతో బొగ్గు ఉత్పత్తి చేపట్టారు. మూడో గనిగా ప్రస్థానం సాగించిన ఈ గనిని 2006లో జీడీకే-1వ గనిలో విలీనం చేశారు. అప్పటి వరకు ఒకటో సీమ్‌లో 3.3 మిలియన్ టన్నులు, రెండో సీమ్‌లో 4.2 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు గుర్తించి వెలికితీసారు. అయితే ఏ గనినైనా మూసివేయడానికి నిర్ణయం తీసుకున్నప్పటికీ దాదాపుగా గనిలో గుర్తించి నిల్వలలో 60 శాతం మాత్రమే వెలికితీస్తారు. కానీ.. జీడీకే మూడో గనిలో దాదాపు 90 శాతం మేర బొగ్గును వెలికితీయడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top