కృష్ణ.. కృష్ణా!

కృష్ణ.. కృష్ణా! - Sakshi


జిల్లా ప్రజలను తాగునీటి సమస్య వెంటాడుతోంది. రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటుతుండడంతో పరిస్థితి జటిలంగా మారుతోంది. గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.  నీటి ఎద్దడి నివారణకు సర్కారు తలపెట్టిన కృష్ణా జలాల పంపిణీలో సమస్యలు తలెత్తాయి. హైదరాబాద్‌కు  నీటిని సరఫరాచేసే క్రమంలో జిల్లా వాసులకు సైతం తాగునీరు అందించేందుకు ఎనిమిది పథకాలు ప్రవేశపెట్టింది. మొదట్లో ఈ పథకాలతో ప్రజలకు సాంత్వన లభించినా.. ప్రస్తుతం తాగునీటి కష్టాలు పునరావృతమయ్యాయి. జనాభా ప్రాతిపదికన నీరు కేటాయించాల్సి ఉన్నప్పటికీ.. జలమండలి అధికారులు సరఫరాలో భారీగా కోతలు పెడుతున్నారు. దీంతో జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాలుస్తోంది.

 - సాక్షి, రంగారెడ్డి జిల్లా

 

* తాగునీటి సరఫరాలో జలమండలి కోతలు

* జనాభా ప్రాతిపదికన కొనసాగించని వైనం

 * రోజురోజుకూ తీవ్రమవుతున్న నీటి ఎద్దడి


 సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీటి సరఫరాను హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్(హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) నిర్వహిస్తోంది. ఇవికాకుండా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి నిర్వహణ, బిల్లుల చెల్లింపుల ప్రక్రియ గ్రామీణ నీటిసరఫరా విభాగం చూస్తోంది. జిల్లాలో అమలవుతున్న ఎనిమిది రక్షిత మంచినీటి పథకాల (సీపీడబ్ల్యూఎస్) ద్వారా దాదాపు 320గ్రామాలకుపైగా కృష్ణా నీరు సరఫరా అవుతోంది. అయితే జనాభా ప్రాతిపదికన  నీరు కేటాయించి సరఫరాచేస్తే సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. కానీ జనాభా సంఖ్యతో సంబంధం లేకుండా నీరు సరఫరా చేస్తుండడంతో సమస్యలు జటిలమవుతున్నాయి.



వాస్తవానికి ఎనిమిది ప్రాజెక్టుల్లో రాజేంద్రనగర్ మినహాయిస్తే మిగతా ఏడు ప్రాజెక్టుల ద్వారా ప్రతి రోజు 36,742 కిలోలీటర్ల తాగునీరు సరఫరా చేయాలి. కానీ రోజువారీ అవసరాల్లో కేవలం సగం మాత్రమే సరఫరా చేస్తున్నారు. శంషాబాద్ ప్రాజెక్టు ద్వారా నీటిసరఫరా నిలిచిపోగా.. మిగతా ఏడు ప్రాజెక్టుల ద్వారా ప్రతి రోజు 17,890 కిలోలీటర్ల నీరు సరఫరా చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ గణాంకాలు చెబుతున్నాయి. ఈలెక్కన ప్రతిరోజు సరఫరా చేయాల్సిన దాంట్లో 19,952 కిలోలీటర్ల నీటికి జలమండలి గండి పెడుతోంది. ఫలితంగా జిల్లా ప్రజల తాగునీటి సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది.

 

2001 జనగణనతోనే..

జిల్లాలోని ఎనిమిది సీపీడబ్ల్యూ పథకాలద్వారా 320 గ్రామాలకు రక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఇటీవల 2011 జనాభా గణాంకాల ఆధారంగా ఈ గ్రామాలకు నీటి సరఫరా చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈ పథకాలకు సంబంధించి జలమండలితో 2011కు పూర్వమే ఒప్పందం కుదిరింది. ఈక్రమంలో 2001 జనాభా లెక్కల ఆధారంగా నీటి సరఫరాకు జలమండలి విడుదల చేస్తోంది. తాజాగా 2011 జనాభా లెక్కలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నీటి సరఫరా తాజా గణాంకాల ఆధారంగా చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ పాత గణాంకాల ఆధారంగా సరఫరా చేస్తుండడంతో తాగునీటి సమస్య పరిష్కరం కావడం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top