‘ఆధార్’ దందా !

‘ఆధార్’ దందా ! - Sakshi


నగర శివారులోని భూపేష్‌గుప్తా నగర్, శ్రీరమణ కాలనీలకు ఇటీవల ముగ్గురు యువకులు ల్యాప్‌టాప్, వేలి ముద్రల యంత్రం, వెబ్ కెమెరాలతో వచ్చారు. ఆధార్ నమోదు చేస్తామంటూ ఇంటింటికీ తిరిగారు. ఒక్కో కార్డుకు రూ. 300 అవుతుందన్నారు. కార్డులు లేనివారంతా ముందుకు వచ్చారు. వారికి ఫొటోలు తీసి.. వివరాలను నమోదు చేసుకున్నారు. నమోదు పత్రాలు ఇచ్చారు. పదిహేను రోజుల తర్వాత కార్డులిస్తామని చెప్పారు. రెండు కాలనీల్లో దాదాపు 500 మంది నమోదు చేసుకున్నారు... ఇలా నగర శివారుల్లో ప్రైవేటు వ్యక్తుల సంపాధనకు ఇదే ‘ఆధార్’మవుతోంది. ప్రజల జేబుకు చిల్లు పెడుతోంది.

 

సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆధార్ నంబర్ ఆధారంగా సంక్షేమ పథకాల వర్తింపునకు సిద్ధం కావడంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన  మొదలైంది. ఇప్పటికే వివిధ శాఖల డేటాబేస్‌ను ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది ఆధార్ కార్డులు లేనివారిని ఆందోళనకు గురి చేస్తోంది. కార్డుల కోసం వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మహా నగరంలో జనాభాకు మించి కార్డులు మంజూరు చేశామని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఓవైపు పేర్కొంటున్నా... వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.



ఆధార్ కార్డులు లేని వారు 20 శాతానికిపైగా ఉన్నట్టు తెలుస్తోంది. సిటీలో 15 నమోదు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ప్రకటించగా... బంజారాహిల్స్‌లోని కార్వీ సెంటర్‌లో మాత్రమే పని చేస్తోంది. సాంకేతిక కారణాల సాకుతో సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ప్రజల అవసరాల మేరకు ఆధార్ నమోదు కేంద్రాలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. కార్డుల కోసం ఎవరిని సంప్రదించాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనిని ఆసరాగా తీసుకుని ప్రైవేటు వ్యక్తులు దందా కొనసాగిస్తున్నారు.



కాలనీల్లో మకాం వేసి డబ్బులు దండుకునే పనిలో పడ్డారు. ఇంటింటికీ తిరుగుతూ పేరు, వివరాలు నమోదు, వేలిముద్రలు, ఐరిష్ తీస్తూ సరికొత్త వ్యాపారానికి తెరలేపారు. మరోవైపు మీసేవ కేంద్రాల్లో సైతం దోపిడీ పర్వం ప్రారంభమైంది. ఆధార్ లేని నిరుపేదలు దోపిడీకి గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రైవేటు వ్యక్తులతో సంబంధం లేదని, ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదంటూ అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ వారివైపు నుంచి ప్రజలకు ఎటువంటి సాయం అందడం లేదు.

 

నాలుగేళ్ల నుంచి...



జంట జిల్లాల్లో నాలుగేళ్లుగా ఆధార్ నమోదు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. 2010 సెప్టెంబరులో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పట్లో 136 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2012 ఫిబ్రవరి 15న పౌరుల వివరాలు విదేశాలకు చేరితే దేశరక్షణకే ప్రమాదమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సాఫ్ట్‌వేర్ హాలిడే ప్రకటించింది. ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తిరిగి కొద్ది వ్యవధిలోనే శాశ్వత ప్రాతిపదికన ఆధార్ కేంద్రాలను పునఃప్రారంభించారు. అవి మూణ్నాళ్ల ముచ్చటగానే మారాయి. తాజాగా ప్రజల ఒత్తిళ్ల మేరకు 15 కేంద్రాల ఏర్పాటుచే సినా అవి నామమాత్రంగానే పని చేస్తున్నాయి.

 

ప్రైవేటు వారే గతి

సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పని సరైంది. నమోదు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించక తప్పడం లేదు.  నమోదు కోసం అధికంగా వసూలు చేస్తున్నారు. తప్పని సరిపరిస్థితుల్లో కార్డుల కోసం డబ్బులు చెల్లిస్తున్నాం.

 - ఎ.శ్రీకాంత్, ఓంకార్‌నగర్

 

ఇంటి వద్దే నమోదు

ప్రభుత్వం ఆధార్ కేంద్రాలను ఎత్తివేయడంతో గత్యంతరం లేక దళారులను ఆశ్రయిస్తున్నాం. రూ.300 ఇస్తే ఇంటి వద్దే వేలిముద్రలు, ఐరిష్ తీసుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

 - మునుగంటి ర మాదేవి

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top