చంపేసి.. ముక్కలుగా చేసి..

చంపేసి.. ముక్కలుగా చేసి.. - Sakshi


పరిగి : దారుణం చోటుచేసుకుంది... అప్పు డబ్బుల విషయమై ఓ వ్యక్తి తన స్నేహితుడిని చంపేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి బోరుబావిలో పడేశాడు. జిల్లాలో కలకలం సృష్టించిన ఈ సంఘటన శనివారం పరిగి మండల పరిధిలోని చిగురాల్‌పల్లిలో వెలుగుచూసింది. సీఐ ప్రసాద్ కథనం ప్రకారం.. పరిగి మండలం నారాయణ్‌పూర్‌కు చెందిన ముఖ్తార్(22) పరిగిలోని బాహర్‌పేట్‌లో ఇంటర్‌నెట్ కేఫ్ నిర్వహిస్తున్నాడు. జూలై 27న ఇంటినుంచి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. స్నేహితులతో వెళ్లి ఉండొచ్చని భావించిన కుటుంబీకులు.. మరుసటి రోజు కూడా రాకపోవడంతో 30న పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహితుడు పిలవడంతో మండల పరిధిలోని చిగురాల్‌పల్లికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లాడని ముఖ్తార్ స్నేహితులు అతడి కుటుంబీకులకు చెప్పారు. ఈ విషయం వారు పోలీసులకు తెలిపారు.



 ఫోన్‌కాల్ ఆధారంగా..  

 అనుమానితుడైన చిగురాల్‌పల్లికి చెందిన రాఘవేందర్ తనకేమి తెలియదని చెప్పడంతో విడిచి పెట్టిన పోలీసులు అతడి ఫోన్‌కాల్స్‌పై ఆరా తీశారు. తనను ముఖ్తార్ సాయంత్రం 6 గంటలకు కలిసి వెళ్లాడని అతడు పోలీసులకు చెప్పగా.. ముఖ్తార్ స్నేహితులకు రాత్రి 8:30 గంటల సమయంలో ఫోన్ చేసి తాను చిగురాల్‌పల్లికి వెళ్తున్నట్లు తెలిపాడు. దీంతో అనుమానించిన పోలీసులు రాఘవేందర్‌ను పిలిచి శుక్రవారం రాత్రి తమదైన శైలిలో విచారించారు. తానే ముఖ్తార్‌ను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి గ్రామ శివారులోని బోరుబావిలో వేసినట్లు అంగీకరించాడు. శనివారం ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ ప్రసాద్, ఎస్‌ఐలు నగేష్‌కుమార్, మైనొద్దీన్ తదితరులు బోరుబావి కేసింగ్ పైప్‌కు రక్తం మరకలు ఉండడంతో జేసీబీలతో తవ్వకాలు ప్రారంభించారు.



 స్నేహితుడే హంతుడు..!

 నారాయణ్‌పూర్‌కు చెందిన ముఖ్తార్, చిగురాల్‌పల్లి నివాసి రాఘవేందర్(22) స్నేహితులు. వీరిద్దరు ఏడాది క్రితం నెట్‌కేఫ్‌లో పని నేర్చుకునేందుకు హైదరాబాద్ వెళ్లారు. అక్కడ పనిచేసే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. తన అవసరాల నిమిత్తం రాఘవేందర్ సదరు మహిళ నుంచి రూ.20 వేలు అప్పుగా తీసుకోగా ముఖ్తార్ మధ్యవర్తిగా ఉన్నాడు. అనంతరం పరిగికి వచ్చిన ముఖ్తార్ సొంతంగా నెట్‌కేఫ్ పెట్టుకోగా రాఘవేందర్ తెలిసిన వారిదగ్గర పనిచేస్తున్నాడు.  



 అప్పు అడిగినందుకే హత్య..

 రాఘవేందర్ అప్పుతీర్చకపోవడంతో డబ్బులు చెల్లించాలని మధ్యవర్తిగా ఉన్న ముఖ్తార్‌కు మహిళ ఫోన్‌చేయటం ప్రారంభించింది. దీంతో మూడు నెలల క్రితం రాఘవేందర్ దగ్గర ఉన్న ఫోన్‌ను ముఖ్తార్ లాక్కున్నాడు. రూ.8 వేలకు ఓ మొబైల్ దుకాణంలో ఇచ్చేశాడు. ఈక్రమంలో స్నేహితులిద్దరు తగాదా పడ్డారు. మిగతా డబ్బుల విషయమై గత 27న ముఖ్తార్ రాఘవేందర్‌కు ఫోన్ చేశాడు. ఈరోజే మొత్తం డబ్బులు ఇస్తాను.. తన ఫోన్‌కూడా ఇవ్వాలని రాఘవేందర్  చెప్పాడు.



ముందుగా వీరిద్దరు వెళ్లి మొబైల్ దుకాణాదారుడికి రూ. 8 వేలు ఇచ్చి ఫోన్ తీసుకొచ్చారు. మిగతా డబ్బుల గురించి అడుగగా తన సోదరుడి వద్ద ఉన్నాయని, అతడు పొలం వద్ద ఉన్నాడని నమ్మబలికిన రాఘవేందర్ గత 27వ తేదీ రాత్రి 8:30 సమయంలో ముఖ్తార్‌ను చిగురాల్‌పల్లి శివారుకు రప్పించాడు రాఘవేందర్. రాత్రి 9 వరకు ఉండి పథకం ప్రకారం రాఘవేందర్ స్వగ్రామానికే చెందని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ముఖ్తార్‌ను హత్యచేశాడు.  



 ముక్కలుగా చేసి..

 ఘటనా స్థలంలోని ఆనవాళ్ల ఆధారంగా ముఖ్తార్‌ను నిందితులు అతి దారుణంగా చంపేసినట్లు తెలుస్తోంది. ముందుగా గొంతు కోసి అక్కడినుంచి 50 మీటర్ల దూరం తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శవాన్ని ముక్కలుగా చేసి సమీపంలో ఉన్న ఓ ఖాళీ బోరుబావిలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు రాఘవేందర్‌ను తమదైన శైలిలో విచారించటంతో హత్య విషయం వెలుగుచూసింది.



 పోలీసులు శనివారం ఉదయం 11 గంటలకు నాలుగు జేసీబీలతో బోరుబావి వద్ద సమాంతరంగా తవ్వకాలు ప్రారంభించారు. బోరుబావిలో మీటర్ వేసి చూడగా సుమారు 30 ఫీట్ల లోతులో మృతదేహానికి సంబంధించిన భాగాలు ఉన్నట్లు అంచనా వేశారు. విషయం తెలుసుకుకున్న పరిగి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి వివరాలు సేకరించారు. తహశీల్దార్ ఉపేందర్‌రెడ్డి, సీఐ ప్రసాద్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.



స్థానిక టీఆర్‌ఎస్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, సుభాష్‌చందర్‌రెడ్డి, నారాయణ్‌రెడ్డి, ఉస్మాన్, అశ్రఫ్, సర్వర్, అక్బర్, షాహెద్ తదితరులు సహాయక చర్యల్లో పాల్గొని పోలీసులకు సహకరిస్తున్నారు. మృతదే హం బయటపడేందుకు మరో 24 గంటలు పట్టొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ముఖ్తార్ హత్యతో అతడి కుటుంబీకులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top