జనాభా కంటే ఓటర్లెక్కువ!?

జనాభా కంటే ఓటర్లెక్కువ!? - Sakshi

  •       2011 జనగణన ప్రకారం ‘గ్రేటర్ ’ జనాభా 67,31,790

  •      జీహెచ్‌ఎంసీలో ప్రస్తుత ఓటర్లు 78,48,259

  •      ఇదీ గ్రేటర్ వి‘చిత్రం’

  •  సాక్షి, సిటీబ్యూరో : సాధారణంగా మొత్తం జనాభాలో ఓటర్లు 70 శాతానికి అటూ ఇటూగా ఉంటారనేది నిపుణుల అంచనా. అదేమి విచిత్రమో కానీ.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్  (జీహెచ్‌ఎంసీ)లో మాత్రం జనాభా కంటే ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అయితే జనాభా 2011 జనగణన వివరాల మేరకు కాగా.. ఓటర్ల సంఖ్య మాత్రం తాజాది.



    2011 జనగణన ప్రకారం గ్రేటర్ జనాభా 67,31,790 ఉంటే ఓటర్లు 78,48,259 మంది ఉన్నారు. అంటే కేవలం మూడేళ్లలోనే ఓటర్లు జనాభాను మించిపోయారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నగరానికి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారా? అంటే గత మూడేళ్ల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే అదీ లేదు. అయినా గ్రేటర్‌లో జనాభా కంటే ఓటర్లు సుమారు 11 లక్షలకు పైగా పెరిగిపోయారు. ఇదే అంశంపై వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది.



    2011లో జనగణన జరిగిన సమయంలో టీ ఆర్‌ఎస్, వివిధ జేఏసీల ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె, ఇతరత్రా ఆందోళనలు జరిగాయని జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. నిర్ణీత వ్యవధిలోగా జనగణన వివరాలు అందజేయాలి కనుక అప్పట్లో జనగణన కార్యక్రమం గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాల్లో సవ్యంగా జరగలేదని ప్రైవేట్ సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. దీనికితోడు ఓటు హక్కుపై పెరిగిన ప్రచారం, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల వల్ల పెరిగిన చైతన్యం వెరసి ఓటర్లు ఇటీవల భారీగా పెరిగారు.



    గడచిన మూడుమాసాల్లోనే కొత్త ఓటర్లుగా 3.66 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకున్నారంటేనే ఓటుపై ప్రచారం ఏ మేరకు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కంటే ఓటర్లుగా పేరు నమోదు చేయించుకున్న వారు పెరిగినప్పటికీ.. జనాభా కంటే ఎక్కువైతే ఉండరు. జనగణన సరిగా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. మరో ముఖ్యవిషయమేమిటంటే.. మెదక్‌జిల్లా పరిధిలోని పటాన్‌చెరు డివిజన్ కూడా గ్రేటర్‌లోనే ఉంది.



    ఈ నియోజకవర్గంలోని రెండు డివిజన్లు మాత్రమే గ్రేటర్‌లో ఉన్నందున ఆ నియోజకవర్గ ఓటర్లను పరిగణనలోకి తీసుకోలేదు. ఆ నియోజకవర్గ మొత్తం ఓటర్లను (2,93,768మందిని) పరిగణనలోకి తీసుకుంటే ఓటర్లు 81,42,027 గా ఉన్నారు. ఈ లెక్కల్ని బట్టి గ్రేటర్ జనాభా దాదాపు కోటికి చేరి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top