రిమ్స్‌కు గడ్డుకాలం


ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఒకవైపు వైద్యుల కొరత వెంటాడుతుంటే.. మరోవైపు ఉన్న వైద్యులు వెళ్లిపోవడం.. ఇంకో పక్క వైద్యు ల పదవీకాలం ముగియడంతో రిమ్స్ భవిష్య త్తు అగమ్యగోచరంగా మారింది. వైఎస్సార్ సీఎంగా ఉన్నంత కాలం రిమ్స్‌లో మెరుగైన  వైద్య సేవలు అందాయి.



ఆయన మరణానంతరం సదుపాయాలు, వైద్యులు, పరికరాల కొరతతో రోగులకు వైద్యం అందడం లేదు. రిమ్స్‌లో 21 విభాగాలకు 148 పోస్టులు మంజూరయ్యాయి. ఏడేళ్లుగా పూర్తిస్థాయిలో వైద్యపోస్టులు భర్తీకాలేదు. ఇప్పటివరకు కేవలం 65 పోస్టులే భర్తీకాగా 83 ఖాళీగా ఉన్నాయి. కాగా ఉన్న 65 మంది వైద్యుల్లోంచి 18 మంది వైద్యుల పదవీ కాలం ముగియడంతో ఆ సంఖ్య 47కు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో రోగులకు వైద్య సేవలు అందించడం ప్రశ్నార్థకంగా మారింది.



 డీఎంఈకి ప్రతిపాదనలు

 రిమ్స్‌లో పదవీకాలం ముగిసిన 18 మంది వైద్యులను పొడగించాలంటూ రిమ్స్ అధికారులు డీఎంఈ(డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్)కు ప్రతిపాదనలు పంపారు. వీరిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఉన్నారు. 18 మందిలో తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వారు ఉండగా, డీఎం ఈకి పంపిన ప్రతిపాదనల్లో వీరందరికి అనుమతిస్తుం దా? లేదా అనేది అనుమానంగా ఉంది. ఒకవేళ డీఎం ఈ నుంచి ఆదేశాలు వస్తే అందులో తెలంగాణ ప్రాంత వైద్యులు లేనట్లైతే.. స్థానికులకు ఇవ్వాలంటూ వారి నుంచి నిరసనలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. 18 మందిని పొడిగించడం వీలుకాదని డీఎంఈ తేల్చేసిన పక్షంలో ఇక రిమ్స్‌లో 47 మంది వైద్యులు మాత్రమే మిగులుతారు. వీరిలో కొంత మంది ఇంటిదారి పట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రోగులకు వైద్య సేవలు మృగ్యం కానున్నాయి.



 ఎంసీఐ పరిశీలనకు వస్తే..

 ఇప్పుడున్న పరిస్థితుల్లో రిమ్స్‌కు ఎంసీఐ(మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) పరిశీలనకు వస్తే అంతే సంగతి. ఇప్పటికే రిమ్స్ నుంచి మొదటి ఎంబీబీఎస్ బ్యాచ్ పూర్తి చేసుకొని వెళ్లింది. ఈ నేపథ్యంలో పీజీ తరగతుల అనుమతి, మెడికల్ సీట్లు పెంచే యోచనలో రిమ్స్ పరిశీలనకు ఎంసీఐ సిద్ధమైన పక్షంలో ఇందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, సిబ్బంది సంఖ్య చూపించాలి. ప్రతి సారీ ఎంబీబీఎస్ తరగతుల అనుమతికి ఎంసీఐ వచ్చినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి కొంత వైద్యులను అద్దెకు తెచ్చి చూపించేవారు.



ఆ సమయంలో రిమ్స్‌లో వైద్యుల సంఖ్య వంద వరకు ఉండేది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 47 మంది వైద్యులే ఉండడంతో అనుమతికి కావాల్సిన స్థాయిలో వైద్యులను చూపించడం అసాధారణం. ఒకవేళ ఎంసీఐకి వీటన్నింటిని పూర్తిస్థాయిలో నివేదించకపోతే ఇంతటితో మెడికల్ సీట్లను నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఐదు బ్యాచ్‌లు పూర్తి చేసేంత వరకు మాత్రమే కళాశాల కొనసాగించి ఆ తర్వాత ఎత్తివేసే అవకాశాలు లేకపోలేదని రిమ్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే గనుక జరిగితే ఎన్నో కోట్లు వృథా. లక్షల మంది పేద ప్రజల ఆశలు ఆవిరిపోతాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు రిమ్స్‌పై దృష్టిసారించి వైద్యులు, సదుపాయాల కల్పన కోసం కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.



 రెండేళ్లుగా భర్తీ లేవు

 రెండేళ్ల నుంచి రిమ్స్‌లో వైద్యుల పోస్టులు భర్తీ కావడం లేదు. 2012లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా రిమ్స్‌లో 52 పోస్టులు భర్తీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నలుగురు డెరైక్టర్‌లు మారారు. కానీ వైద్యుల భర్తీ మాత్రం జరగలేదు. దీంతో వైద్య విద్యార్థులకు బోధనతోపాటు, రోగులకు వైద్య సేవలు అందడం లేదు. లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ రిమ్స్‌లో వైద్యులు పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు.



పలుమార్లు రిమ్స్‌లో వైద్యుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు నోటిపికేషన్ ఇచ్చినా కొన్ని కారణాల వల్ల నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 1000 వైద్య పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. రిమ్స్ భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనైన రిమ్స్‌కు న్యాయం జరుగాలని ప్రజలు కోరుతున్నారు.



 ప్రతిపాదనలు పంపాం.. - డాక్టర్ సురేష్ చంద్ర, రిమ్స్ డెరైక్టర్

 రిమ్స్‌లో 18 మంది వైద్యుల పదవీకాలం ముగియడంతో వారిని పొడిగించేందుకు డీఎంఈకి ప్రతిపాదనలు పంపాం. దీంతోపాటు ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డీఎంఈ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. 18 మంది వైద్యులకు అనుమతి వచ్చిన వెంటనే ఇతర పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతాం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top