చతికిలపడ్డ ‘దేశం’


     189 వార్డుల్లో గెలిచింది ఐదు సీట్లే..

     ఐదు మున్సిపాలిటీల్లో ఖాతా తెరవని వైనం

     పొత్తుతో నష్టపోయిన కమలం


 సాక్షి, మంచిర్యాల : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చతికిల పడింది. ఇందుకు సోమవారం వెలువడిన మున్సిపాలిటీ ఫలితాలే నిదర్శనం. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఐదు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవకపోవడం ఇందుకు నిదర్శనం. గెలిచిన ఒక్క బెల్లంపల్లిలో కూడా కేవలం ఐదుగురు మాత్రమే విజయం సాధించడం పరిస్థితికి అద్దంపడుతోంది. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేం దుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు అనుసరించిన వ్యతిరేక వైఖరి ఈ పరిస్థితికి కారణమైందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒక దశలో పోటీ చేసేందుకే అభ్యర్థులు ముందుకు రాని ఇబ్బందికర పరిస్థితులను ఆ పార్టీ ఎదుర్కొంది.



భైంసా మున్సిపాలిటీలోని 23 వార్డు ల్లో ఒక్క వార్డు, నిర్మల్‌లో 32 వార్డులకు 7, ఆదిలాబాద్‌లోని 36 వార్డులకు 12, మంచిర్యాల మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో 13, కాగజ్‌నగర్‌లోని 28 వార్డులకు 18 మం ది బరిలో ఉన్నారు. బెల్లంపల్లిలోని 34 వార్డుల్లో 30 చోట్ల పోటీచేయగా కేవలం 5 చోట్ల మాత్రమే విజయం సాధిం చింది. టీడీపీ తరఫున పోటీ చేసేందుకు పలువురు పార్టీ నాయకులే ఆసక్తి చూపక స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేయడం గమనార్హం. బరిలోకి దిగినవారికి ప్రచార సమయంలోనూ తమ పార్టీ విధానం, నాయకుడి గురించి ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనిపించాయి. ఎన్నికల ఫలితాల సమయంలోనూ ఆ పార్టీ చేతులు ఎత్తివేసిన విధానం తేటతెల్లం అయింది. ఒకప్పుడు అధికారం చలాయించిన, ప్రధాన పార్టీగా ఉన్న స్థితి నుంచి ఐదు మున్సిపాలిటీల్లో ఖాతా తెరవని దుస్థితికి చేరడం బాధాకరం.



 కొంపముంచిన పొత్తు

 టీడీపీతో పొత్తు తమ కొంప ముంచిందని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఎనిమిది చోట్ల, ైభె ంసా మున్సిపాలిటీలో ఆరు చోట్లా తప్పా బీజేపీ ఒక్క వార్డులోనూ విజయం సాధించలేదు. ఆ రెండు చోట్లా పార్టీకి ఉన్న బలమే ఈ మాత్రం సీట్ల సాధనకు ఉపయోగపడింది తప్ప టీడీపీతో ఒరిగిందేమి లేదని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.



తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ ఇచ్చిన మద్దతు కారణమని ప్రచారం చేసుకుంటూ ఒంటరిగా పోటీచేసినా మరిన్ని స్థానాల్లో విజయం సాధించేవారమని బీజేపీ వర్గాలు వాపోతున్నాయి. టీడీపీ నాయకులు తమ ప్రచారానికి మద్దతివ్వలేదని, కలిసిరాని వారు పొత్తు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నిస్తున్నారు. తమను బలి చేసేందుకు పొత్తు కుదుర్చుకున్నారేమోనని మండిపడ్డారు. చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకున్న వారెవ్వరూ బాగుపడలేదని.. గతంలోనే తాము సైతం భంగపడ్డ విషయాన్ని మరోమారు తమకు రుచి చూపించారని దుయ్యబడుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top