తెలంగాణ విద్యార్థులకు ఏపీ బోర్డు మెమోలు

తెలంగాణ విద్యార్థులకు ఏపీ బోర్డు మెమోలు - Sakshi


అధికారుల నిర్లక్ష్యంతో  విద్యార్థులకు ఇబ్బందులు

 

హైదరాబాద్: అందరికీ తెలంగాణ వచ్చింది. కానీ ఇంటర్ బోర్డుకు రాలేదట! అదేంటి అనుకుంటున్నారా? అలాగే ఉంది టీ ఇంటర్ బోర్డు అధికారుల నిర్వాకం. తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు పరిధిలోని కాలేజీల నుంచి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏపీ ఇంటర్మీడియెట్  బోర్డు పేరుతో మార్కుల మెమోలు ఇచ్చేశారు. దీంతో విద్యార్థులు లబోదిబోమంటూ ఇంటర్ బోర్డు వద్దకు పరుగెత్తుకొచ్చారు. దీంతో ‘ఏముందిలే.. తెలంగాణ ఇంటర్ బోర్డు పేరుతో మరో మెమో ముద్రించి ఇస్తాం.. అది ఇచ్చేయండి.. అంటూ వెనక్కి తీసుకుంటున్నారు. ఇంత జరిగినా బోర్డు అధికారులు అదేం లేదంటూ బుకాయిస్తున్నారు.



అడుగడుగునా నిర్లక్ష్యం: మొన్నటి ఇంటర్ పరీక్షకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.  ఈ వ్యవహారంలో అధికారులు అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సాధారణంగా ఒక విద్యార్థి మెమోను ముద్రించాక అధికారికంగానే మూడు దశల్లో పరిశీలిస్తారు. ముద్రణాలయం నుంచి వచ్చాక సంబంధిత సెక్షన్‌లో ఎల్‌డీసీ, సూపరింటెండెంట్, రీజినల్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్ స్థాయిల్లో పరిశీలిస్తారు. అవన్నీ దాటాకే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ పరిశీలించి విద్యార్థులకు అందజేస్తారు. అన్ని స్థాయిల్లోనూ ఈ తప్పిదాన్ని ఎవరూ గుర్తించలేదు. దీనిపై ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్‌ను వివరణ కోరగా, అలాంటిదేమీ లేదన్నారు.



విద్యార్థులకేనా శిక్ష... బోర్డుకు లేదా?



మొన్నటి వార్షిక పరీక్షల్లో యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమన్నారు. అలాగని కాలేజీ యాజమాన్యాలను శిక్షించలేదు. చివరకు ఒక్కో విద్యార్థి రూ. 10 వేల జరిమానా చెల్లించి హాల్‌టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ 200 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లను నిరాకరించారు. తప్పు చేసిన కాలేజీలను మాత్రం శిక్షించలేదు. జరిమానా చెల్లిస్తామని విద్యార్థులు కోరినా ఇచ్చేది లేదని, ఫలితాల వెల్లడి ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు. ఆ విద్యార్థులకు ఓ విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితి కల్పించారు. కాలేజీలు తప్పు చేస్తే విద్యార్థులను శిక్షిస్తారు.. మరి బోర్డు చేసిన తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తార ని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థులకు న్యాయం చేయకుండా ఇలా ఇబ్బందులు పెడుతున్న అధికారులపై చర్యలు చేపట్టాలని బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top