చీకట్లో ఉత్తర్వులు!

చీకట్లో ఉత్తర్వులు!


జీవోలు బహిర్గతం కాకుండా వెబ్‌సైట్ నిలుపుదల

వివాదాస్పద జీవోలపై  సీఎం అసంతృప్తే కారణం!


 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)ల వెబ్‌సైట్‌ను మూడు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే సాధారణ, విధాన నిర్ణయాలన్నింటినీ ఏ రోజుకారోజు ప్రజలకు వెల్లడించే (goir.telangana.govt.in) వెబ్‌సైట్‌ను ఎలాంటి ప్రకటన లేకుండా నిలిపివేయడంపై మేధావులు, సమాచార హక్కు కార్యకర్తలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు వెంటనే ప్రజలకు వెల్లడికాకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల జారీ చేసిన కొన్ని జీవోలు వివాదాలకు దారితీయడంతోనే జీవోల వెబ్‌సైట్‌ను నిలుపుదల చేసి, ఉంటారని పేర్కొంటున్నారు.


సీఎం కేసీఆర్ చైనా పర్యటన కోసం ప్రత్యేక విమానాన్ని అద్దెకు తీసుకున్న విషయం.. ఆ వ్యయం నిమిత్తం నిధులు మంజూరు చేస్తూ జారీ చేసిన జీవో వల్లే బహిర్గతమైంది. దీనిని ఎండగడుతూ జాతీయ మీడియా అప్పట్లో ప్రత్యేక కథనాలు వెల్లడించింది. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవోల ద్వారా జీహెచ్‌ఎంసీ చట్టానికి పలుమార్లు సవరణలు జరపడాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దాంతో ప్రభుత్వం అత్యవసరంగా ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వచ్చింది. ఇలా జీవోల వెబ్‌సైట్ ద్వారా ప్రభుత్వ నిర్ణయాలు బహిర్గతం కావడంతోనే ఈ సమస్యలు వస్తున్నాయని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.


ఈ నేపథ్యంలోనే జీవోల వెబ్‌సైట్‌ను నిలుపుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏయే నిర్ణయాలను ప్రజలకు వెల్లడించాలి, మరే నిర్ణయాలను వెల్లడించవద్దన్న అంశాలపై అధ్యయనం జరిపి నూతన విధానాన్ని సిఫారసు చేసేందుకు ఐటీ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని ఇదే సమావేశంలో సీఎం ఏర్పాటు చేశారు. వారం రోజుల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి కొత్త మార్గదర్శకాలను సిఫారసు చేయనుందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఆ మేరకు మార్పు చేర్పులతో జీవోల వెబ్‌సైట్‌ను పునరుద్ధరించే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. కేవలం కొన్ని రకాల విధాన పరమైన నిర్ణయాలు, భారీ మొత్తంలో నిధులకు సంబంధించి మాత్రమే ఇకపై జీవోలు జారీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ ప్రభుత్వ అవసరాలు, స్వల్ప వ్యయాలకు ఇకపై జీవోలు జారీ కావని తెలుస్తోంది. దీనితోపాటు ప్రజలకు బహిర్గతమైతే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే నిర్ణయాలపై ఏ తరహాలో ఉత్తర్వులు జారీ చేయాలన్న అంశంపై ఈ కమిటీ ప్రత్యమ్నాయాలను సిఫారసు చేయనుందని సమాచారం.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top