కోటి ఎకరాల నీటికి కొత్త కార్పొరేషన్‌


తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఏర్పాటు

ఆర్థిక వనరుల సమీకరణ, యూజర్‌ చార్జీల వసూలు బాధ్యత దీనికే

డైరెక్టర్, చైర్మన్‌గా వీరమల్లు ప్రకాశ్‌రావు నియామకం




సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం కోటి ఎకరాలకు సాగు నీరిచ్చేందుకు గాను చేపడుతున్న అన్ని సాగునీటి ప్రాజెక్టులకు అదనపు నిధుల సమీకరణకు వీలుగా ‘తెలంగాణ జల వనరుల అభివృధ్ధి సంస్థ (కార్పొరేషన్‌)’పేరుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌(ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు గురువారం నీటిపారుదల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్టులకు ఆర్థిక సంస్థల నుంచి నిధుల సమీకరణ, వినియోగం, నిర్ణీత కాలంలో ప్రాజెక్టు పూర్తి తదితర బాధ్యతలన్నీ ఈ కార్పొరేషన్‌ చూసుకోనుంది. దీనికి రూ.100కోట్ల మూలధనాన్ని ప్రభుత్వం సమకూర్చనుం డగా, మిగతా నిధులను తానే సమకూర్చు కోవాల్సి ఉంది.


రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1.90 లక్షల కోట్లతో ప్రాజెక్టులను ఆరంభించగా, అందులో రూ.60వేల కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో 1.30లక్షల కోట్ల విలువైన పనులు పూర్తి చేయాల్సిఉంది. ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే ఏటా రూ.25వేల నుంచి రూ.30వేల కోట్ల మేర నిధుల కేటాయింపు జరపాలి. ప్రాజెక్టులకు నిధుల సమీకరణ, రుణాలు, యూజర్‌ చార్జీల వసూలు, పన్నుల విధింపు వంటి అంశాలను ఈ కార్పొరేషన్‌ చూసుకుంటుంది. మార్కెట్‌ నుంచి నేరుగా రుణాలు తీసుకునేందుకు వీలుగా కార్పొరేషన్‌ స్వయం సమృద్ధి సంస్థగా రూపొందడానికి, నిధుల కొరత రాకుండా చూసేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది.



నీటి రంగ నిపుణునికి చైర్మన్‌ పదవి

కాగా కార్పొరేషన్‌ చైర్మన్‌గా వీరమల్లు ప్రకాశ్‌రావును నియమిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వునిచ్చింది. ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారని పేర్కొంది. తెలంగాణ ఉద్యమం తొలినుంచీ టీఆర్‌ఎస్‌తో ఉన్న వి.ప్రకాశ్, రాష్ట్ర జల వనరులపై అనేక పుస్తకాలు రాశారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణలో సాగునీటి రంగానికి జరిగిన అన్యాయాన్ని వెలికి తీయడంలో ఈయన కీలక పాత్ర వహించారు.



ప్రకాశ్‌కు ముఖ్యమంత్రి అభినందన

తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థకు చైర్మన్‌గా నియమితులైన ప్రకాశ్‌రావుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫోన్‌చేసి అభినందనలు తెలిపారు. వరంగల్‌ జిల్లా ములుగు వెంకటాపూర్‌కు చెందిన ప్రకాశ్‌ తెలంగాణ ఉద్యమ నిర్మాణ దశ నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించినట్లు సీఎం తెలిపారు. సాగునీటి రంగంలో విశేషమైన అవగాహన ఉన్న నేపథ్యంలోనే ప్రకాశ్‌కు జలవనరుల అధ్యయన, అభివృద్ధి సంస్థ బాధ్యతలు అప్పగించినట్లు కేసీఆర్‌ చెప్పారు. తనకెంతో ఆత్మీయుడైన ప్రకాశ్‌ ఉద్యమ సమయంలోనూ విశేష సహకారం అందించారన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top