మేడిన్ తెలంగాణ


* బ్రాండ్ ఇమేజ్ లక్ష్యంగా కొత్త పారిశ్రామిక విధానం

* తయారీ రంగంపైనే రాష్ర్ట ప్రభుత్వం ప్రధాన దృష్టి

* పారిశ్రామికాభివృద్ధి, నైపుణ్యాల పెంపు, ఉపాధి కల్పనలే ధ్యేయం

* ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీగా రాయితీలు

* ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు అదనపు ప్రోత్సాహకాలు

* మహిళల కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కులు

* పెట్టుబడిదారులకు అండగా పలు కార్యక్రమాలు

* టీ-ఐడియా, టీ-ప్రైడ్, టీ-హార్ట్, టీ-అసిస్ట్‌లకు శ్రీకారం

* రాష్ర్ట సమగ్రాభివృద్ధి దిశగా ‘టీఎస్-ఐపాస్’ ఆవిష్కరణ



సాక్షి, హైదరాబాద్: ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ ఇమేజ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించింది. పారిశ్రామికరంగానికి ఊతమిస్తూ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే దీని లక్ష్యం. ఇందులోభాగంగా పోటీతత్వాన్ని పెంచి పరిశ్రమల అభివృద్ధికి పూర్తి స్థాయిలో తోడ్పడేందుకు సర్కారు సిద్ధమైంది. కీలకమైన తయారీ రంగంపై దృష్టి కేంద్రీకరించి, గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు నైపుణ్యాలను మెరుగుపరచాలని సంకల్పించింది.


విస్తృత కసరత్తు తర్వాత రూపుదాల్చిన నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఉత్పత్తి రంగంలో రాష్ర్ట వృద్ధి రేటు జాతీయ సగటుకన్నా నాలుగైదు శాతం అధికంగా ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ దిశలో తీసుకొచ్చిన టీఎస్-ఐపాస్(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం) బిల్లును శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. కీలక రంగాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తూ, పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పిస్తూ.. రాష్ర్ట సమగ్రాభివృద్ధికి దోహదపడేలా అనేక అంశాలను పొందుపరిచారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళా పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు అందుతాయి.



భౌగోళిక స్ధితి, వనరులు, నైపుణ్యాలు, ముడిసరుకు లభ్యత, తయారీ విధానాలను బట్టి తెలంగాణలో పెట్టుబడులకు అత్యధిక ప్రాధాన్యమున్న 14 రంగాలను ప్రభుత్వం గుర్తించింది. లైఫ్ సెన్సైస్, ఐటీ హార్డ్‌వేర్, ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఏవియేషన్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, జౌళి-దుస్తులు, ప్లాస్టిక్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, ఇంజనీరింగ్ కేపిటల్ గూడ్స్, రత్నాలు, నగలు, వ్యర్థాల నిర్వహణ, సంప్రదాయేతర ఇంధనం, సోలార్ పార్కులు, ఖనిజాలు, కలప ఆధారిత పరిశ్రమలు, రవాణా లాజిస్టిక్ హబ్, ఇన్‌ల్యాండ్ పోర్టు, కంటైనర్ డిపో వంటివి ఈ కోవలో ఉన్నాయి. ప్రతి రంగానికి ప్రత్యేక ప్రధా న కార్యదర్శి లేదా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుకానుంది. ఆయా రంగాలకు అనువైన ప్రాం తాల్లో పారిశ్రామిక పార్కులను నెలకొల్పుతారు.



టీ-ఐడియా స్కీమ్‌తో ప్రోత్సాహకాలు

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పలు రాయితీలను కల్పిస్తూ టీ- ఐడియా(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ అడ్వాన్స్‌మెంట్) స్కీమ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్, భూమి ధరలో రిబేటు, భూ మార్పిడి రేటు తగ్గింపు, విద్యుత్ రీయింబర్స్‌మెంట్, పెట్టుబడిలో సబ్సిడీ, వ్యాట్ రీయింబర్స్‌మెంట్, వడ్డీ సబ్సిడీ, మొదటితరం పారిశ్రామికవేత్తలకు ప్రారంభ పెట్టుబడి, శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి వ్యయం రీయింబర్స్‌మెంట్, నాణ్యత/పేటెంట్ మద్దతు, నిర్దిష్ట ఉత్పత్తి చర్యలు, మౌలిక సదుపాయాల అభివద్ధి వ్యయం రీయింబర్స్‌మెంట్ వంటివి ఈ స్కీం ద్వారా లభిస్తాయి. అవినీతికి, అవకతవకలకు తావు లేకుంగా ఈ ప్రోత్సాహకాల మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది.



ఎస్సీ, ఎస్టీలకు టీ-ప్రైడ్..మహిళలకు స్పెషల్ పార్క్‌లు

ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక మద్దతు అందించనుంది. టీ ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంకుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్) పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. సబ్ ప్లాన్ నిధులను నేరుగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సాయంగా అందిస్తుంది. వారు చెల్లించాల్సిన మార్జిన్ సొమ్మును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.



పారిశ్రామిక పార్కుల్లో ప్లాట్ల కేటాయింపులో ప్రాధాన్యత, నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ, క్రిసిల్ రేటింగ్ ఉన్న ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా సబ్సిడీ వంటి పలు ప్రయోజనాలు కూడా వారికి దక్కుతాయి. రవాణారంగం మినహా సేవారంగం యూనిట్ల కు వడ్డీ సబ్సిడీ అమలు చేస్తారు. సీజీటీ ఎం ఎస్‌ఈ తరహా పథకం, పరిశ్రమల ప్రణాళికలు, పర్యవేక్షణకు గాను రాష్ట్ర, జిల్లా కమిటీల్లో దళిత ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థలకు ప్రమేయం కల్పిస్తారు.



ఇక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ మినహా ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా మహిళల కోసం ఒకటి లేదా 2 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకానున్నాయి. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల గుర్తింపు, శిక్షణ, ప్రతిపాదనల తయారీలో ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఉండేం దుకు సీఓడబ్ల్యూఈ, ఏఎల్‌ఈఏపీ, ఫిక్కీ-ఎఫ్‌ఎల్‌వో సంస్థలను ఆహ్వానిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల మహిళలకే ప్రాధాన్యత ఉంటుంది.



చిన్న, మధ్య, మైక్రో పరిశ్రమలపై ఫోకస్

ఇండస్ట్రియల్ పార్కుల్లో ప్లాట్లు, షెడ్ల కేటాయింపు. ప్రారంభ నష్టాలను ఎదుర్కొనేందుకు ప్రత్యేక నిధి, రిజిస్ట్రేషన్లలో సాయం, దొంగతనాల నిర్మూలన , టెక్నాలజీతో పాటు అధునికీకరణకు ప్రత్యేక నిధి. సొంత స్థలంలో ఉన్న యూనిట్లకు స్థల మార్పిడి చార్జీల చెల్లింపు, మార్కెటింగ్ కోసం ప్రదర్శనలు సదస్సులకు సాయం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవసరాలకు స్పందించేందుకు సలహా కమిటీ ఏర్పాటుకానుంది. ప్రత్యేక రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమి టీ. సంక్షోభంతో ఖాయిలా పడ్డ పరిశ్రమలకు సాయంగా కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని కూడా సర్కారు నిర్ణయించింది. వీటి ఏర్పాటు, నిర్వహణ కోసం రాష్ర్ట స్థాయి కమిటీ ఒకటి ఆర్‌బీఐతో సంధానకర్తగా వ్యవహరిస్తుంది.



ఆరు కారిడార్లలో అభివృద్ధి

జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఆరు పారిశ్రామిక కారిడార్లను అభివద్ధి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను, రెండో దశలో హైదరాబాద్-మంచిర్యాల,హైదరాబాద్-నల్గొండ, హైదరాబాద్-ఖమ్మం కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో రాష్ట్రం లోని ప్రతి జిల్లా కేంద్రాన్ని హైస్పీడ్ రైలు, రోడ్డు నెట్‌వర్క్ ద్వారా అనుసంధానం చేస్తుంది. ప్రతి జిల్లాలో 2 ఇండస్ట్రియల్ పార్కులను నెలకొల్పుతుంది. ఇక హైదరాబాద్‌లోని బడా పరిశ్రమలు అంతర్జాతీయస్థాయిలో పోటీ పడేలా చేసేం దుకు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్(ఆర్‌ఐసీహెచ్-రిచ్)ను ఏర్పాటు చేశారు.  



ఈ ఆర్థిక సంవత్సరంలో అమలయ్యేవి..

ఫార్మాసిటీ, కెమికల్ సిటీ, హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ అభివద్ధి, తెలంగాణలో జౌళి నిలయంగా వరంగల్ అభివద్ధి, ఆహార ప్రాసెసింగ్, విత్తన ఉత్పత్తి ప్రారంభ చర్యలు, పార్కులతో పాటు చిన్న టౌన్‌షిప్‌లు, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు నేరుగా రుణ సదుపాయం, వెంచర్ పెట్టుబడి, పారిశ్రామిక ఉత్పత్తులు, ఉత్పాదకతపై అంతర్‌రాష్ట్ర వ్యాట్ హేతుబద్ధీకరణ, లేబర్ చట్టాలతోపాటు పాత పారిశ్రామికరంగ నిబంధనలను సమీక్షించి సంస్కరించడం వంటి చర్యలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వం చేపట్టనుంది.



పారిశ్రామిక భూ బ్యాంక్

రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలకు అనువైన 20 లక్షల ఎకరాల భూమిని పారిశ్రామిక భూమి బ్యాంకుగా సర్కారు గుర్తించింది. దీన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ)కు బదిలీ చేస్తుంది. పార్కు ల్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పించే బాధ్యత ఆ కార్పొరేషన్‌దే. ఈ పార్కులను రహదారులు, రైల్వే, ఎయిర్‌పోర్టులకు అనుసంధానం చేసేలా రోడ్లు నిర్మిస్తారు. వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా అందుబాటులో ఉన్న నీటి వనరుల నుంచి పది శాతం కోటాను పారిశ్రామిక అవసరాలకు వినియోగించనుంది. పార్కులకు నిరంతర వి ద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా డిస్కం ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది.



సాంప్రదాయేతర ఇంధనాన్ని వాడే పరిశ్రమలకు, ఆ ఇంధనాన్ని సరఫరా చేసే వారికీతగిన ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించింది. భారీ పార్కుల్లో ప్రైవేట్ మర్చం ట్ పవర్ ప్లాంట్లను నెలకొల్పేందుకు చర్యలు చేపట్టనుంది. జాయింట్ వెంచర్ లేదా పీపీపీ పద్ధతిలో ఉమ్మడి మురుగునీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటునూ ప్రతిపాదించింది. అలాగే ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌ల్లోనే ఉద్యోగులు, కార్మికుల గృహ వసతికి వీలుగా మాస్టర్ ప్లాన్‌ను రూపొం దిస్తోంది. పరిశ్రమలకు అనువైన వాతావరణం కల్పించేందుకు పారిశ్రామిక ప్రాంత స్థానిక సంస్థను ఏర్పాటు చేస్తారు. టీస్‌ఐఐసీ ఏర్పాటు చేసే కొత్త పార్కులన్నీ దీని పరిధిలోకే వస్తాయి.



హస్తకళలకు టీ-హార్ట్, శిక్షణకు టీ-అసిస్ట్

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తెలంగాణ హస్త కళలు, సంప్రదాయ కళల ఉత్పత్తులను చేపట్టడంతోపాటు కళాకారులకు ఆదాయం వచ్చే మార్గాలపైనా రాష్ర్ట ప్రభుత్వం దృష్టి సారించింది. నిర్మల్ పెయింటింగ్స్, డోక్రా మెటల్‌వర్క్, పెంబర్తి ఇత్తడి సామాను, బిద్రీ వేర్, పోచంపల్లి ఇకత్, గద్వాల్ చీరలు, వరంగల్ తివాచీలు, జౌళి ఉత్పత్తులను గుర్తించి, వాటి మార్కెటింగ్ కోసం ‘రాష్ట్ర హస్తకళలు, చేతి పనివాళ్ల సాంకేతిక విజ్ఞాన పునరుద్ధరణ(టీ-హార్ట్)’ పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టనుంది. అలాగే పారిశ్రామిక రంగంలో ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగుల నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణ స్టేట్ యాక్సిలరేటెడ్ ఎస్‌ఎస్‌ఐ స్కిల్స్ ట్రైనింగ్(టీ-అసిస్ట్) కార్యక్రమాన్ని పరిశ్రమల శాఖ చేపట్టనుంది.



విధానాన్ని ఉల్లంఘిస్తే చర్యలు

టీఎస్-ఐపాస్ విధానం కింద సమాచార హక్కు తరహాలోనే పెట్టుబడిదారులకు తమ దరఖాస్తుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అనుమతి హక్కు కల్పిస్తారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరిగితే అధికారులకు జరిమానాలు విధిస్తారు. ప్రభుత్వ శాఖల్లో జాప్యా న్ని, అవినీతిని నిరోధించేందుకు పారిశ్రామికవేత్తలకు సహయకారిగా హెల్ప్‌డెస్క్, గ్రీవెన్స్ సెల్ అందుబాటులో ఉంటుంది. అవినీతి, అక్రమార్జనకు తావు లేకుండా అన్ని శాఖలు పారదర్శకంగా పని చేస్తాయి. సిబ్బంది చేసే తప్పులకు ఆయా శాఖల అధికారులు బాధ్యులవుతారు. విధానాన్ని ఉల్లంఘించే ఉద్యోగులపై కఠినమైన చర్యలుంటాయి. కారణం లేకుండా పరిశ్రమల్లో ఆకస్మిక తనిఖీలు ఉండవు.మూడునాలుగేళ్లకోసారి తనిఖీ చేసే పద్ధతి ఉంటుంది. పరిశ్రమల రెన్యువల్స్‌కు హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోనూ ఈ-హెల్ప్‌లైన్, హెల్ప్ డెస్క్‌లు ఉంటాయి. పరిశ్రమల శాఖ వ్యవహార లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటా యి. పరిశ్రమల శాఖ, టీఎస్‌ఐఐసీలో సిటిజన్ చార్టర్లు అమలవుతాయి.



గడువు దాటితే భూముల రద్దే

భారీ ప్రాజెక్టులకు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కమిటీ(ఎస్‌ఐపీసీ), మైక్రో, చిన్న మధ్యతరహా ప్రాజెక్టులకు జిల్లా పారిశ్రామిక అభివృద్ధి కమిటీ భూ కేటాయింపులు చేస్తుంది. పారిశ్రామికవేత్తలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఆ పరిశ్రమలకు ఎంత భూమి అవసరమవుతుందో నిపుణుల కమిటీ మదింపు చేస్తుంది. ఆ సిఫారసుల ఆధారంగానే భూమిని కేటాయిస్తారు. భూ విలువను నిర్ధారించేందుకు కమిటీ ఉంటుంది. టీఎస్‌ఐఐసీ ఈ భూమిని సదరు కంపెనీకి మార్ట్‌గేజ్ చేస్తుంది. దీంతో పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు వీలవుతుంది.



ప్రాజెక్టు పూర్తయి.. ఉత్పత్తి ప్రారంభమైతేనే ఆ భూమిపై పెట్టుబడిదారులకు హక్కు సొంతమవుతుంది. నిర్ణీత కాల వ్యవధి ప్రణాళికను దరఖాస్తుదారులు ముందే తెలియజేయాలి. ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తే వారికి దక్కిన  భూ కేటాయింపు రద్దవుతుంది. ప్రైవేటు భూముల్లోనూ పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. భూ బదలాయింపునకు వెసులుబాటు కల్పిస్తుంది.



పారిశ్రామిక విధానంపై డిక్కీ హర్షం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానాన్ని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డీఐసీసీఐ) స్వాగతించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఛాంబర్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు పి.శ్రీనివాస కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు కల్పించే విధానాన్ని తెచ్చినందుకు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top