పండుగలా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు

పండుగలా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు


జూన్ 2 నుంచి 7 వరకు కార్యక్రమాలు

పరేడ్ మైదానంలో అవతరణోత్సవాలు

సంస్కృతి, వైభవానికి ఉత్సవాల్లో పెద్దపీట

ట్యాంక్‌బండ్‌పై ముగింపు ఉత్సవాలు




హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పండుగ వాతావరణంలా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. అవతరణ వేడుకల నిర్వహణపై వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు జరిగే అవతరణ వేడుకలకు సంబంధించి జిల్లా ఇన్చార్జి మంత్రులను సంప్రదించి ప్రణాళిక సిద్దం చేసుకోవాల్సిందిగా సూచించారు. జూన్ 2న ఉదయం 9 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకావిష్కరణ చేసి ఉత్సవాలు ప్రారంభించాలన్నారు. అమర వీరులకు శ్రద్దాంజలి ఘటించేందుకు జిల్లాల్లో అమర వీరుల స్తూపాలను సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లోనూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలన్నారు. వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖులకు అవార్డులు ఇవ్వాలన్నారు.  ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లు, ట్రాఫిక్ ఐలాండ్లు, ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించాల్సిందిగా ఆదేశించారు.





పరేడ్ మైదానంలో వేడుకలు హైదరాబాద్‌లో జూన్ 2న ఉదయం 9.30 నుంచి 11.30 వరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అవతరణోత్సవాలు జరుగుతాయి. మార్చ్‌ఫాస్ట్, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శన వుంటుంది. రాజ్‌భవన్, నెక్లస్‌రోడ్డు, హుస్సేన్‌సాగర్, లుంబినిపార్కు, మెట్రో రైలు స్తంభాలు, ట్రాఫిక్ ఐలాండ్లు, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. దుకాణాలు, ప్రైవేటు సంస్థల్లోనూ రాష్ట్ర అవతరణ ఉత్సవ లోగోలు ప్రదర్శిస్తారు. ఉత్సవాలకు సంకేతంగా జూన్ రెండో తేదీ రాత్రి 8 గంటలకు పీపుల్స్‌ప్లాజాలో బాణసంచా కాల్చుతారు. వైభవం, సంస్కృతిని చాటేలా తెలంగాణ సంస్కృతి, వైభవాన్ని ప్రపంచానికి చాటేలా సాంస్కృతిక వారధి కళకారులు తెలంగాణ సాంస్కృతిక జైత్రయాత్ర’ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ప్రణాళికను సాంస్కృతిక వారధి ఛైర్మన్ రసమయి బాలకిషన్, రాష్ట్ర ప్రభుత్వ సలహదారు కేవీ రమణాచారి వెల్లడించారు.





కళాకారులు ప్రతీ రోజు రెండు జిల్లాల్లో కళారూపాలతో భారీ నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 2న నెక్లెస్‌రోడ్డులో, 3న మెదక్, నిజామాబాద్, 4న ఆదిలాబాద్, కరీంనగర్, 5న వ రంగల్, ఖమ్మం, 6న నల్గొండ, మహబూబ్‌నగర్‌లో జైత్రయాత్ర నిర్వహిస్తారు. ఏడో తేదీన హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై భారీ ప్రదర్శన నిర్విహ స్తారు. జైత్రయాత్ర కొత్త పంథాలో వుండేలా కళాప్రదర్శనలు రూపొందిస్తున్నారు. ఆవిర్భావ వేడుక లపై తెలంగాణ సాంస్కృతిక వారధి రూపొందించిన 10వేల సీడీలను, సీఎం కేసీఆర్ సందేశంతో కూడిన తెలంగాణ మాసపత్రిక కాపీలను జిల్లాలకు పంపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నిర్వహించిన సమావేశంలో డీజీపీ అనురాగ్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు బీపీ ఆచార్య, రాజేశ్వర్ తివారీ, రేమండ్ పీటర్, కార్యదర్శులు వికాస్‌రాజ్, హరిప్రీత్‌సింగ్, దానకిషోర్, మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top