‘పెద్ద’పీట మనదే..


సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పలు ప్రధాన రాజకీయ పక్షాలకు రాష్ట్రస్థారుులో నాయకత్వం వహించే అరుదైన అవకాశం జిల్లా నేతలకు లభిస్తోంది. రాజకీయ చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఖమ్మం నేతలను ఆయా రాజకీయ పార్టీలు అక్కున చేర్చుకుని రాష్ట్రస్థాయి పదవులు, పార్టీ పగ్గాలను అప్పగించటం విశేషం. జిల్లాకు చెందిన వివిధ రాజకీయపక్షాల నేతలు ఇప్పటికే ప్రధాన రాజకీయపార్టీల్లో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు.

     

తాజాగా జాతీయ పార్టీ సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా నేత తమ్మినేని వీరభద్రానికి మరోమారు అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ తొలి రాష్ట్ర కార్యదర్శిగా సంవత్సరం పాటు ఆయన పనిచేశారు. ఆయనకే మరోమారు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కింది. తమ్మినేని పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని సాధారణ కార్యకర్తగా ప్రారంభించి పార్టీ డివిజన్, జిల్లా కార్యదర్శిగా వ్యవహరించారు.  ప్రజా సమస్యలపై మహాప్రస్థానం పేరుతో పాదయాత్ర, దళితుల సమస్యలపై సైకిల్‌యాత్ర నిర్వహించి గుర్తింపు పొందారు. తమ్మినేని ఖమ్మం ఎంపీగా, ఖమ్మం శాసనసభ్యుడిగా పనిచేశారు. సీపీఎం భద్రాచలం శాసనసభ్యుడు సున్నం రాజయ్య పార్టీ శాసనసభా పక్షనేతగా వ్యవహరిస్తున్నారు.

     

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కల్లూరు మండలం నారాయణపురం వాసి, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పొంగులేటి విశేష సేవలు అందిస్తున్నారు. పార్టీని రాష్ట్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఆయన అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. యువజన, విద్యార్థి, శ్రామిక, రైతాంగంలో ఆయన చైతన్యం తీసుకొచ్చారు. తొలుత పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిండెంట్‌గా నియమితులైన పొంగులేటి, ఆ తర్వాత కొద్దికాలానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపికయ్యూరు.



ఇటు పార్లమెంట్ సభ్యునిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూనే అటు పార్టీ కార్యక్రమాల్లో విస్త­ృతంగా పాల్గొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడూ ఎండగడుతూనే ఉన్నారు. అటు పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యూరు. జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు రాష్ట్రస్థారుులో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

     

మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా జిల్లాకే చెందిన మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క నియమితులయ్యూరు.  వైరా మండలం స్థానాలలక్ష్మీపురం నివాసి అరుున భట్టి కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ అరంగేట్రం చేశారు. పార్టీ లో పలు కీలక పదవులు నిర్వహించారు. ఇప్పుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయనకు అత్యంత కీలక పదవి లభించింది.

     

సీపీఐ సైతం జిల్లాకు పెద్దపీటే వేసింది. కీలకమైన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఖమ్మం అర్బన్ మండలం కొత్తగూడెంకు చెందిన సీనియర్ నేత సిద్ది వెంకటేశ్వర్లు ఉన్నారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా మాజీ శాసనసభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు గత కొంతకాలంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సీనియర్ నేత, సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్యకు ఆ పార్టీ అవకాశం కల్పించింది.

     

తాజాగా సీపీఎం ప్రకటించిన రాష్ట్ర కార్యదర్శివర్గంలోనూ జిల్లాకు అత్యంత ప్రాధాన్యం లభించింది. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా భద్రాచలం శాసనసభ్యుడు సున్నం రాజయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌లకు అవకాశం లభించటం విశేషం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top