తెలంగాణ ఆదాయం రూ.2,650 కోట్లు

తెలంగాణ ఆదాయం రూ.2,650 కోట్లు - Sakshi

మద్యం, రిజిస్ట్రేషన్లలో భారీగా గండి

  వ్యాట్ ఆదాయం పెరిగినా లోటే

  జూలైతో పోలిస్తే రూ.150 కోట్లు తగ్గుదల

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన తర్వాత జూలైలో ఆదాయం బాగా వచ్చిందని సంబర పడినప్పటికీ.. ఆగస్టులో మాత్రం భారీగానే గండి పడింది. రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణలో ఇంకా కుదేలుగానే ఉందనడానికి ఆగస్టులో తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయమే నిదర్శనం. మద్యం అమ్మకాల్లోనూ ఆశించిన మేరకు ఆదాయం రాకపోవడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దసరా నుంచి హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తెరుస్తున్న నేపథ్యంలో.. నగరంలో ఆ మేరకు ఆదాయం మరింత తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఒకటి రెండు నెలల ఆదాయాన్ని బట్టి అది తగ్గిపోయిందని చెప్పడానికి వీల్లేదని, దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికార వర్గాలు పేర్కొంటూనే.. మరోవైపు ఆదాయం పెంచుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నాయి. వ్యాట్ పరిధిలో ప్రస్తుతం కనిష్ట పన్ను ఉన్న పలు వస్తువుల జాబితాను తయారుచేసి వాటిని 14.5 శాతం పన్నుల జాబితాలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సెల్‌ఫోన్‌లపై ఉన్న వ్యాట్‌ను పెంచాలని యోచిస్తున్నట్టు సమాచారం. అలాగే మద్యం ధరలను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నా.. ఇప్పటికే అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేని కారణంగా ధరలు పెరిగితే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

 

జూలైలో మద్యం, రిజిస్ట్రేషన్లతోపాటు గనుల ఆదాయం కూడా తిరోగమన దశలోనే ఉంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని సముపార్జించే శాఖల్లో కీలకమైన విలువ ఆధారిత పన్ను(వ్యాట్), మద్యం, రిజిస్ట్రేషన్స్, మైన్స్, రవాణా శాఖల్లో.. ఒక్క వాణిజ్య పన్నుల శాఖలోనే కొంత పురోగతి నమోదైంది. మిగిలిన శాఖల్లో ఆదాయం తగ్గడమో లేదా పెరగకపోవడమో కనిపించింది. జూలైలో ఈ శాఖల నుంచి వచ్చిన ఆదాయం రూ. 2,800 కోట్లు కాగా.. ఆగస్టులో అది రూ.2,650 కోట్లకు పడిపోయింది. అంటే రూ.150 కోట్ల మేరకు ఆదాయం తగ్గింది. జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్ర ం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఆదాయమే తెలంగాణకు మూలమని, ఆంధ్రాకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేశారు. కానీ అందుకు భిన్నంగా ఆంధ్రా ఆదాయం బాగానే ఉన్నా.. తెలంగాణలో మాత్రం తగ్గడం గమనార్హం. 

 

జూన్‌కు సంబంధించి ఆదాయ లెక్కలు లేవకపోవడంతో.. జూలైలో ఆశించిన దానికంటే బాగానే ఆదాయం వచ్చిందని భావించారు. కానీ జూలై ఆదాయంతో ఆగస్టు ఆదాయాన్ని పోల్చిచూస్తే తగ్గుదల కనిపించింది. జూలై లో ప్రతీరోజు వచ్చే ఆదాయంపై అధికారవర్గాలు సమీక్షిస్తూ వచ్చాయి. ఆగస్టులో బడ్జెట్ కసరత్తుపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడంతో ఆదాయం తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ రాష్ట్రానికి ఆధారం కావడంతో.. ఈ రెండు జిల్లాలపై అధికారులు ఎక్కువగా దృష్టి పెట్టారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక హైదరాబాద్, శివార్లలో ఆశించిన స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగని కారణంగా రిజిస్ట్రేషన్ల ఆదాయం పెద్దగా పెరగలేదు. ఖనిజ ఆదాయం కూడా తగ్గింది.

 తెలంగాణలో ఆగస్టులో వచ్చిన ఆదాయం (రూ.కోట్లలో)

 ఆదాయరంగం జూలై ఆగస్టు

 వ్యాట్ 2000 2100

 ఎక్సైజ్ 300  200

 రవాణా 150  150

 రిజిస్ట్రేషన్స్ 220  100

 మైనింగ్ 130  100

 మొత్తం 2800 2650
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top