మీ రుణానికి మాది ‘హామీ’

మీ రుణానికి మాది ‘హామీ’


మాఫీపై రైతులకు రుణ హామీ పత్రాలు  తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయం

 

 {పభుత్వం తరఫున పత్రాలపై మండల తహశీల్దారు సంతకం

 ఈ పత్రం బ్యాంకులకు చూపిస్తే.. కొత్త రుణాలు మంజూరు

 సమస్యలుంటే మండల, జిల్లా గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేయాలని సూచన


 

హైదరాబాద్: రైతులకు రుణ మాఫీ కింద ఇప్పటికే 25 శాతం నిధులు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. వారిలో మరింత ఆత్మవిశ్వాసం నింపడానికి వీలుగా రుణ హామీ పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. రుణమాఫీ వల్ల లబ్ధి పొందే ప్రతీ రైతుకు ఈ మేరకు హామీ పత్రాలు ఇవ్వనుంది. తద్వారా రైతులకు ప్రభుత్వంపై భరోసా కల్పించడమేకాక రుణ మాఫీ అమలు అవుతున్న విషయానికి విస్తృతంగా ప్రచారం కల్పించవచ్చని సర్కారు భావిస్తోంది. బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాల్లో 25 శాతం మొత్తాన్ని వారి పేరుతో బ్యాంకుల్లో జమ చేశామని, మిగిలిన 75 శాతం రుణాన్ని కూడా ప్రభుత్వమే వడ్డీ సహా బ్యాంకులకు చెల్లిస్తుందని, దీనిపై అధైర్యపడవద్దని పేర్కొంటూ ఈ హామీ పత్రం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హామీ పత్రాలను బ్యాంకులకు చూపించి రుణాలు పొందాలని, బ్యాంకులు రుణాలు ఇవ్వడంలో ఏవైనా ఇబ్బందులు సృష్టిస్తే.. మండల, జిల్లా గ్రీవెన్స్ సెల్స్‌కు ఫిర్యాదు చేయాలని కూడా అందులో పేర్కొననున్నారు. ఒక్కో మండలంలో దాదాపు ఆరేడువేల మంది రైతులకు ఈ విధమైన  హామీ పత్రాలపై మండల తహశీల్దార్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతకాలు చేసి ఇస్తారని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ హామీ పత్రాలు ఇవ్వడం వల్ల తమ రుణాల్లో కొంతమొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించిందన్న విషయం రైతుల దృష్టికి వెళ్తుందని, ఇదివరకు ఉన్న రుణాలను రెన్యూవల్ చేసుకోవడానికి, కొత్త రుణాలు తీసుకోవడానికి వారు ముందుకు వస్తారని సర్కారు ఆశిస్తోంది. ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసి.. ప్రజాప్రతినిధులతో వీటిని రైతులకు అందించడం వల్ల రుణమాఫీపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న విషయం కూడా విస్తృతంగా రైతుల్లోకి వెళ్లుందని భావిస్తోంది.



బ్యాంకులకు చేరిన రుణ మాఫీ నిధులు..



రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 4,250 కోట్లు బ్యాంకులకు చేరినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి వివరించారు. ఈ మొత్తంతో బ్యాంకులు రైతుల రుణాల్లో 25 శాతాన్ని మాఫీ చేస్తాయని ఆ అధికారి వివరించారు. కలెక్టర్ నియమించిన మండల నోడల్ ఆఫీసర్ దీన్ని పర్యవేక్షిస్తున్నారు. అక్షర క్రమంలో రోజుకు కొన్ని గ్రామాల చొప్పున రుణమాఫీకి అర్హులైన రైతులను ఆయా బ్యాంకులకు పిలిపిస్తారు. వారి రుణాన్ని మరోసారి పరిశీలించి... కొత్త రుణాలను అప్పటికప్పుడే ఇచ్చేస్తారు. ఈ ప్రక్రియ ఇప్పటికే కొన్ని చోట్ల ప్రారంభమైందని అధికారులు చె బుతున్నారు. రైతులకు గతంలో వచ్చిన మాదిరిగా పూర్తిస్థాయి రుణం వచ్చే అవకాశాలు లేవని, ప్రభుత్వం చెల్లించిన రుణానికి సంబంధించిన మొత్తంతోపాటు  స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఐదు నుంచి పదిశాతం అదనంగా, అలాగే వినియోగ రుణం కింద 20 నుంచి 30 శాతం అదనంగా రుణం లభించే అవకాశం ఉందని సదరు అధికారి వ్యాఖ్యానించారు.

 

‘అర్బన్’ బంగారు రుణాలకు మాఫీ లేనట్టే!


 

పట్టణ, మెట్రో నగరాల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలకు ప్రస్తుతానికి రుణమాఫీ వర్తింప చేయబోమని బ్యాంకు వర్గాలు తెలిపాయి. అర్బన్ బ్యాంకుల్లో తీసుకున్న రుణాల్లో చాలామటుకు పంట కోసం కాకుండా ఇతరత్రా వ్యక్తిగత అవసరాల కోసమే తీసుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిపై మరింత పరిశీలన చేశాకే రుణామాఫీని వర్తింప చేసే అంశాన్ని పరిశీలిస్తామని చెబుతున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వం విడుదల చేసిన పావు వంతు రుణమాఫీ సొమ్ము అర్బన్, మెట్రో నగరాల్లో బంగారంపై రుణం తీసుకున్న రైతుల ఖాతాలోకి వెళ్లే అవకాశం లేదు. ‘అర్బన్, మెట్రో నగరాల్లో కొన్ని ప్రైవేటు, చిన్న బ్యాంకులు ఒక ఎకరా ఉన్న రైతుకు కూడా బంగారంపై ఐదారు లక్షల రూపాయల రుణాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అంతంత రుణాలు ఇవ్వడంలో ఔచిత్యం ఏంటో బోధపడడంలేదు. ఇలాంటి రుణాలపై మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ రుణాలను మాఫీ చేయడంలేదు’ అని బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. లక్ష జనాభా దాటిన పట్టణాలను అర్బన్లుగా రిజర్వుబ్యాంకు నిర్వచించింది. ఆ ప్రకారం తెలంగాణలో ఉన్న అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో తీసుకున్న బంగారు రుణాలకు మాఫీ వర్తించే అవకాశం ప్రస్తుతానికి లేనట్టే.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top