తెలంగాణ ఆచారాలు అదుర్స్

తెలంగాణ ఆచారాలు అదుర్స్


తెలంగాణ ఆచార వ్యవహారాలు సూపర్బ్‌గా ఉన్నాయని, పోచంపల్లి పర్యటన మంచి అనుభూతినిచ్చిందని విదేశీ ప్రతినిధుల బృందం కొనియాడింది. హైదరాబాద్‌లో జరుగుతున్న 12వ ‘ప్రపంచ మహిళా కాంగ్రెస్’ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి 10 దేశాల నుంచి వచ్చిన 25 మంది శుక్రవారం గ్రామీణ ప్రజల జీవన విధానాలు, చేతి వృత్తులను పరిశీలించడానికి పోచంపల్లిని సందర్శించారు. స్థానిక గ్రామీణ పర్యాటక కేంద్రంలో వీరికి తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు.

 

అనంతరం వారు భూదానోద్యమ చరిత్ర ఫొటో గ్యాలరీ, చేనేత వస్త్రాల స్టాల్స్‌ను తిలకించారు. చేనేత కార్మికుల గృహాల కు వెళ్లి నూలు, రంగులద్దకం, చిటికి కట్టడం వంటి వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలించారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల డిజైన్‌లు చూసి అబ్బురపడి కొనుగోలు చేశారు. అనంతరం తెలంగాణ గ్రామీణ వంటకాలనూ  రుచి చూశారు. గిరిజన యువతులతో కలిసి నృత్యాలు చేశారు. వీరికి టూర్ ఆర్గనైజర్ సుప్రియ బాలిరావు మార్గదర్శకం చేశారు.

- భూదాన్‌పోచంపల్లి

 

ప్రజల ఆదరాభిమానాలు మరువలేనివి

ఇక్కడి ప్రజలు ఎంతో స్నేహ పూర్వకంగా ఉన్నారు. వారు చూపించిన ఆదరాభిమానాలు మరువలేనివి. ప్రపంచ దేశాలలో ఇప్పుడిప్పుడే మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మా దేశ అధ్యక్షురాలైన డిల్మరూసా కూడా ఓ మహిళనే. బ్రెజిల్‌లో స్త్రీల అక్షరాస్యత 60శాతం ఉంది. క్రి కెట్ కంటే సాకర్, అథ్లెటిక్స్ ఆటలకు ప్రోత్సహాం ఉంటుంది.

- సెంటియర్, బ్రెజిల్

 

అభివృద్ధిలో ఇండియా ముందుంది

అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇండియా ముందుంది. ఇక్కడి మహిళలు కుటుంబ బాధ్యతను సమష్టిగా పంచుకోవడం గొప్ప విషయం. ప్రజల ఆచారాలు, సంప్రదాయాలు ఎంతగానో ఆకట్టుకొన్నాయి. ప్రాచీనమైన చేనేత కళను పరిర క్షించుకోవాలి. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు బాగున్నాయి.

- మిల్లిహట్టన్, కెనడా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top