నిరుద్యోగులకు వరం


* అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన

* నాలుగైదు నెలల్లో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం

* రాష్ట్రంలో ఖాళీల సంఖ్య 1,07,744

* ఉద్యోగుల విభజన తర్వాత ఈ సంఖ్యపై మరింత స్పష్టత

* విద్యుత్ ప్రాజెక్టులతో మరిన్ని ఉద్యోగావకాశాలు

* కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న కేసీఆర్



సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు శుభవార్త! ఉద్యోగాల భర్తీ కోసం వయో పరిమితిని ఐదేళ్లు సడలిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అలాగే రాష్ర్టంలో లక్షకుపైగా ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని వెల్లడించారు. అసెంబ్లీలో సోమవారం ఈ అంశంపై జరిగిన చర్చకు సీఎం సమాధానమిస్తూ.. నిరుద్యోగులకు వయో పరిమితిని ఐదేళ్లు సడలించి, నాలుగైదు నెలల్లో ఉద్యోగాల భర్తీ చేపడతామని స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు.



తెలంగాణలో 1,07,744 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు. ఆర్టీసీ, సింగరేణి, ఇతరత్రా కార్పొరేషన్లకు సంబంధించి ఉన్న కొన్ని చిక్కులు తొలగాల్సి ఉందన్నారు. పది వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రాజెక్టును చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు. అలాగే 6 వేల మెగావాట్లతో జెన్‌కో చేపట్టబోయే ప్రాజెక్టు ద్వారా 10 నుంచి 12 వేల ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అందువల్ల నిరుద్యోగ యువత ఎలాంటి నిరాశకు లోను కా వొద్దని విజ్ఞప్తి చేశారు. నాలుగైదు నెలల్లో నియామకాలు చేపడతామని సీఎం స్పష్టం చేశారు.



ఇంకా ఉద్యోగులు, సంస్థల సంఖ్య తేలకపోవడంతో సందిగ్ధత నెలకొన్నదని, విభజన ప్రక్రియను కమల్‌నాథన్ కమిటీ పూర్తి చేశాక ఎంతమంది మిగులుతారో లెక్క తేలుతుందని ఆయన వివరించారు. ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. ఒకప్పుడు ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు ఉండేవని, ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రైవేటు రంగంలోనూ విరివిగా అవకాశాలు లభిస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. 



కొన్ని శాఖల్లో ఉద్యోగాల సంఖ్యను పెంచుతామని, హేతుబద్ధీకరణ చేయాల్సి ఉందని, కొన్ని శాఖలను కుదించాల్సి ఉందని సభలో వివరించారు. ఏదైనా కమలనాథన్ కమిటీ తేల్చిన తర్వాతే ఖాళీల భర్తీ విషయలో ముందుకు వెళ్తామన్నారు. రాష్ర్టంలో 25 వేల మంది వరకు  కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. వారిని కూడా క్రమబద్ధీకరిస్తామన్నారు. ఇందులో రూల్ ఆఫ్ రోస్టర్, రిజర్వేషన్ల విధానాన్ని పాటిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని వేశామని, త్వరలోనే ఆ నివేదిక వస్తుందని సీఎం చెప్పారు. అంగన్‌వాడీ, రాజీవ్ విద్యామిషన్, కస్తూర్బా వంటి కేంద్ర పథకాల్లో పనిచేసే వారు ఉద్యోగులు కారని, గౌరవ వేతనం తీసుకునే వారు మాత్రమేనని పేర్కొన్నారు. ఆ పథకాలుంటే వారుంటారు లేకుంటే పోతారని వ్యాఖ్యానించారు.



ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను ఎవరు తెచ్చారో అందరికీ తెలుసన్నారు. పోలీస్ శాఖలో డ్రైవర్లు ఇతరత్రా 3,700 ఉద్యోగాలను భర్తీకి ఆదేశాలిచ్చినట్లు ఆయన తెలిపారు. 1985, 1998, 2000, 2002 డీఎస్సీ వివాదాలను గత ప్రభుత్వాలు వారసత్వంగా తీసుకొచ్చాయని విమర్శించారు. ఇన్నాళ్లూ పెంట పెట్టి ఇప్పుడు చిటికెలో కడగేయాలంటే ఎలాగని ప్రశ్నించారు. ఇక నూతన పారిశ్రామిక విధానాన్ని ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తామని చెప్పారు. 2.35 లక్షల ఎకరాలను టీఎస్‌ఐఐసీకి అప్పగించడానికి ఏర్పాట్లు చేశామని చెప్పుకొచ్చారు.



వర్గాలవారీగా వయోపరిమితి వివరాలు



జనరల్ పోస్టుల్లో..

జనరల్ వారికి 34+5(సడలింపు)=39 ఏళ్లు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 34+5(సామాజిక రిజర్వేషన్)+5 (సడలింపు)= 44 ఏళ్లు

అన్ని వర్గాల వికలాంగులకు వైకల్యాన్ని బట్టి 3 లేదా ఐదేళ్ల అదనపు వయో పరిమితి ఉంటుంది

ఇన్ సర్వీస్ ఉద్యోగుల్లో జనరల్ అభ్యర్థులకు 34+5(సడలింపు)=39 ఏళ్లు+సర్వీసు ను బట్టి గరిష్టంగా ఐదేళ్ల అదనపు పరిమితి

ఇన్ సర్వీస్ ఉద్యోగుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 34+5(సామాజిక రిజర్వేషన్)+5(సడలింపు)= 44 ఏళ్లు+ సర్వీసును బట్టి గరిష్టంగా ఐదేళ్ల అదనపు పరిమితి



యూనిఫాం పోస్టుల్లో..

డీఎస్పీ వంటి పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 28+5(సడలింపు)= 33 ఏళ్లు

ఈ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 28+5(సామాజిక రిజర్వేషన్)+5(సడలింపు)=38 ఏళ్లు

సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల్లో జనరల్ అభ్యర్థులకు 25+5(సడలింపు) = 30 ఏళ్లు

ఈ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 25+5(సామాజిక రిజర్వేషన్)+ 5(సడలింపు) = 35 ఏళ్లు

ఫైర్ సర్వీసెస్, ఎకై్సజ్ సూపరింటెండెంట్ పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 26+5(సడలింపు)= 31 ఏళ్లు

ఈ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 26+5(సామాజిక రిజర్వేషన్)+5(సడలింపు) = 36 ఏళ్లు



ఉపాధ్యాయ పోస్టుల్లో..

జనరల్ అభ్యర్థులకు 39+5(సడలింపు) = 44 ఏళ్లు

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39+5(సామాజిక రిజర్వేషన్)+5(సడలింపు) = 49 ఏళ్లు

వికలాంగులకు 39+5(సామాజిక రిజర్వేషన్)+5(వికలాంగుల రిజర్వేషన్)+ 5(సడలింపు)= 54 ఏళ్లు



మేం మద్దతిస్తే.. ఇలా చేస్తారా: ఎంఐఎం

ఉద్యోగాల కల్పనపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సభలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ కోరగా... 344 కింద నోటీసు ఇచ్చిన సభ్యులే మాట్లాడాలని స్పీకర్ మధుసూదనాచారి సమాధానమిచ్చారు. విద్యుత్‌పై అందరితో ఎలా మాట్లాడించారని అక్బరుద్దీన్ ప్రశ్నించగా... నోటీసు ఇచ్చినవారే మాట్లాడాలని బీఏసీలో నిర్ణయించినట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఏసీలో నిర్ణయించింది నిజమైతే తాను రాజీనామాకు సిద్ధమని అక్బర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి భేషరతుగా మద్దతు ఇస్తుంటే ఇలా చే స్తారా అని నిలదీశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top