ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం


* ఏకగ్రీవంగా ఆమోదించిన ఉభయసభలు

* బక్రీద్, రంజాన్, క్రిస్మస్‌లకు రెండురోజుల చొప్పున సెలవులు

* బిల్లుకు మద్దతిస్తూనే వాకౌట్ చేసిన టీడీపీ



సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యవినిమయ బిల్లును శుక్రవారం శాసనసభ, శాసనమండలి శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఉభయసభల్లో బిల్లుపై విస్తృత చర్చ జరిగింది. అయితే, బిల్లుకు టీడీపీ మద్దతు పలుకుతూనే... తమ సభ్యుడు రేవంత్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ సభ నుంచి వాకౌట్ చేసింది. బిల్లుపై ఓటింగ్ కోరుతామని విప్ జారీ చేసిన కాంగ్రెస్, చివరి క్షణంలో మద్దతు తెలిపింది.



అంతకుముందు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బిల్లుపై సభ్యులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. సభ్యులు  చేసిన కొన్ని సూచనలను ముఖ్యమంత్రి ఆమోదించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఎదురవుతున్న సవాళ్లు, వాటిని ఎలా అధిగమిస్తారో ఆయన వివరించారు. సంక్షేమ పథకాల కొనసాగింపు, పెన్షన్లు, రేషన్‌కార్డుల్లో కోతలు లేకుండా ఇవ్వడం, వాటర్‌గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ ఉత్పత్తి, ఆర్థిక పరిస్థితి, రోడ్ల నిర్మాణం, 108, 104 సర్వీసులను మెరుగుపరచడం వంటి అంశాలను సోదాహరణంగా వివరించారు.



వాటర్‌గ్రిడ్ ద్వారా నాలుగున్నరేళ్ల కాలంలో ప్రతి గుడిసెకు, ఇంటికి కొళాయిల ద్వారా నీటిని అందించలేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని పునరుద్ఘాటించారు. ‘‘సహనం ఉండాలని కొందరు నాకు సలహాలిస్తున్నారు. ఉప్పూకారం తింటున్నాం. హద్దులు మీరితే (బియాండ్ లిమిట్ పోతే) విమర్శలపై తగిన విధంగా స్పందిస్తాం’అని స్పష్టం చేశారు.



ప్రజాక్షేమమే ధ్యేయంగా...

‘ప్రభుత్వానికి, రాజకీయ పార్టీకి  ధైర్యం, సాహసం కావాలి. ప్రజల క్షేమాన్ని కాంక్షించి ప్రతిష్టాత్మకంగా వీటి ని చేపడుతున్నాం. తెలంగాణకు వాటా ప్రకారం రావాల్సిన విద్యుత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ తొండాట కొనసాగిస్తూనే ఉంది. కేంద్రం నిర్ణ యాత్మకంగా వ్యవహరించడం లేదు. ఏపీ నుం చి తెలంగాణకు విద్యుత్ వాటా రాకపోతే, మేం కూడా ఏపీకి వాటా ఇవ్వబోము. కృష్ణపట్నం నుంచి నేటికి 650 మెగావాట్లు ఏపీ ఉత్పత్తి చేస్తున్నా తెలంగాణకు 6 మెగావాట్లు కూడా ఇవ్వడం లేదు. ఏపీ నుంచి విద్యుత్ వస్తే 2700 మెగావాట్లు ఉంటుంది. తెలంగాణ వాటా ఇవ్వకపోతే 2000 మెగావాట్లు ఉంటుంది. త్వరలోనే  అఖిల పక్షంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులను కలుసుకుని సమస్యలపై చర్చిద్దాం. అమరులను గౌరవించలేని కుసంస్కారం మాది కాదు. (మృతుల) లెక్కలింకా తేలలేదు. వివరాలు వచ్చినకాడికి పరిహారం ఇవ్వాలని చెప్పాం’ అని కేసీఆర్ వివరించారు.



108 సర్వీసు బ్రహ్మాండం

వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా, 108 సర్వీసు బ్రహ్మాం డంగా పనిచేసిందని కేసీఆర్ చెప్పారు. ‘ఎవరు మంచి పని చేసినా  అభినందించాల్సిందే. నేను తెలంగాణ ఉద్యమంలో పరకాల దగ్గర ఉండగా ప్రమాదం జరిగితే, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తీసుకెళితే మంచిదని ఆగాను. అంతలో పక్కనున్న యువకులు 5 నిమిషాల్లో అంబులెన్స్ వస్తుం దని చెప్పారు. చూస్తుండగానే 108 సర్వీసు వచ్చింది. ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించేలా ఆ సర్వీసు నడిచింది.



వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం 104 సర్వీసు ద్వారా గ్రామీణప్రాంతాల్లోని గర్భిణులు, నిరుపేదలకు షుగర్,బీపీ, రక్తహీనత, ఇతరాలకు మంచి సేవలను అందించార’ని సీఎం తెలిపారు. 108, 104 సర్వీసులను క్రమబద్ధీకరించి 411 ఉన్న వాహనాల ను 927కు పెంచబోతున్నామని చెప్పారు. ‘కొత్త 108 సర్వీసులను చూసి ప్రజలు సంతోషిస్తారు.



ప్రభుత్వ ఆసుపత్రులకు (ఉస్మానియా,గాంధీ,నీలోఫర్, సుల్తాన్‌బజార్, పేట్లబుర్జు,42 ఏరియా ఆసుపత్రులు) మొత్తం 400 కోట్ల మేర కేటాయించాం. ఆరోగ్యశ్రీ కింద ఉద్యోగులకు ఎలాం టి ప్రీమియం లేకుండా దేశంలోకాని, మరే రా ష్ర్టంలో కాని లేని విధంగా రూ. 323కోట్లతో పథకాన్ని అమలుచేస్తున్నాం. క్రిస్మస్, రంజాన్, బక్రీద్‌లకు ఇకపై రెండురోజుల చొప్పున ప్రభుత్వ సెలవులు ఉంటాయని ప్రకటించారు అదనంగా ఒకరోజు సెలవు తీసుకున్నందుకు రెండో శని వారం సెలవుదినాల్లో పని చేయాలన్నారు.



రెండు విడతల్లో రీయింబర్స్‌మెంట్

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను మరో రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పారు. మూడు విడతలుగా రైతుల రుణ మాఫీ చేస్తామన్నారు. పెన్షన్లలో, ఎలాంటి కోత విధించబోమన్నారు. బియ్యం కార్డులను గుంజుకోబోమని, ఏడాదికి మూడు, నాలుగు వేల కోట్ల రూపాయ ల భారం పడినా పెన్షన్లు ఇస్తామన్నారు. హైదరాబాద్‌తో సహా వరంగల్,నిజామాబాద్, కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో  50, 60, 70 గజాల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న పేదలకు పట్టాలు ఇచ్చి  రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు.



రెవెన్యూ లోటుపై గణాంకాలేవి: అక్బర్

రెవెన్యూ మిగులు లోటుపై ప్రభుత్వం ఎలాంటి గణాంకాలు ఇవ్వలేదని అక్బరుద్దీన్ ఒవైసీ (మజ్లిస్) ఆరోపించారు. ఈ ఆరునెలల ఆదాయ, వ్యయాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రంజాన్, క్రిస్మస్‌లకు రెండురోజుల వంతున సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.



ఎన్నాళ్లీ తప్పటడుగులు: కిషన్‌రెడ్డి

ప్రభుత్వం తప్పటడుగులు వేస్తూ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని బీజేపీ సభ్యు డు కిషన్‌రెడ్డి అన్నారు. సభ్యుల హక్కులను స్పీకర్ కాపాడి రక్షణగా ఉండాలన్నారు.



గిరిజన విశ్వవిద్యాలయమేది: తాటి

కేంద్రం మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రకటించాలని తాటి వెంకటేశ్వర్లు (వైఎస్సార్‌సీపీ) డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ,.బీసీ,మైనారిటీల ఉపకార వేతనాలు పెంచాలని, పిజీ,డిగ్రీ విద్యార్థులకు రూ.3 వేలు, స్కూలు విద్యార్థులకు రూ.2వేలు చొప్పున చెల్లించాలని సున్నం రాజయ్య (సీపీఎం) కోరా రు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేసేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని బాజిరెడ్డి గోవర్ధన్ (టీఆర్‌ఎస్) అన్నారు.



సభలో సంవాదం...

‘ప్రభుత్వ స్టీరింగ్, బ్రేకులు తన వద్దే ఉన్నాయని ఒక నేత ప్రకటించారు. దానిపై ఏ మని స్పందిస్తారు?’ అన్న బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎంఐఎం సభ్యుడు అహ్మద్ బలాల అభ్యంతరం చెప్పారు. ‘నా కారు నేనే నడిపిస్తా. బ్రేకులు నా అధీనంలో ఉంటాయి’ అని తమ అధ్యక్షుడు అసదుద్దీన్ చెప్పినదాన్ని ఒక పత్రికలో వక్రీకరించారన్నారు. బీజేపీ సభ్యులు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మక్కామసీదు పేలుళ్లకు పాల్పడినవారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తానెవరి పేరూ ప్రస్తావించలేదని, పత్రికలో వచ్చిందే చెబుతున్నానని కిషన్‌రెడ్డి స్పందించారు. హిందువులను, దేవాలయాలను కించపరుస్తున్న వారు మాకు నీతులు చెబుతారా అంటూ నిలదీశారు.



మండలిలో బిల్లు పెట్టిన మంత్రి ఈటెల రాజేందర్

ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు యాదృచ్ఛిక ఖర్చులకు సంబంధించిన కంటింజెన్సీ బిల్లు, టీఎస్-ఐపాస్ బిల్లులను మండలిలో అన్ని పక్షాలూ మద్దతు పలికాయి. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఆమోదానికి విపక్షాలు సహకరించాలని కోరుతూ.. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ బిల్లును ప్రతిపాదించగా విపక్షనేత డి. శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నేత నర్సారెడ్డి, మజ్లిస్ నాయకుడు హైదర్ రజ్వీ తదితరులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం బడ్జెట్ బిల్లును శాసన మండలి ఆమోదించినట్టు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top