పాతబడిందని చార్మినార్ను కూల్చేస్తారా?

పాతబడిందని చార్మినార్ను కూల్చేస్తారా? - Sakshi


హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని  సీఎల్పీ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కేసీఆర్ సర్కార్ అమలు చేయడం లేదని ఆయన గురువారమిక్కడ అన్నారు. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతోనే  విద్యార్ధి పోరు గర్జనను నిర్వహించాల్సి వచ్చిందన్నరు. బకాయిలు ఇచ్చేంతవరకూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తామని జానరెడ్డి స్పష్టం చేశారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దిల్‌సుఖ్‌నగర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.


పాతబడిందని చార్మినార్ను కూల్చేస్తారా?

విద్యార్థి పోరు గర్జనలో పాల్గొన్న ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యార్థులను శత్రువులుగా చూస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. దీంతో కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్కు డబ్బులు లేవంటున్న ప్రభుత్వానికి కొత్త సచివాలయం నిర్మించడానికి నిధులు ఎలా వచ్చాయన్నారు. వాస్తు బాగోలేదని, పాతబడిందని చార్మినార్ను కూల్చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు.


పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించకుండా ఇచ్చిన హామీని విస్మరించి, తనకు మాత్రం సౌకర్యవంతమైన ఇళ్లు నిర్మించుకున్నారని ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లు నిర్మించిన తర్వాతే కేసీఆర్ అధికార నివాసంలోకి వెళ్లాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటించాలని, వెంటనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలన్నారు.


ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొప్పుల రాజు, ఎమ్మెల్యేలు జానారెడ్డి, వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, భిక్షపతి యాదవ్, కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top