‘నిఘా’ నీడలో నాయకులు


నిఘా విభాగం నిరంతర నిఘాతో నేతల హడల్

ఉక్కిరిబిక్కిరవుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

వారి నీడను కూడా నమ్మలేని స్థితిలో నాయకులు

అన్ని వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సీఎంకు నివేదికలు

ఇప్పటికే పలువురిని హెచ్చరించిన కేసీఆర్

బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మంత్రులు

సీఎంతో సమావేశమై రాగానే ఫోన్లు స్విచాఫ్

మీడియా ముందుకు వచ్చేందుకే జంకుతున్న వైనం




సాక్షి, హైదరాబాద్: మంత్రుల వ్యవహారశైలిపై నిరంతర నిఘా కొనసాగుతున్నట్లు వస్తున్న కథనాలతో అమాత్యులెవరికీ కంటి మీద కునుకుండటం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రజా ప్రతినిధులపై ఇంటెలిజెన్స్ నిఘా వేసినట్లు ఇటీవలి ఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలంతా బిక్కుబిక్కుమంటూ వ్యవహరిస్తున్నారు. వైద్య, ఆరోగ్య మంత్రిగా రాజయ్య వ్యవహరించిన తీరుపై నిఘా విభాగం ప్రభుత్వానికి వరుసగా నివేదికలు ఇచ్చినట్లు సమాచారం.



ఆయన తీసుకున్న నిర్ణయాలు, జరిపిన సంప్రదింపులు, వైద్య శాఖలో అవినీతి వ్యవహారాలకు సంబంధించి నిఘా విభాగం గత ఆరు మాసాల్లో అరడజను నివేదికలు ఇచ్చింది. అవినీతి ఆరోపణల కంటే ఆయన వ్యవహారశైలిపైనే నిఘా విభాగం ఎక్కువ నివేదికలిచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓ వ్యవహారంలో ఆయన ప్రమేయాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది.



అంతే కాకుండా రాష్ట్ర మంత్రులకు సంబంధించి వారు తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహారశైలిపైనా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదికలు అందుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. దీంతో మంత్రులు తమ నీడను తామే నమ్మడం లేదని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. అందరిమీదా నిఘా ఉందనే ప్రచారం జరుగుతుండటంతో ప్రైవేట్ కార్యక్రమాలకు సైతం మంత్రులు దూరంగా ఉంటున్నారు.



అన్ని వ్యవహారాలపైనా నివేదికలు

ఈ నెల 25న ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన సందర్భంలో తన దృష్టికి వచ్చిన అనేక అంశాలను కేసీఆర్ బయటపెట్టడంతో మంత్రులు తమపై నిఘా ఉన్నట్లు గుర్తించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, వ్యక్తిగత వ్యాపారాలు, శాఖల్లో జరుగుతున్న వ్యవహారాలు, ముఖ్యంగా బదిలీలు, డిప్యుటేషన్లు, కాంట్రాక్టులు తదితర అంశాలపై నిఘా పెట్టినట్లు సమాచారం. పార్టీ నేతలు ఎవరెవరు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నారన్న దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు సమాచారం.



‘‘వైద్య, ఆరోగ్య శాఖలో పారామెడికల్ సిబ్బంది నియామక ఏజెన్సీల వ్యవహారం, ఆసుపత్రుల్లో యంత్ర పరికరాల కొనుగోళ్లు, 108 వాహనాల కొనుగోలుకు పర్సెంటేజీలు మాట్లాడుకోవడం వంటి అంశాలు నిఘా నివేదికలతోనే వెల్లడయ్యాయి. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు’’ అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. నల్లగొండ  జిల్లాలో తన తల్లికి పదోన్నతి రాదని తెలిసి మొత్తం ప్రక్రియనే నిలిపివేసిన ఓ ఎమ్మెల్యే వ్యవహారంపైనా ఇంటలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు తెలియడంతో ఎమ్మెల్యేల్లోనూ గుబులు మొదలైంది.



నిజామాబాద్ జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు అధికార వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని కూడా ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిందట. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు వ్యవహారంపైనా కేసీఆర్‌కు నివేదికలు అందాయి. మంచిర్యాల నియోజకవర్గం పరిధిలోని నస్పూర్‌లో సర్వే నంబర్ 46లోని ఆరెకరాల సీలింగ్ భూమి, మరో పది ఎకరాల ప్రభుత్వ భూమిని సదరు ఎమ్మెల్యే బినామీ పేర్లతో సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.



అలాగే మరోచోట 102 ఎకరాల భూమిలో పట్టాలు మార్చినందుకు ఏకంగా 25 శాతం కమీషన్ చేతులు మారిందని కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టులు అందినట్లు చెబుతున్నారు. నాయకులందరిపైనా నిఘా విభాగం నుంచి నివేదికలు తెప్పించుకుంటున్న ప్రభుత్వం, ఈ వైనాన్ని వ్యూహాత్మకంగా ప్రచారంలో కూడా పెడుతోంది. దీంతో ఒకరకమైన అభద్రతాభావం ప్రజాప్రతినిధుల్లో నెలకొంది.



సీఎం సమావేశం తర్వాత ఫోన్లు స్విచాఫ్

ఆయా శాఖలకు సంబంధించి సీఎం ఆధ్వర్యంలో సమీక్షలు జరిగిన తర్వాత మంత్రులు ఆ వివరాలను మీడియాకు చెప్పడం పరిపాటి. కానీ, ఇటీవల మంత్రులు నోరు విప్పడం లేదు. సీఎం సమావేశాల నుంచి బయటకు రాగానే తమ ఫోన్లు స్విచాఫ్ చేసుకుంటున్నా రు. వారి శాఖలో ఏం జరుగుతుందో చెప్పేం దుకు కూడా కొందరు మంత్రులు మందుకు రావడం లేదు. ముఖ్యంగా మీడియాతో మా ట్లాడితే ఇబ్బందులు వస్తాయని వారు భయపడుతున్నారు. ఇక కుటుంబ సభ్యులు, బంధువులను సచివాలయంలో తమ పేషీల దరిదాపులకు రానీయడం లేదు. ‘మా అబ్బాయి ఏదో పని మీద సచివాలయం వచ్చాడు. మంచిది కాదని వారించి వెంటనే అతన్ని కిందనుంచే వెనక్కి వెళ్లమని చెప్పా’ అని ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ మంత్రి చెప్పారు. మొత్తం మీద నిఘా విభాగం నీడ తమను వెంటాడుతుందేమోనన్న అనుమానంతో మంత్రులు, ఇతర నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.



చిటికెలో సీఎంకు సమాచారం

దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ మంత్రి ఇటీవల తన సన్నిహితులతో కలిసి విదేశాలకు వెళ్లాలని అనుకున్నారట. ఈ విషయం ముందే ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిసింది. తనకు అత్యంత సన్నిహితులైన వారితో పంచుకున్న విషయం కూడా బయటకు ఎలా పొక్కిందో తెలియక ఆయన అయోమయానికి లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఇతర మంత్రులు ఆత్మరక్షణలో పడిపోయారు.



తెలంగాణ మంత్రివర్గంలో అవకాశం దక్కిన వారిలో సీనియర్లు కొందరే. మెజారిటీ మంత్రులంతా తొలిసారి అవకాశం దక్కిన వారే. రంగారెడ్డి జిల్లా పరిధిలోని మదీనగూడ సర్వే నంబర్ 60లోని స్థలంలో ప్రహరీగోడను మున్సిపల్ అధికారులు ఇటీవల కూల్చివేశారు. ఎందుకని ప్రశ్నించిన వారికి, ‘మంత్రిని అడగండి’ అని సిబ్బంది సమాధానమిచ్చారు.



ఈ విషయాన్ని నిఘా విభాగం వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. జిల్లాలోని మరికొన్ని చోట్ల కూడా భూ కబ్జాలపై ఒకరిద్దరు ప్రజాప్రతినిధులపై ఆరోపణలు వచ్చాయి. ‘కాగ్నా’ నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ వ్యాపారం చేస్తున్న కొందరు వ్యక్తులు మంత్రి అనుచరులేనన్న ఆరోపణలతో ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. తనమీద నిఘా విభాగం ఇలాంటి నివేదికలను ముఖ్యమంత్రికి ఇచ్చినట్టు బయటికి పొక్కడంతో సదరు మంత్రి ఇబ్బందిగా ఫీలయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top