సంప్రదాయ వృత్తుల్లోనే ఆరు లక్షల మంది

సంప్రదాయ వృత్తుల్లోనే ఆరు లక్షల మంది

  • అత్యధికంగా 91 వేల మంది లాండ్రీ వర్కర్లు

  • 85 వేల మంది గీత కార్మికులు..

  • 75 వేల మంది కార్పెంటర్లు

  • పని చేసే వయసులో ఉన్నవారు మొత్తం 2.39 కోట్ల మంది

  • సమగ్ర సర్వేలో తేలిన లెక్కలివీ..

  • కులాల వారీగా వృత్తిదారులకు

  • లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ ప్రణాళికలు

  • సాక్షి, హైదరాబాద్‌

    కుల వృత్తులకు చేదోడుగా నిలిచేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోంది. వృత్తిదారులకు నైపుణ్యాల శిక్షణతో పాటు ఆధునిక వసతులు కల్పిస్తే.. గ్రామాల ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయని రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన సామాజిక ఆర్థిక విశ్లేషణలు స్పష్టం చేశాయి. దీంతో వారి అభ్యున్నతి కోసం పలు పథకాలు రచించింది.


    ప్రధాన వృత్తులకు అనుబంధంగా కులవృత్తులు, వృత్తిదారులు, చిన్నాచితక పనులు చేసుకొని బతికే వారిని లక్ష్యంగా ఎంచుకుంది. సమగ్ర సర్వే సందర్భంగా ప్రభుత్వం 15 నుంచి 59 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వారందరినీ పనిచేసే వయసు వారీగా గుర్తించి.. వృత్తిదారుల సమగ్ర వివరాలను సేకరించింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలివీ..



    రోజువారీ కూలీలే ఎక్కువ

    రాష్ట్రంలో పనిచేసే వారిలో రోజువారీ కూలీలే అత్యధికంగా ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 2.39 కోట్ల మంది పని చేసే వయసులో ఉండగా.. వారిలో 31 శాతానిపైగా రోజువారీ కూలీలున్నారు. 29 శాతంతో రెండో స్థానంలో వ్యవసాయ కార్మికులున్నారు. 11 శాతం మంది సొంత వ్యవసాయం చేసుకునే రైతులున్నారు. వీరిది మూడో స్థానం. బీడీ కార్మికులు 4 శాతం మంది ఉన్నారు. తర్వాతి స్థానంలో డ్రైవర్లు, చిల్లర వ్యాపారులు, వలస కూలీలు, ఇతర వృత్తులు, ఇతర నైపుణ్యాలున్న వారున్నారు. దాదాపు లక్ష మంది ఇతర దేశాల్లో పని చేస్తున్నారు.



    లాండ్రీ వర్కర్లు అత్యధికం

    రాష్ట్రంలో ఆరు లక్షల మందికి పైగా సంప్రదాయ వృత్తులో ఉన్నారు. వీరిలో అత్యధిక సంఖ్యలో ఉన్నది లాండ్రీ వర్కర్లు (రజకులు). గీత కార్మికులు రెండో స్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానంలో చర్మకారులు, వడ్రంగులు, చేనేత కారులు, క్షురకులు, జాలర్లు, దర్జీలు, బంగారం పనివారు(స్వర్ణకారులు), పశుపోషకులు, కమ్మర్లు, కుమ్మర్లు, లోహ విగ్రహాలు తయారు చేసేవారున్నారు. సంప్రదాయ వృత్తులన్నీ కులాలతో ముడిపడి ఉన్నవి కావటంతో సంక్షేమ కార్యక్రమాల్లో వీరిని లక్ష్యంగా ఎంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పథకాలకు రూపకల్పన చేస్తోంది.



    యాదవులను, గంగపుత్ర, ముదిరాజ్‌ బోయ కులాలకు ఇప్పటికే గొర్రెల పంపిణీ పథకం, చేపల పంపిణీ పథకాలను అమలు చేస్తోంది. రజకులు, నాయిబ్రాహ్మణుల పథకాలకు రూ.500 కోట్లు కేటాయించింది. వీటితో రజకులకు వాషింగ్‌ మిషన్లు, డ్రయర్లు, ఐరన్‌ బాక్సుల పంపిణీ, దోబీఘాట్ల నిర్మాణంతో పాటు నాయీ బ్రాహ్మణులకు మోడర్న్‌ సెలూన్లను నెలకొల్పే పథకాలకు రూపకల్పన చేస్తోంది. విశ్వకర్మలుగా పిలిచే ఔసల, కమ్మరి, కంచరి, వడ్రంగి, శిల్పకారులకు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు రూ.200 కోట్లు, బట్టలు కుట్టే మేర, గీత కార్మికులకు, కుమ్మరి పనివారికి పరికరాల పంపిణీ, ఎంబీసీల అభివృద్ధి, సంక్షేమానికి రూ.1000 కోట్లు, చేనేతలకు రూ.1,200 కోట్లు కేటాయించింది.



    వలస వెళ్లింది 93 వేల మంది

    రాష్ట్రం నుంచి దాదాపు 93 వేల మంది ఇతర దేశాల్లో పని చేసేందుకు వలస వెళ్లారు. వలస జీవులతో పాటు నిరుద్యోగుల సంఖ్య భారీగానే ఉందని సర్వేలన్నీ వెల్లడిస్తున్నాయి. అసలు ఏ పని చేయకుండా ఉన్న కేటగిరీలో దాదాపు 8.36 లక్షల మంది ఉన్నారు. వీరందరూ నిరుద్యోగులని, నిరుద్యోగం కారణంగానే తాము ఏ పని చేయడం లేదని చెప్పుకున్నట్లు ఇటీవల ఆర్థిక, సామాజిక సర్వే సైతం వెల్లడించింది.  



    సమగ్ర సర్వే వివరాల ప్రకారం ఏ వర్గం వారు ఎంత మంది ఉన్నారంటే..

    లాండ్రీ వర్కర్లు:        91388

    గీత కార్మికులు:        85563

    వడ్రంగులు:        75648

    చేనేత కారులు:        56371

    కౌలు వ్యవసాయం:         52845

    పాడి పశువుల పోషకులు:    47458

    నాయిబ్రాహ్మణులు:        42751

    జాలర్లు:            36244

    దర్జీ పని చేసే వారు:        30680

    స్వర్ణకారులు:        25779

    పారిశుద్ధ్య పనివారు:        19476

    కమ్మరి పని చేస్తున్న వారు:    18841

    కళాకారులు:        14256

    కుమ్మరి పని చేస్తున్న వారు:    11539

    కంచు పని వారు:        5747

    పాదరక్షలు చేసేవారు:        5545

    భిక్షాటన చేస్తున్న వారు:    18,396

    ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు:    15,150

    దుకాణాల్లో పని చేస్తున్నవారు:    8236

    అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌:    6705    



    ప్రధాన వృత్తులు              వ్యక్తులు

    రోజువారీ కూలీలు             3617275

    వ్యవసాయ కార్మికులు        2708706

    రైతులు                       1292876

    బీడి కార్మికులు                 457827

    డ్రైవర్లు                           348053

    చిల్లర వ్యాపారులు              288957

    వలస కూలీలు                 213553

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top