టెర్రరిజం, నక్సలిజం అరికడుతున్నాం: హోంమంత్రి

టెర్రరిజం, నక్సలిజం అరికడుతున్నాం: హోంమంత్రి


సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టెర్రరిజం, నక్సలిజాన్ని అరికడుతున్నామని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మారేడుపల్లి నెహ్రూపార్కులో 45 లక్షల రూపాయల వ్యయంతో 60 సీసీ కెమెరాల ప్రాజెక్టును  మల్కాజిగిరి ఎంపీ సిహెచ్‌ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో ఎన్నో మార్పులు వచ్చాయని, టెర్రరిజం, నక్సలిజం, రౌడీయిజం, గూండాయిజంలను అరికట్టగలిగామని నాయిని నర్సింహ్మారెడ్డి అన్నారు.


సీసీ కెమెరాల ఏర్పాటుతో రాష్ట్రంలో క్రైమ్‌ రేటు పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ప్రశాంత వాతావరణంలో హైదరాబాద్‌ నగరవాసులు గడుపుతున్నారని తెలిపారు. పోలీసు శాఖ మహిళలకు అధిక ప్రాదాన్యతనిస్తూ వారికి అండగా నిలుస్తుందన్నారు. సీసీ కెమెరాల్లో లభించిన ఆధారాలతో ఇప్పటివరకు 100 మందికి పైగా చైన్‌స్నాచర్‌లను, పీడీ యాక్టుపై జైలుకు పంపామని ఆయన పేర్కొన్నారు. ఎన్నో కేసుల్లో సీసీ కెమెరాలు కీలకంగా మారి నిందితులను పట్టించగలిగాయన్నారు. మరికొద్ది రోజుల్లో కమాండ్‌ కంట్రోల్‌ నిర్మాణం పూర్తవుతుందని, రాష్ట్రంలో ఎటువంటి సంఘటనలు జరిగినా నిమిషాల్లో నిందితులను పట్టుకోగలుగుతామన్నారు.


బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం ముందుకు సాగుతుందని, ప్రజలందరు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్బంగా ఆయన కోరారు. సంఘవిద్రోహులను ప్రోత్సహించవద్దని ఆయన హితవుపలికారు. ప్రజాప్రతినిధులు సైతం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగడం హర్షించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు స్టీఫెన్‌సన్, ప్రభాకర్, నార్త్‌జోన్‌ డీసీపీ బి.సుమతి, ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ ఉమామహేశ్వరరావు, పలువురు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top